ఎదురీత (పుస్తక విశ్లేషణ) నల్ల.యామిని

02:21 - April 4, 2019

                                                                

 

 

 

 

 

                                   

                                         

 

                                              అంతరాల అంటరాని ఆత్మకథ : ఎదురీత 

 

కిషోర్ శాంతాభాయి కాలే రాసిన ఒక అట్టడుగు వర్గపు జీవితం "కోల్హాచా పోర్" (కొల్హాటి పిల్లవాడు) మహా సాహిత్య చరిత్రని సృజించింది. కనీసం మామూలు మనుషుల ఊహకు కూడా అందని జీవితాన్ని అక్షరీకరించిన రచయిత ఒక సమాజపు రెండవవైపు ఉన్న జీవితాలని మన ముందు ఉంచే ప్రయత్నం ద్వారా ఆయన తెచ్చిన పుస్తకం సాహిత్యంలోనూ, సమాజంలోనూ ఒక పెను మార్పుకు కారణమైంది. మరాఠీ సాహిత్యంలోని గొప్ప పుస్తకాలలో ఒకటిగా నిలబడింది. "కోల్హాచా పోర్"  ఆత్మకథ గానే కాదు ఒక కాలపు మానవ జీవితాలని ఆవిష్కరించిన పుస్తకం. ఈ పుస్తకానికి మారాఠి సాహిత్య అవార్డు వచ్చింది, మరిన్ని భారతీయ భాసహల్లోకీ అనువాదమయ్యింది. తెలుగులో ప్రఖ్యాత రచయిత, అనువాదకుడు కలేకూరి ప్రసాద్ "ఎదురీత" పేరుతో తెలుగులోకి అనువదించారు.  తన జీవితాన్ని చెబుతూనే తద్వారా ఆనాటి సమాజపు తీరునీ కొల్హాటి కులపు స్త్రీల దుర్భర జీవితాన్ని ఆవిష్కరించిన కాలే. ఒకే ఒక పుస్తకం ద్వారా ఆనాటి తన చుట్టూ ఉన్న ఒకసమాజపు చిత్రణ చేశారు.

ఈ కులంలో మగవాళ్ళు పనులు చేయరు. వాళ్లకు పుట్టిన బిడ్డలను, అక్క చెల్లెలను ఈ వృత్తిలో ఉంచి డబ్బు సంపాదిస్తారు. అయితే వాళ్లకు వచ్చే భార్యలుగా మాత్రం ఈ కులంలో వాళ్ళని చేసుకోరు. వీళ్ళు సంచార జీవులు కనుక అలా తిరిగిన ప్రదేశాలలో ఎవరినో ఒకరిని చేసుకుంటారు. ఈకుటుంబపు ఆడపిల్లలు ఆడపిల్లలు, తమాషా నాట్యం పేరుతో చేయాల్సిన రికార్డింగ్ డ్యాన్సులవంటి నృత్యాలకోసం శిక్షణకి పంపబడతారు, పెద్దమనిషి అయ్యాక 'కన్నెరికం' (చీర ఉతార్నా) పేరుతో కొన్నాళ్ళపాటు ఉపభార్యగా బాగా డబ్బున్న మనిషికి అమ్మేస్తారు. ఇక ఆ కొనుక్కున్న మనిషి ఆ అమ్మాయికి "యజమాని"అవుతాడు ఇతనుకూడా దాదాపు వీళ్ళకి గర్భం రాగానే వదిలేస్తాడు. అందుకే కొల్హాటి కులంలో పుట్టిన పిల్లలకి తండ్రులుండరు తల్లులు మాత్రమే ఉంటారు. వారికి ఇంటిపేరుగా తల్లిపేరు మాత్రమే ఉంటుంది. 

           1970లలో కొల్హాటి కులంలో పుట్టిన ఒక కుర్రవాడిగా తన కథని తాను చెప్పుకుంటూ తన చుట్టూ ఉన్న తల్లి (శాంతా భాయి, జీజీ (తారా భాయి) తన పిన్నమ్మలూ, తాతయ్యా, మామయ్యల జీవితాలనూ పరిచయం చేస్తూ రాసిన ఈ నవల వల్ల ఎన్ని ప్రశంసలని పొందాడో అంతకు సరి సమానంగా తన సొంతవారి నుంచే విపరీతమైన తిరస్కరణనీ, వ్యతిరేకతనీ ఎదుర్కున్నాడు కిషోర్ శాంతాభాయ్ కాళే. చదువు అన్నదే అందనిపండుగా భావించే వర్గం నుంచి తనకు తానుగా ఎదిగి వచ్చిన కిషోర్ శాంతాభాయి కథగా 1994లో వచ్చిన "కోల్హాచా పోర్" ఎన్నెన్నొ కన్నీటిగాథలని ఆవిష్కరించింది. 

