భారత్ నిర్ణయంతో పాకిస్తాన్ ఎడారిగా మారుతుందా? సింధూ జలాల ఒప్పందం కొన్ని నిజాలు

01:05 - February 23, 2019

*పాకిస్తాన్‌ వైపు వెళ్లే నదుల నీటిని భారత్ ఆపేయబోతోందా?

*ఉరీ ఉగ్రదాడి సమయం లోనూ భారత్ ఇలాంటి ప్రకటనే చేసింది

*అసలు ఈ సింధు జలాల ఒప్పందం అంటే ఏమిటి? 

 

"ఇరుదేశాలు విడిపోయిన తర్వాత..భారత్, పాకిస్తాన్‌కు మూడు నదుల చొప్పున వాటాలు దక్కాయి. భారత వాటాగా వచ్చిన బియాస్, రావి, సట్లేజ్ నదులను మనం వాడుకోవడం లేదు. దయార్థ హృదయంతో పాకిస్తాన్‌కే పంపిస్తున్నాం. కానీ ఆ నీటిని పాక్‌కు సరఫరా చేయకుండా మనమే వినియోగించుకోబోతున్నాం. వాటిపై సర్వ హక్కులు మనవే. రావి నదిపై షాపూర్-కండి దగ్గర జలాశయాన్ని నిర్మిస్తున్నాం. మూడు నదుల జలాలను ఆ జలాశయంలోకి తరలిస్తారు. అక్కడి నుంచి UJH ప్రాజెక్టుకు తరలించి జమ్మూకశ్మీర్, పంజాబ్ ప్రజలకు సరఫరా చేస్తాం. మిగిలిన జలాలను రెండో రావి-బియాస్ లింక్ ద్వారా యమునా నదికి తరలిస్తాం. ఈ ప్రాజెక్టులన్నింటినీ జాతీయ ప్రాజెక్టులుగా కేంద్రం ప్రకటించింది."  అంటూ కేంద్ర జలవనరుల మంత్రి  నిథిన్ గడ్కరీ చెప్పగానే ఇక సింధూ జలాల ఒప్పందం రద్దు చేసేస్తున్నారూ,  పాకిస్థాన్ పని అయిపోయినట్టే, ఎడారి కాబోతున్న పాక్ అంటూ కొన్ని సోషల్ మీడియా పోస్టులు మొదలయ్యాయి. కానీ  కేంద్రజలవనరుల శాఖ ఈ నిర్ణయం కొత్తదేమీ కాదని..గతంలోనే నిర్ణయం తీసుకున్నారని  వెల్లడి చేసింది. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఈ విషయాన్నే నితిన్ గడ్కరీ పునరుద్ఘాటించారని చెప్పేసింది. అంటే మోదటగా గమనించాల్సిన విశయం ఏమిటంటే పాక్ లోకి వెళ్లకుండా అడ్డుకోబోతున్నాం అని చెప్పినవి మిగులు జలాలు మాత్రమే. 
       
ఇక సింధూ జలాల ఒప్పందంరద్దు చేయటం అంటే పాకిస్థాన్ మాత్రమే కాదు, భారత దేశం పరిస్తితి కూడా కోరి కోరి కొరివి తెచ్చి మీదపెట్టుకున్నట్టే అవుతుంది  ఎందుకంటే ఈ ఒప్పందం కేవలం భారత్ పాక్ లమధ్యదే అయినా ఇక్కడ ఆయా నదులు ప్రవహిస్తున్నది ఆఫ్ఘనిస్తాన్, చైనాల్లోకూడా అన్న విశయం మర్చిపోవద్దు. అంతే కాదు ఇక్కడ సింధూ వివాదం ఉన్నట్టే భారత్ చైనాకు మధ్య బ్రహ్మపుత్రా నది వివాదమూ ఉందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒప్పందాన్ని భారత్ మీరిన మరుక్షణం బ్రహ్మ పుత్రా నది విషయంలో చైనా చేతిలో మన జుట్టు మనం పెట్టేసుకున్నట్టే..  
               

