IPL అప్డేట్స్: బట్లర్ "మన్కడింగ్ ఔట్" పై రేగుతున్న వివాదం, అసలు మన్కడింగ్‌ ఔట్‌ అంటే?? 

12:58 - March 26, 2019

 

*బట్లర్ "మన్కడింగ్ ఔట్" పై రేగుతున్న వివాదం 

*రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్‌ బట్లర్‌ని రనౌట్ చేసిన అశ్విన్

*ఇది అనైతికం అంటూ ఆన్లైన్లో విమర్శల వెల్లువ 

 

ఐపీఎల్ 2019 సీజన్‌లో భాగంగా జైపూర్ వేదికగా సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టుని విజయం దిశగా నడిపిస్తున్న జోస్ బట్లర్ (69)ని క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా అశ్విన్ రనౌట్ చేసిన సంగతి తెలిసిందే. క్రికెట్ నిబంధనల ప్రకారం కనీసం ఒక్కసారైనా 'మన్కడింగ్'పై బౌలర్ హెచ్చరించాలి. కానీ, అశ్విన్‌ అనైతికంగా వ్యవహరించి బట్లర్‌ని ఔట్ చేశాడని సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శిస్తున్నారు.బౌలింగ్‌ని ఆఖరి క్షణంలో అలా నిలిపివేసి రనౌట్‌కి ప్రయత్నించడం నైతికత కాదని. జోస్ బట్లర్‌తో సహా మ్యాచ్ కామెంటేటర్లు సైతం అభిప్రాయపడ్డారు. రనౌట్ కోసం పంజాబ్ అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్‌కి నివేదించాడు. రిప్లైలో బట్లర్ రనౌటని తేలింది. కానీ అశ్విన్ అనైతికతంగా వ్యవహరించాడని కాసేపు మైదానంలో గొడవచేసిన బట్లర్ తిట్టుకుంటూనే పెవిలియన్‌కి వెళ్లాడు. 

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నాలుగు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. అనంతరం 185 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టుని ఓపెనర్ జోస్ బట్లర్ (69: 43 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సులు) హాఫ్ సెంచరీతో మెరుగైన స్థితిలో నిలిపాడు. ఆ జట్టు విజయానికి 48 బంతుల్లో 80 పరుగులు అవసరమైన దశలో అశ్విన్ బౌలింగ్‌కి వచ్చాడు. అశ్విన్‌ బంతి వేయబోయే సమయానికే బట్లర్‌ క్రీజ్‌ వదిలి కాస్త ముందుకు వచ్చాడు. ఇదే అదనుగా బౌలింగ్‌ని నిలిపివేసిన అశ్విన్ వెనక్కి వచ్చి బెయిల్స్ అప్పీల్‌ చేశాడు. 

అసలు మన్కడింగ్‌ ఔట్‌ అంటే?? 


 క్రికెట్ నిబంధనల ప్రకారం, బౌలర్ బంతి వేయకముందు నాన్ స్ట్రయికర్ గా ఉన్న ఆటగాడు క్రీజ్ దాటితే, బౌలర్ బెయిల్స్ ను పడేయడం ద్వారా అవుట్ చేయవచ్చు. ఈ విధానాన్ని తొలిసారిగా 1947-48 సీజన్ లో ఆస్ట్రేలియాలో పర్యటించిన భారత జట్టులోని బౌలర్ వినూ మన్కడ్ వాడారు. ఆసీస్ ఆటగాడు బిల్ బ్రౌన్ పదేపదే బంతి వేయకముందే క్రీజ్ ను దాటుతుండగా, పలుమార్లు వినూ మన్కడ్ హెచ్చరించాడు. అయినా బిల్ బ్రౌన్ తన వైఖరిని మార్చుకోకపోవడంతో మన్కడ్ అతన్ని అవుట్ చేశాడు. దీంతో ఈ రనౌట్ కు 'మన్కడింగ్' అన్న పేరు వచ్చింది.  అయితే తొలుత నిబంధన 42.15 ప్రకారం బౌలర్‌ బంతి విసరకముందే నాన్‌ స్ట్రయికర్‌ క్రీజ్‌ దాటినప్పుడు మాత్రమే అతడిని అవుట్‌ చేసే అవకాశం కలిగేది.

తర్వాత  ఎసీసీ బౌలర్లకు అనుకూలంగా ఈ నిబంధనను 41.16 గా మార్చేసింది. గతంలో బౌలర్‌ యాక్షన్‌కు ముందు మాత్రమే ఔట్‌ చేసే అవకాశముండేది. ​కానీ సవరించిన నిబంధనలో యాక్షన్‌ (బంతి విడుదలకు ముందు చేయి పూర్తిగా తిరిగినా) తర్వాత కూడా ఔట్‌ చేసే వెసులుబాటు కల్పించారు. అయితే ఇది క్రీడాస్పూర్తి విరుద్దమని, ఈ నిబంధనను తొలిగించాలనే డిమాండ్‌ వ్యక్తమవుతోంది. ఈ తరహాలో అవుట్ చేయడం క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని పలువురు అంటున్నా, అప్పుడప్పుడూ క్రికెట్ లో కనిపిస్తూనే ఉంటుంది. ఈ అవుట్ కు మన్కడింగ్ అన్న పేరును తీసేయాలని సునీల్ గవాస్కర్ వంటి వారు చాలాసార్లు డిమాండ్ చేశారు.