    తమాషా నృత్య కారిణి అయిన తన తల్లి శాంతా భాయి, ఆమెకు తోడుగా ఉండే జీజీల జీవితాలపరిచయంతో మొదలైన కథ ఆనాటిసమాజపు స్త్రీల జీవితాలని, వారు ఏ విధంగా లైంగిక, శ్రమ దోపిడీకి గురయ్యారో, పితృస్వామ్య వ్యవస్త, కుల వ్యవస్తల కారణంగా స్త్రీల జీవితాలు ఎంత దుర్భరంగా గడిచాయో చెప్పిన తీరు పాఠకుని కళ్ళని తడిచేయకుండా వదలదు. అవటానికి కొల్హాటి కులపు పిల్లవాడిగా పుట్టిన కిషోర్ ఆత్మ కథే అయినా ఆనాటి సామాజిక చిత్రీకరణ, మానవ మానసిక విశ్లేషణగా కూడా సాగినందువల్ల ఈ పుస్తకానికి ఒక సార్వజనీనత వచ్చింది. అందుకే "నేను సాహితీ వేత్తను కాను. రాయటానికి ఎక్కువ సమయం కేటాయించను. నేను నిజాయితీగా నమ్మిన దాన్నే రాస్తాను. నా ఇతర పనుల్లో తీరిక దొరికినప్పుడే రాస్తానూ అని చెప్పిన కాలే ఈ రచన ఎంత నిజాయితీగా చిత్రీకరించబడిందో చెప్పకనే చెప్పారు.

ఆయన పెరిగిన సమాజపు లక్షణాలైన పేదరికం, మూఢనమ్మకం, మద్యపానం, నిరక్షరాస్యత ఇవే అతన్ని తన జీవితాన్ని మరింతగా ప్రేమించటానికి, తన చుట్టూ ఉన్న సమూహ సంక్సేమానికి ఏదో చేయాలన్న తపనతో మెడిసిన్ చదివేవరకూ ఎదిగేలా చేసాయి. తనకళ్ళముందే తల్లిమేనత్త జీజీ తన యజమాని (ఒక ప్రత్యేక క్రతువుద్వారా ఆమెని కొంతకాలం ఉపభార్యగా సీకరించిన వ్యక్తి) మరణం వళ్ళ ఎంత దీన స్తితికి నెట్టివేయబడిందో, చదువుకొని టీచర్ అవ్వాలని కలలుకన్న తన తల్లి బలవంతంగా వీధినృత్యాలు చేయటానికి కొని పోబడిందో చూసిన ఒక పిల్లవాడి మనోవేదన, చుట్టూ ఉన్న పిన్నులని తన తాత ఏవిధంగా బజారులలో నాట్యం చేయటానికి పంపి, చివరకు వ్యభిచారం కూడా చేయించి మరీ మరీ వారిని దోచుకుంటూంటే ఆ పరిస్తితుల్లో కూడా తన చదువు మాత్రమే ఈ కష్టాలని రూపుమాపగలదని భావించి అడుగడుగునా కష్టాలతో చివరకు డాక్టర్ గా తాను పుట్టి, పెరిగిన ప్రదేశానికే వచ్చి అక్కడ ఆసుపత్రిని స్థాపించటం వెనుక అతను పడిన మానసిక వేదనని వర్నించటానికి ఈ కొన్ని అక్షరాలు సరిపోవేమో. కిషోర్ శాంతాభాయ్ కాళే ఒక వైద్యుడిగా - తన సమాజంలో మొదటివాడుగా నిలబడ్డాడు. 

  (ఎదురీత) కోల్హాచా పోర్ కేవలం ఒక సాధారణ పుస్తకం మాత్రం కాదు ఒకే కథగా మొదలై విభిన్న రకాల జీవితాలనీ, సామాజిక, ఆర్థిక స్తితుగతులనీ చర్చించిన పుస్తక, కులాన్ని వివక్షనూ, దోపిడీ విధానాన్ని, స్త్రీ అనచివేతనూ ప్రశ్నించిన పుస్తకం. ఒక రకంగా మనం అభివృద్ది చెందుతున్నాం అనుకునే పరిస్తితులనుంచి అసలు ఏవరి అభివృద్దిని మనం చూస్తున్నాం అనే ప్రశ్నదగ్గర ఆగిపోతారు... ఆ ప్రశ్నలకి సమ్నాధానాన్ని వెతుకుతారు. అదే ఈ పుస్తక ముఖ్య ఉద్దేష్యం. మనలని ఆలోచింపజేసి, ప్రశించటానికి పురిగొలిపి, ఆగ్రహంతో ఇంకా తిరగబడలేదేమని మనలని మనమే ప్రశ్నించుకునేలా చేసిన అద్బుతమైన రచన ఇది. "ఎదురీర్త" కొల్హాటీ కులానికి, అన్నిరకాలుగా వెనుకబడ్డ సమూహాలకీ, సామాజిక వర్గాలకీ సంబంధించిన నిలువెత్తు సజీవ చలన చిత్తరువు.  