రీ ఉగ్రదాడి సమయం లోనూ భారత్ ఇలాంటి ప్రకటనే చేసింది కానీ దానిని ఆచరణలో పెట్టలేదు. ఎందుకంటే అంత సులభంగా అంతర్జాతీయ ఒప్పందాన్ని అదీ ప్రపంచ బ్యాంకు జోక్యం ఉన్న ఒప్పందాన్ని ఉల్లంగించటం ఎన్ని సమస్యలని తీసుకు వస్తుందో ప్రభుత్వాలకు బాగా తెలుసు. పుల్వామా దాడి అనంతరం భారత్ తమకు హక్కున్న నీటిని పాక్‌కు ఇవ్వకుండా అడ్డుకోవాలని నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. అయితే నీటిని మళ్లించేందుకు 100 మీటర్ల ఎత్తైన డ్యామ్ నిర్మాణం కూడా చేపట్టింది. అయితే ఈ డ్యాం పూర్తి కావటానికే కనీసం ఆరేళ్ళ సమయం పడుతుంది. ఆలోపు అంతర్జాతీయంగా ఎన్ని మార్పులైనా రావొచ్చు. అన్నిటికంటే ముఖ్యమైన విశయం ఇంత భారీ ప్రాజెక్టులని ఉగ్రవాద కార్యకలాపాలు జరిగే ప్రదేశాల్లో నిర్మించటం కూడా భవిశ్యత్తులో ప్రమాద కారణం కావొచ్చు. ఒక్క ప్రాజెక్ట్ మీద దాడి జరిగినా జరిగే నష్టం భారీగా ఉంటుంది. 


సింధు జల ఒప్పందం ప్రకారం భారత్ తన నదుల నీళ్లను పాకిస్తాన్‌తో పంచుకుంటోంది. సింధు జలాల ఒప్పందం అంటే.. 1960 సెప్టెంబరు 19న అప్పటి భారత ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ సింధు జల ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం సింధు నది ఉప నదులను తూర్పు, పశ్చిమ నదులుగా విభజిస్తారు.  ఈ ఒప్పందాన్ని మొదట రెండు దేశాల మధ్యా ప్రస్తావనకు తెచ్చిందీ మధ్య వర్తిత్వం వహిస్తూ ఈ వ్యవహారం మొత్తాన్ని నడిపిందీ ప్రపంచబ్యాంకు. 
ఈ ఒప్పందం ప్రకారం బియాస్, రావి, సట్లెజ్ అనే మూడు తూర్పు నదులు లపై భారతదేశానికి,  సింధు, చీనాబ్, ఝీలం అనే మూడు పశ్చిమ నదులపై పాకిస్తాన్‌కూ నియంత్రణ ఉంటుంది. అయితే పాకిస్తాన్ నియంత్రణ ఉన్న మూడు నదులు భారతదేశంలో మొదట ప్రవహిస్తూండడంతో,  భారతదేశం ఆ నదుల నీటిని సాగు, రవాణా, విద్యుత్ ఉత్పత్తి  అవసరాలకు వినియోగించుకోవచ్చు కానీ ఈ నదులపై భారత్ ఎవైనా ఆనకట్టలు కట్టాలన్నా ఒప్పంద నిబందనలకు లోబడి మాత్రమే ఆ నిర్మాణాలు ఉండాలి. 


 1960లో ఒప్పందం అమలులోకి వచ్చిన నాటి నుంచి, భారత దేశం, పాకిస్తాన్లు జలాల గురించి యుద్ధంలోకి వెళ్ళలేదు. ఇప్పటి పుల్వామా దాడికన్నా పెద్ద ఎత్తున జరిగిన యుద్ద సమయాల్లోకూడా రెండు దేశాలూ ఈ జల వివాదాలని ఒప్పందం పరిధిలోని న్యాయపరమైన పద్ధతుల్లోనే పరిష్కరించుకున్నారు.
ఒప్పందంలో సింధు, జీలం, చీనాబ్ నీళ్లు పాకిస్తాన్‌కు ఇచ్చారు. రావి, బియాస్, సట్లెజ్ నదుల నీళ్లు భారత్‌కు దక్కాయి.ఇందులో భారత్ తన నదుల్లో నీళ్లను కొన్ని మినహాయించి అపరిమితంగా వాడుకోవచ్చు. అదే పాకిస్తాన్ నదుల్లో నీళ్లను ఉపయోగించుకోడానికి కొన్ని నియమిత హక్కులు మాత్రమే భారత్‌కు కూడా ఇచ్చారు.

