నగరవాసులూ జాగ్రత్త: హైద్రబాద్ లో కొత్త తరహా మోసం

15:06 - January 14, 2019

దేవుడి పేరుతోసులభంగా మోసం చేయవచ్చని అర్థమై ఉంటుది ఈ ప్రబుద్దుడికి. అందుకే అదే పద్దతిని ఎంచుకొని తిరుమల శ్రీవారి సేవలు తాను దగ్గరుండి మరీ చేయిస్తానని లక్షలకు లక్షలు వసూలు చేసాడు. నెల్లూరు టౌన్‌కు చెందిన ఆనం రాజ్‌కుమార్‌రెడ్డి బంజారాహిల్స్‌లోని ఇందిరానగర్‌లో ఉంటున్నాడు. అమీర్‌పేట డివిజన్‌ శివ్‌భాగ్‌కు చెందిన సుకుమార్‌రెడ్డితో అతడికి పరిచయం ఏర్పడింది.

తిరుమల తిరుపతి దేవాలయంలో తనకు మంచి పరిచయాలు ఉన్నాయని, తక్కువ ఖర్చుతోనే తిరుపతిలో అభిషేక పూజలు, దంపతులకు శేషవస్త్రాలను దగ్గరుండి ఇప్పిస్తానని నమ్మించాడు. అయితే రాజ్ కుమార్ రెడ్డి ఇలా మోసం చేయటం మొదటిసారి కాదనీ ఇంతకు ముందే ఇదే తరహా మోసానికి పల్పడ్డాడనీ తెలియని సుకుమార్ తనకు తెలియకుండానే ఈ ట్రాప్ లోకి మరికొంతమందిని లాగడు. పాపం ఇలా మొత్తం 20 లక్షల మేర సమర్పించుకున్నారు భక్తులు. 

      అభిషేక పూజకు రూ.2500, శేషవస్త్రాల బహుకరణకు రూ.50 వేలు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పడంతో సుకుమార్‌ రెడ్డి ముందుగా డబ్బులు చెల్లించాడు. ఆ తర్వాత సుకుమార్‌ తనకు నెల్లూరుకు చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడిందని, తిరుమలలో సులభంగా దర్శనం చేసుకోవచ్చని స్నేహితులు, బంధువులకు చెప్పడంతో మరో 15 మంది రాజ్‌కుమార్‌రెడ్డికి డబ్బులు చెల్లించారు. నెలలు గడుస్తున్నా రాజ్‌కుమార్ దర్శనం చేయించకపోగా తప్పించుకుని తిరుగుతుండటంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆదివారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.  

నిందితుడు సుమారు రూ.20లక్షల వరకు వసూలు చేశాడని పోలీసులు గుర్తించారు. రాజ్‌కుమార్ గతంలో విజయవాడలోనూ ఇదే తరహా మోసానికి పాల్పడి జైలుకెళ్లాడని, బయటకు వచ్చాక హైదరాబాద్ మకాం మార్చి మళ్లీ మోసాల బాట పట్టాడని పోలీసులు తెలిపారు.  అయినా దేవుణ్ణి దర్శించుకోవటానికి కూడా దొంగ దారులు పాటించటం తప్పుకిన్డకి రాదనుకున్నారో, లేడా ఈ తప్పుని కూడా ఆ వేంకటేశ్వరుడు మాఫీ చేస్తాడనుకున్నారో గానీ పాపం ఇలా మోసపోయారు.