విశాల్‌ని వీడని అసమ్మతి సెగలు...

15:34 - February 4, 2019

ఎన్ని చేసినా ఎంత అభివృద్ధి చేసి చూపించినా విశాల్ కు కోలీవుడ్ లో అసమ్మతి సెగలు తప్పడం లేదు. కొద్దిరోజుల క్రితం విశాల్ అంటే గిట్టని కొందరు దర్శకులు నటులు సమాఖ్య కార్యాలయానికి తాళం వేయడం పెద్ద దుమారమే రేపింది. అది పూర్తిగా చల్లారలేదు కానీ కొంత మేర సద్దుమణిగింది. అయితే నిన్న మొన్న ఇళయరాజా 75వ పుట్టినరోజును పురస్కరించుకుని నడిగర్ సంఘం నిధుల కోసం విశాల్ చేపట్టిన రెండు రోజుల మెగా లైవ్ కన్సర్ట్ సూపర్ సక్సెస్ అయ్యింది. అందులో వైస్ ప్రెసిడెంట్ గా ఉంటూ విశాల్ కు అత్యంత చేదోడువాదోడుగా ఉన్న పార్తిబన్ రాజీనామా చేసి ఈ ఈవెంట్ జరిగిన రెండు రోజులు దూరంగా ఉన్నాడు.  ఏం జరిగిందో స్పష్టంగా చెప్పకపోయినా ట్వీట్ల ద్వారా తన బాధను వ్యక్తపరుస్తూనే ఉన్నాడు.  అసలు దీనికి కారణం ఎంటని ఆరా తీస్తే పార్తిబన్ చెప్పిన కొన్ని అంశాలు ప్రోగ్రాంలో చేర్చలేదట. తన మాట లెక్క చేయనప్పుడు ఎందుకు కొనసాగాలి అని వైదొలగినట్టు చెబుతున్నారు. మొత్తానికి ఇళయరాజా ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయినా పార్తిబన్ రాజీనామాతో విశాల్ కు చివరికి కొంత మనస్థాపం మిగిలింది