    తల్లికి ఇద్దరు యజమానులద్వారా పుట్టిన తానూ, తన తమ్ముడు దీపక్ ల తర్వాత వచ్చిన ఆమె మూడవ యజమాని నానాగా పిలవబడే కృష్ణారావ్ వాడ్కర్ ఇంట ఉంటూ కిషోర్ కాలే నిమాత్రం దూరంగా ఉంచినప్పుడు, ఆ పసి హృదయవేదన నిజంగా కథే అయితే బావుండు అనిపిస్తుంది. కానీ దురదృషృటవశాత్తూ అది నిజమైన జీవితం. వేల సంవత్సరాల కులవ్యవస్త ఆ కుర్రవాడికి ఇచ్చిన బహుమతి. అయినా సరే తిండికి కూడా అదృష్టాన్ని పరీక్షించుకునే స్థితినుంచి, రాత్రనకా పగలనకా తమాషా నాట్యగత్తెలకీ, వాళ్ళకోసం వచ్చే మగవాళ్ళకీ సేవలు చేస్తూ, కొన్నాళ్ళు ఆదపిల్లల దగ్గరికి విటులని తెచ్చే బ్రోకర్గానూ పనిచేసిమరీ తన చదువుని కొనసాగించి మళ్ళీ తనవారి అభివృద్దికేసమే తన డాక్తర్ చదువుని కూడా వినియోగించిన జీవితం ఖచ్చితంగా ముదుతరాలకు ఆదర్శమే. 

చదువుకునే రోజుల్లో తండ్రిపేరుకాక తల్లిపేరునే ఇంటిపేరుగా చేర్చటం వల్ల (కొల్హాటి పిల్లలు చెప్పుకోవటానికి తండ్రిపేరుని వాడ్లేరు కారణం తల్లులకు యజమానులే తప్ప భర్తలు ఉండకపోవటమే) బడీలో చదువుకుంటున్న సమయంలోనూ, వైధ్యవిధ్య అభ్యసన కాలంలోనూ తన పిన్ని అదే ఊరికి నృత్యబృందంతో రావటం వల్లా ఇతర విధ్యార్థులతో ఎదుర్కున్న వమానాల మధ్యకూడా ఏనాడూ చదువుని  నిర్లక్ష్యం చేయని పటిమ మనలని ఆశ్చర్య పరుస్తుంది. ఇన్ని కష్టాలమధ్యకూడా తనవారి జీవితాల్లో వెలుగు నింపటానికే అతను అహరహం శ్రమించటం ద్వారా పొందే స్పూర్తిని ఎప్పటికీ మర్చిపోలేం కూడా. ఎక్కడైతే తన కొల్హాటీ తామాషా డాన్సర్లను అమానవీయంగా చూసిందో ఈ సమాజం అక్కడే ఉచితముగా ఆసుపత్రి ప్రారంభించించి తనవారికే సేవలందించటానికి నిర్ణయించుకున్నాడు. ముప్పై కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా ప్రభుత్వ ఆసుపత్రి గానీ,ప్రభుత్వ డాక్టర్ గానీ,లేనిచోట తన ఆసుపత్రి ఏర్పాటు చేసి తన వైద్య సేవలందించడం ద్వారా ఆ విషయాన్ని ఋజువు చేసాడు..ఆదివాసీ పల్లెలకు వైద్యాన్ని తీసుకెళ్లిన మొదటి డాక్టర్ ఈయన. 

     అయితే ఇంతగా కష్టపడి తన సొంత గ్రామానికే వచ్చి ఆసుపత్రి ప్రారంభించిన కాలే ఈ పుస్తకాన్ని రాసినప్పుడు మాత్రం తన సొంత వర్గాన్నుంచే తీవ్ర వ్యతిరేకతని ఎదుర్కున్నాడు. తమ కులంలోని విషయాలను బయటికి చెప్పి తమను అవమానించాడంటూ కోల్హాటీ కులం ఆయనను వెలివేసింది, ఆఖరికి ఏతల్లి ప్రేమకోసమై తపించాడో ఆ తల్లి శాంతాభాయి కూడా కొన్ని సంవత్సరాలపాటు కాలేతో మాట్లాడకుండా,దగ్గరికి రాకుండా ఉండిపోయింది. నిజానికి ఆమె కోపానికి కారణం పుస్తకం రాయటం మాత్రమే కాదు ఆమె చెప్పిన సంబంధం కాదని ఒక దళితరచయిత కూతురిని వివాహం చేసుకోవటం కూడా ఆమె ఆగ్రహానికి కారణం అయ్యింది. 