అంటే విద్యుత్ ఉత్పత్తి, వ్యవసాయం కోసం పరిమిత జలాలు వాడుకోవచ్చు. భారత్ జలాలతో పాకిస్తాన్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న భారీ ప్రాజెక్టులపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటు కశ్మీర్‌లో జల వనరుల వల్ల ఆ రాష్ట్రానికి ప్రయోజనం లేకుండా పోతోందని అక్కడి నేతలు చెబుతున్నారు. బీజేపీ మద్దతుదారు మెహబూబా ముఫ్తీ జమ్ము-కశ్మీర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, సింధు జల ఒప్పందం వల్ల రాష్ట్రానికి 20 వేల కోట్ల నష్టం జరుగుతోందని, కేంద్రం దానిని భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరారు.  పాకిస్తాన్ పంజాబ్, సింధ్ ప్రాంతాల్లో వ్యవసాయం కోసం ఇక్కడినుంచే జలాలు అందుతాయి. పాకిస్తాన్‌లో ఎక్కువ ప్రాంతంలో వ్యవసాయానికి ఇదే అధారం. పాకిస్తాన్ ఇండస్ట్రీ, నగరాలకు కూడా విద్యుత్ సరఫరా కోసం కూడా ఈ ఒప్పందం చాలా ముఖ్యమైనది.

కానీ ఒప్పందం ప్రకారం ఎవరూ ఏకపక్షంగా ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించకూడదు, లేదా మార్చకూడదు. ఈ విషయాలన్నీ బాగా తెలుసు గనకనే "సింధు జలాల ఒప్పందం ప్రకారం తూర్పు జలాల్లోని నీటిని భారత్ మళ్లించుకుని అక్కడి ప్రజల అవసరాలకు వాడుకున్నా, లేదంటే వారికి నచ్చినట్టు మరో విధంగా ఉపయోగించుకున్నా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆందోళన అంతకంటే లేదు", అని పాక్ జలవనరుల శాఖ సెక్రటరీ ఖవాజా షువాలీ లెక్కలేదన్నంత నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వగలిగాడు.  1960లో కూడా తూర్పు ప్రాంత నదుల జలాలను భారత్ మళ్లించుకుందని, ఆ సమయంలో తామేమీ అభ్యంతరం చెప్పలేదని, ఇప్పుడు అదే పని భారత్ చేసినంత మాత్రాన తమకేం ఇబ్బంది లేదని ఖవాజా గుర్తు చేసాడు.

అయితే అంతర్జాతీయ న్యాయస్థానం ప్రకారం ప్రాథమిక పరిస్థితుల్లో మార్పులు ఉంటే ఏ ఒప్పందాన్నైనా రద్దు చేయవచ్చు. కానీ అది చెప్పినంత సులభం కాదు.విభజన తర్వాత సింధు లోయ నుంచి వెళ్లే నదులపై జరిగిన వివాదానికి వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వం చేసింది. ఫలితంగా భారత్ ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే, పాకిస్తాన్ ఖచ్చితంగా వరల్డ్ బ్యాంక్ ద్వారా వత్తిడి తెచ్చే ప్రయత్నాలు మొదలు పెడుతుంది.  వరల్డ్ బ్యాంక్ భారత్‌పై అలా చేయవద్దని ఒత్తిడి తీసుకురావచ్చు. అప్పుడు అంతర్జాతీయంగా భారత్ చేసిందే తప్పు అని పాక్ ఆరోపించే ఆరోపణకి మనం సిద్దంగా ఉండాలి అంతే కాదు సింధూ నది పుట్టింది భారత పరిధిలో ఉన్న ప్రాంతంలో కాదు ఆ ప్రదేశం టిబెట్ లో ఉంది. భారత దేశ ఒప్పందం పాకిస్థాన్ తో మాత్రమే చైనా తో కాదు అలాంటప్పుడు మనం పాక్ కి నీళ్ళు అడ్డుకున్నట్టే అదే పద్దతి చైనా అనుసరించి  ఈ నదిని అడ్డుకుంటే, లేదా ప్రవాహ దిశను మారిస్తే, రెండు దేశాలకు దానివల్ల నష్టం జరుగుతుంది.

