పెళ్ళికి డబ్బుల్లేక సహజీవనం చేస్తున్నారు: ఒక ఊరు ఊరంతా, 132 జంటలు

15:41 - January 18, 2019

మనదగ్గర ఒక సామెత ఉంది "పెళ్ళి చేసి చూడు ఇల్లు కట్టి చూడూ" అని. మనదగ్గర అనే కాదు దాదాపు ప్రపంచం లో ప్రతీ చోటా పెళ్ళి అనే తంతు కి కోట్ల రూపాయలు ఖ్రచు చేసే మన్షులున్నారు. మొన్నటికి మొన్న కేవలం పెళ్ళి ఇన్విటేషన్ కార్డు ఒక్కొక్కటీ లక్షల విలువచేసే స్థాయిలో డిజైన్ చేసిన తీరుని చూసాం. కానీ అన్ని కోట్లు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేసుకునే జనాల మధ్యనే కనీసం పెళ్ళిఖర్చులకి కూడా డబ్బులేక అసలు పెళ్ళే వద్దనుకొని సహజీవనం సాగిస్తున్న జనమూ ఉన్నారు. 
మన దేశంలోనే  జార్ఖండ్ రాష్ట్రంలోని చార్కాట్ నగర్ గ్రామానికి చెందిన రాజు మహ్లీ, మంకీదేవిలు పెళ్లి చేసుకోకుండానే గత 20 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. గిరిజనుల్లో వివాహ విందు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. ఈ జంట పేదరికం వల్ల వివాహవిందు ఇవ్వలేక పెళ్లి చేసుకోకుండానే కలిసి కాపురం చేస్తోంది. గిరిజనుల పరిస్థితిని చూసిన నిమిట్ అనే స్వచ్చంద సంస్థ ముందుకు వచ్చి ఇలా పెళ్లి చేసుకోకుండానే సహజీవనం చేస్తున్న 132 గిరిజన జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు. నిమిట్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు గిరిజన సంప్రదాయం ప్రకారం వారి స్నేహితులు, బంధువులకు విందు ఇచ్చారు. ఇలా పెళ్లి చేసుకోకుండానే సహజీవనం చేయడం జార్ఖండ్ లోని ఒరాన్, ముంద, హో గిరిజనుల్లో సంప్రదాయంగా వస్తోంది.
 
స్థానిక గిరిజన సంప్రదాయం ప్రకారం యువతి సహజీవనం చేసే యువకుడిని ఎంపిక చేసుకొని స్థానిక పెద్దల అనుమతి తీసుకుంటారు. భార్య భర్తల్లా కాకుండా దుకా, దుక్నీల పేరిట వారు ఒకే ఇంట్లో కాపురం చేస్తారు. చిన్న ప్లాటు భూమిలో వ్యవసాయం చేస్తున్న తాను పెళ్లి విందుకు డబ్బుల్లేక పెళ్లాడలేదని మహ్లీ చెప్పారు. తమకు కొడుకు, కూతురు పుట్టాక నిమిట్ స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చి వివాహాలు జరిపిస్తామంటే తాము అంగీకరించామని మహ్లా పేర్కొన్నారు. పేదరికం వల్ల ఇలా పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తున్న జంటలకు తాము సామూహికంగా వివాహాలు జరిపిస్తున్నామని నిమిత్త స్వచ్చందసంస్థ కార్యదర్శి నికిత సిన్హా చెప్పారు. ఇలా 2016లో 21 జంటలకు, 2017లో 43 మందికి, ఈ ఏడాది 132 జంటలకు సామూహిక వివాహాలు జరిపించారట. 
   అయితే పెళ్ళి అనేది తప్పని సరి తంతు అనుకునే నమ్మకాన్ని కూడా దాటిన ఆ జంటలను మరో రకంగా ఆదుకుంటే బావుండేదేమో. ఆ పెళ్ళి అనే తంతు లేకుండానే కేవలం నమ్మక, ప్రేమా లతో కలిసి ఉన్న ఆ జంటలకు పెళ్ళిఖర్చులని నగదు రూపం లో ఇచ్చిఉంటే వారికి మరింత ఆనందంగా ఉండేదేమో అని వ్యాఖ్యానించారు గ్రామస్తుల్లో ఒకరు...