అయినా ఆయన వెనకడుగు వేయలేదు తిరిగి తన స్వంత కులస్తుల దగ్గరికి తన కులం మనుషుల లాంటి నిరుపేద నిర్లక్షిత కులాలవారి దగ్గరికి వెళ్ళాడు చిన్న నాటినుంచీ తనను వెంటాడిన కష్టాలు తనలాంటివారికి ఉండకూడదన్న లక్ష్యంతోనే గ్రామగ్రామాన ఉన్న కోల్హాటీ మహిళలని కలుసుకుంటూ తమ పిల్లలని చదివించాల్సిన అవసరాన్ని గురించీ, వారి జీవితాలని మెరుగు పరుచుకోవాల్సిన ఆవశ్యకథని గురించీ వారికి అర్థమయ్యే విధంగా పదే పదే చెబుతూ, వారున్న దుర్భర జీవితాన్నుంచి బయతపడటానికి ప్రోత్సహించాడు.  నెమ్మదిగా ఆ మహిళల్లో మార్పు తీసుకు వచ్చాడు. 

   'కోల్హాచా పోర్' పుస్తకం తర్వాత దానికి రెండోభాగమైన ఆత్మకథ కూడా "మీ డాక్టర్ ఝాలో" ని రాశాడు, "ఆయీ తుఝే లేకాజూ" అనే పేరుతో ఒక కవితా సంకలనాన్ని కూడా వెలువరించిన ఆయన ఆ తర్వాత హిజ్రా (కొజ్జా)ల జీవితం ఆధారంగా రాసిన "హిజ్డా ఏక్ మర్దా" అనే నవల కోసం కొన్ని నెలలపాటు వాళ్ళతో కలిసి జీవించాడు. తాను ఏనాడూ కేవలం ఊహాజనిత సాహిత్యాన్ని రాయలేదని మళ్ళీ నిరూపించి ఆ పుస్తకాన్ని, తన జీవితాన్ని నిదర్శనంగా చూపాడు. "యుద్దబాళ్ళూ" ఆక్రోశ్ గొంగ్తూబా", "అంధర్ యాత్రా" లతో పాటు "సుందరగావత్ అలీ" అనే నాటకాలని రాసి వటికి దర్శకత్వం చేయటమే కాదు కొన్ని నాటికల్లో స్వయంగా నటించాడు కూడా. కళలోనే పుట్టి, కళాకారులతో జీవించిన మనిషి నటించకుండా ఎలా ఉండగలడు? 

 ఒక రచయితగానే కాదు సామాజిక ఉధ్యమకారుడిగానూ తనపుస్తకాలద్వారావచ్చిన ఆదాయాన్ని వెచ్చించి మరీ "తారాభాయి స్మారక సంస్థ" అనే సంస్థని స్థాపించాడు. నిరుపేద పిల్లల చదువుకీ ఎంతగానో సహాయం చేసిన కాళే కొందరు అగ్రవర్ణ పేదపిల్లలకు సహాయం చేసినప్పుడు కూడా కొంత వ్యతిరేకతను ఎదుర్కోవటం గమనార్హం. "ఆసమయంలో వారి సామాజిక హోదా ఏదైనా అవసరం ఉన్న వాళ్ళకి సహాయం చేయ్టం ముఖ్యమనే నేను భావించాను" అన్నదే ఆయన సమాధానం.  తాను చదువుకున్న అలోపతీ వైధ్యవిధానం పేదలకు అందుబాటులో లేదని ఆదివాసీలకు అందుబాటులో ఉండే ఆయుర్వేదం నేర్చుకోవటానికి తన ఉధ్యోగాన్ని వదిలేసి అడవిలో ఉండే ఆదీవాసీలతో కలిసి జీవించాడు కాళే.  అక్కడి ఆదివాసీ యువకులకి ఆక్యు పంక్చర్,ఆక్యుప్రెజర్ విధానాల్లో శిక్షణ ఇచ్చి వారిని తమ సమాజం కోసం పనిచేసే కార్యకర్థలా తయారు చేసాడు. కానీ ఇన్ని కష్టాలను అనుభవిస్తూ తన వంటి సమాజం కోసం కష్టపడుతూనే గడిపిన కిషోర్ కాళే తన 37వ ఏటనే ప్రమాదవశాత్తూ 2007 ఫిబ్రవరి 3న కారుప్రమాదంలో మరణించాడు. అయినా ఆయిన సృష్టించిన సాహిత్యం, తన మనుషుల్లో ఆయన నింపిన స్పూర్తి మాత్రం మాత్రం సజీవంగా కొనసాగుతూనే ఉంది.   

                                                                                                                                     వ్యాసకర్త: యామిని నల్ల