ఇప్పటికే 2016 లో ఒకసారి టిబెట్ నుంచి భారత్‌లోని సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌లో ప్రవహించే బ్రహ్మపుత్ర ఉపనదిని చైనా బ్లాక్ చేసిందన్న విషయాన్ని మర్చిపోకూడదు. టిబెట్‌లో యార్లాంగ్ జాంగ్బో నదిగా పిలిచే బ్రహ్మపుత్ర టిబెట్, భారత్ మీదుగా బంగ్లాదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. టిబెట్‌లో ఈ నదిపై చైనా దాదాపు 740 మిలియన్ల డాలర్లతో హైడల్ పవర్ ప్రాజెక్టును నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతం సిక్కింకు చాలా దగ్గర ఉంటుంది.  
   

ఇక కాశ్మీర్ వరదల గురించి ప్రత్యక్షంగా జరిగిన అనుభవం ఉండనే ఉంది. ఇంత పెద్ద ఎత్తున భారీ ప్రాజెక్టులతోనూ, నదుల మళ్ళింపుతోనూ భారత దేశం ఆ నీటిని అడ్డుకున్నా ఆ తర్వాత రాబోయే ప్రకృతి విపత్తులని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. 2014 లోనూ,  2017లోనూ  కాశ్మీర్ లో వచ్చిన వరద భీబత్సాన్ని మర్చి పోకూడదు అప్పటి భారీ వరదల వల్ల ఇప్పటికే 160 మందికిపైగా ప్రజలు చనిపోగా, వేల మంది నిరాశ్రయులు అయ్యారు. వందల గ్రామాలు నీళ్ళలో మునిగాయి. రోడ్లు, , బ్రిడ్జ్ లు దెబ్బతిన్నాయి.

విపత్తుల నివారణలో ముందస్తు ప్రణాళిక లేకపోవడం వలనే 2013లో కేదార్‌నాధ్‌, 2014లో కాశ్మీర్‌ వరదలు సంభంవించాయని, తీవ్ర ఉష్ణోగ్రత ప్రభావంతో మంచు కరిగి సరస్సులు, నదుల్లోకి ప్రవహించడం వలన సింధు, గంగా, బ్రహ్మపుత్ర వంటి నదుల్లో వరదలు వచ్చే అవకాశం ఉందని. దీంతో పంటలు నాశనం కావడంతోపాటు ప్రజాజీవనం అస్త్యవ్యస్తం అవుతుందని అంతర్జాతీయ సమగ్ర పర్వత అభివృద్ధి సంస్థ(ఐసిఐఎంఒడి) ద్వారా హిందూ కుష్‌ హిమాయలన్‌(హెచ్‌కెహెచ్‌) రీజియన్‌ ప్రకటించిన సమగ్ర నివేదిక నివేదిక అభిప్రాయపడింది. అలాంటి చోట ఇప్పుడు మళ్ళీ భారీ ప్రాజెక్టుల అవసరం ఎంత మేరకు ఉంది? కేవలం పాకిస్థాన్ మీద ఉన్న కోపంతో ఆ మిగులు జలాలను కూడా అడ్డుకోవాలనో దారి మళ్ళించాలనో చేసే చర్యల ఫలితంగా ఏర్పడే విపత్తులని ఎలా నివారించగలం?