లోకేష్ కి ఏం అర్హత ఉంది?, తుప్పు నిప్పు కాదు: బాబు, లోకేష్ లపై వైఎస్ షర్మిల కామెంట్స్

14:26 - March 25, 2019

*లోకేష్‌కు జయంతి, వర్థంతికి తేడా తెలియదు

* ఏ అర్హత ఉందని మూడుశాఖలకు మంత్రిని చేశారు?

*ప్రెస్ మీట్ లో  నారా లోకేష్, చంద్రబాబులపై వైఎస్ షర్మిల కామెంట్స్ 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెడుతూ ఉన్నారు. ఇప్పటికే ప్రెస్  మీట్ పెట్టి స్పందించిన వైఎస్ షర్మిల ఇప్పుడు  ఎన్నికల ప్రచారానికి కూడా సమాయత్తం అవుతున్నారు. ఈ నెల ఇరవై ఏడో తేదీ నుంచి వైఎస్ షర్మిల ప్రత్యక్ష ప్రచారం మొదలు కానుందని సమాచారం. అయితే అసలు ప్రచారానికి ముందే ఒక టీజర్ వదిలినట్టు చిన్న ప్రెస్ మీట్లోనే తన టార్గెట్ ఎవరో, తాను ప్రచారంలోకి దిగితే ఎలా ఉండబోతోందో చెప్పేశారు.

వైఎస్ షర్మిల ప్రచారం మంగళగిరి నియోజకవర్గం నుంచి మొదలు కాబోతోంది. మంగళగిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ - టీడీపీల మధ్యన టఫ్ ఫైట్ సాగుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ పోటీ చేస్తున్న నియోజకవర్గం కావడంతో.. ఇక్కడ హోరాహోరీ పోరు కొనసాగుతూ ఉంది. ఈ నియోజకవర్గంలో పట్టు వదలకూడదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.
ఈరోజు ఉదయం ప్రెస్ తో మాట్లాడిన షర్మిల మొట్టమొదటి పంచ్ లోకేష్ నుంచే మొదలు పెట్టారు "బాబు వస్తే జాబ్‌ వస్తుందన్నారు.. లోకేష్‌కి జాబ్‌ వచ్చింది. లోకేష్‌కి ఏకంగా మూడు శాఖలు అప్పగించారు. కేటీఆర్ ఐటీ శాఖ నిర్వహిస్తున్నారని లోకేశ్‌కు ఐటీ శాఖ ఇచ్చారు. లోకేష్‌కు జయంతి, వర్థంతికి తేడా తెలియదు. ఏ అర్హత ఉందని మూడుశాఖలకు మంత్రిని చేశారు? ఉద్యోగాలకు ఒక్క నోటిఫికేషన్‌ కూడా విడుదల చేయలేదు.

బాబు, మోదీ జోడి కలిసి ఏపీకి రావాల్సిన హోదాను ఎగ్గొట్టేశారు. బీజేపీ మన చెవిలో పువ్వులు పెట్టడానికి బాబే కారణం. హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అని అసెంబ్లీలో తీర్మానం పెట్టారు. హోదా వచ్చిన రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయని బాబు అన్నారు. హోదాను నీరుగార్చిన చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోతారు. చంద్రబాబు ప్రతి ఇంటికి లక్షా 25వేలు బాకీ పడ్డారు. చంద్రబాబువి మళ్లీ కొత్త అబద్ధాలు, మళ్లీ మోసపు హామీలు ఇస్తున్నారు. చంద్రబాబు చందమామను తెచ్చిస్తామంటే ప్రజలు మళ్లీ నమ్మాలా..?. నిప్పు నిప్పు అని చెప్పుకుంటే తుప్పు నిప్పైపోతుందా.?" అంటూ ఆవేశంగా మాట్లాడిన షర్మిల. ఈ సారి ప్రచారంలో మాటలతో ఖచ్చితంగా ఆకట్టుకునేటట్టే కనిపించారు. 


 ఒకవైపు జగన్ రోజుకు మూడు నియోజకవర్గాల చొప్పున కవర్ చేస్తూ ఉన్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో జగన్ ప్రచారహోరు మరింత పెరగనుందని తెలుస్తోంది. జగన్ కవర్ చేయని కొన్ని నియోజకవర్గాలను షర్మిల కవర్ చేసే అవకాశాలున్నాయని సమాచారం. అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కూడా కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేపట్టబోతున్నారని సమాచారం.