ఇరుకున పడ్డ టీడీపీ: చంద్రబాబు ధర్మదీక్ష రోజునే "ఓటుకు నోటు దీక్ష"

01:12 - February 10, 2019

*ఫిబ్రవరి 11 న చంద్రబాబు ధర్మపోరాటదీక్ష 

*అదే రోజున ఓటుకు నోటు కేసు మత్తయ్య దీక్ష కూడా 

* టీడీపీ దీక్షని ఇబ్బంది పెట్టేందుకే అంటూ ఆరోపణ 

 

 

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తాను అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి 11 ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు డిల్లీలో చేపట్టనున్న ఈ ధర్మ పోరాట దీక్ష కోసం డిల్లీలోని ఏపీ భవన్ సిద్దమవుతోంది.  

ఈ దీక్షలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి భారీగా తరలివస్తున్న ప్రజాప్రతినిధులు ప్రజలకు అసౌకర్యం కలుగకుండా అన్నిరకాల ఏర్పట్లూ జరుగుతున్నాయట.  జరిగే కార్యక్రమం మొత్తాన్ని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా  భవన్ అధికారులు సిబ్బందికి విశదీకరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చేపట్టనున్న ధర్మపోరాట దీక్ష విజయవంతం చేయడానికి అక్కడ తెరలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.


    దీక్ష మొదలు పెట్టటానికి కొన్ని గంటల ముందే చంద్రబాబునాయుడు ఆదివారం రాత్రికే డిల్లీ చేరుకోనున్నారు. ఆదివారం సాయంత్రం 7 గంటలకు ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి రాత్రి 9.15 నిముషాలకు డిల్లీ చేరుకొని. ఏపీ భవన్ లో రాత్రి బస చేసి 11వ తేది సోమవారం ఉదయం 7గంటలకు రాజఘాట్ లోని మహాత్మాగాంధీ సమాధి వద్దకూ, తర్వాత అక్కడినుంచి ఏపీభవన్ వద్ద ఉన్న అంబెడ్కర్ విగ్రహానికి పుష్పమాల వేసి  భవన్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ధర్మపోరాట దీక్ష ప్రారంభిస్తారు.

దీక్ష ప్రధాన వేదిక వద్ద అవసరమైన పబ్లిక్ అడ్రస్ సిస్టం పోలీసు రక్షణ వలయం మంచినీటి సరఫరా మీడియా లాంజ్ ప్రసారమాధ్యమాల ద్వార ప్రత్యక్ష ప్రసార ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు రాష్ట్రం నుంచి తరలివస్తున్న వారికి బస ఏర్పాట్లు చేసే బాధ్యతలను ఒక బృందం చూపుకుంటోంది.దీక్ష ముగిసిన అనంతరం అంటే మంగళవారం (ఫిబ్రవరి 12న) మధ్యాహ్నం 12.30కి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ను కలసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజనలో రాష్ట్రానికి  జరిగిన అన్యాయాన్ని వివరించి కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతారు. ఇక్కడితో ధర్మపోరాట దీక్ష పూర్తి అవుతుంది. 


అయితే  అదే రోజున చంద్రబాబును ఇరుకునపెట్టేలా మరో దీక్ష మొదలవుతోంది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు లాంటివారిని విడిచిపెట్టిన నిర్దోషినైన తనను నిందిస్తున్నారని ఆరోపిస్తూ ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న జెరూసలెం మత్తయ్య అదే రోజు దిల్లీలో నిరసన దీక్ష చేపడుతున్నారు. మత్తయ్య దీక్షకు పలు క్రైస్తవ సంఘాలు మద్దతిస్తున్నాయి కూడా. చంద్రబాబు దీక్ష చేస్తున్న రోజునే ఆయనపై ఆరోపణలున్న ఓటుకు నోటు కేసు విషయంలోనూ దీక్ష జరుగుతుండడంతో టీడీపీ ఇరుకునపడుతోంది.  టీడీపీని ఇబ్బంది పెట్టేందుకే ఇలా మత్తయ్యతో దీక్ష చేయిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.