కల్వకుంట్ల కవితకి వ్యతిరేకంగా రైతుల నామినేషన్లు : ఎందుకింత వ్యతిరేకత?

12:36 - March 26, 2019

*కల్వకుంట్ల  కవితకి వ్యతిరేకంగా 236  రైతుల నామినేషన్లు

*పసుపుబోర్డు, మద్దతుధరల విషయంలో మాట తప్పినందుకే 

 *గతంలో నల్గొండ, మహబూబ్ నగర్ తరహాలో నిరసన 

 

 

ఎంపీ కవిత కనీసం తమ బాధలు పట్టించుకోవడం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ నిజామాబాద్ రైతులు ఇటీవల పలు ర్యాలీలకు, ధర్నాలకు కూడా పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయినా సరే ప్రభుత్వం నుంచి గాని సదరు ఎంపీ నుంచి గాని ఎలాంటి స్పందనా ఇప్పటి వరకు రాలేదు.  "గత ఎన్నికల్లో పసుపు బోర్డును తీసుకురాకపోతే, పసుపుకు రూ.10వేలు మద్దతు సాధించలేకపోతే మీ ఊరికి ఓటు అడగటానికి రానని" చెప్పిన కవిత. ఇప్పటివరకూ ఆ హామీని నేరవేర్చలేదని అసంతృప్తితో ఉన్న రైతులు మద్దతు ధర కావాలని రైతులు అసెంబ్లీ వరకు పాదయాత్ర చెయ్యాలని నిర్ణయం కూడా తీసుకున్నారు.

అంతే కాదు వారణాసిలో మోదీ కి వ్యతిరేకంగా నామినేషన్ వేయనున్న 110 మంది తమిళరైతుల తరహాలోనే పసుపు, ఎర్రజొన్న, చెరకు పంటలకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ రైతులు వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు. ఎన్నికల సీజన్ కావడంతో తమ సమస్యను జాతీయం చేసేందుకు నిజామాబాద్ ఎంపీ స్థానానికి వందల సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. సోమవారం(మార్చి 25) నామినేషన్ల దాఖలుకు ఆఖరి తేదీ కావడంతో రైతులు నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద నామినేషన్ పత్రాలతో బారులు తీరారు.

ప్రతి గ్రామం నుంచి ఐదుగురు చొప్పున నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 1000 మంది రైతులు నామినేషన్ వేయాలని నిర్ణయం తీసుకున్నారు.  వందలాది మంది సోమవారం నామినేషన్ పత్రాలతో నిజామాబాద్ కలెక్టరేట్‌కు తరలివచ్చారు.  ఈ పరిణామాలతో కలెక్టరేట్ వద్ద పోలీసులు 144 సెక్షన్ విధించారు.  వాస్తవానికి ఊరికి ఇద్దరు చొప్పున వెయ్యి మంది రైతులు నామినేషన్లు వేయాలి. కానీ, టీఆర్ఎస్ నాయకుల ఒత్తిళ్లు, బెదిరింపుల మూలంగా ఆర్మూరు, నిజమాబాద్ రూరల్, బాల్కొండ, జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల నుంచి 236 మంది రైతులు నామినేషన్లు వేశారు. 


    తాజాగా జరిగిన తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకోవటం మీద పెట్టిన శ్రద్ధ రైతుల సమస్యల మీద పెట్టలేదు అనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. దీనితో పార్లమెంట్ ఎన్నికల నేపధ్యంలో అక్కడి రైతులు సంచలన నిర్ణయం తీసుకునే విధంగా అడుగులు వేస్తున్నట్టు ఇటీవల వార్తలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే.దాదాపు వెయ్యి మంది నామినేషన్లు వెయ్యాలని భావిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. నల్గొండ నీటి సమస్య కోసం గతంలో దాదాపు 600 మంది బాధితులు నామినేషన్ వేశారు. ఇప్పుడు నిజామాబాద్ లో కూడా  కూడా అదే  ప్రయత్నాలు జరిగాయి..  

ఇక్కడి నుంచి కేసీఆర్ కుమార్తె కవిత పోటీ చేస్తుండటంతో ఆ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. రైతుల చర్యలతో ఏకంగా ఎన్నికే వాయిదా పడే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతుండటంతో అధికార పార్టీ ఆందోళన చెందుతోంది. దీంతో ప్రస్తుతం ఇది చర్చనీయాంశమైంది. నిజంగానే 1000 మంది రైతులు నామినేషన్ వేస్తే ఇది దేశంలోనే రికార్డు అయి ఉండేది.