విజయ్ దేవరకొండ అయినా సక్సెస్‌ అవుతాడా?

13:57 - March 20, 2019

అర్జున్ రెడ్డితో ఓవర్ నైట్ సెన్సేషన్ గా మారి గీత గోవిందంతో ఇండస్ట్రీ హిట్ తన ఖాతాలో వేసుకున్న విజయ్ దేవరకొండ రాబోయే మూవీ డియర్ కామ్రేడ్ మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. మల్టీ లాంగ్వేజ్ లో రిలీజ్ చేయడం మార్కెట్ పరంగా ప్లస్ అయ్యేలా ఉంది. అయితే ఇలా ఒకేసారి నాలుగైదు బాషలలో విడుదల చేయడం సాధారణంగా మన టాలీవుడ్ స్టార్ హీరోలు పెద్దగా చేయలేదు. కాని విజయ్ దేవరకొండ మాత్రం తమిళ్ మార్కెట్ మీద గట్టి కన్నె వేశాడు. నోటా ఫలితం తీవ్రంగా నిరాశ పరిచినప్పటికీ సాలిడ్ హిట్ ఒకటి పడితే కేరళలో అల్లు అర్జున్ కు వచ్చినట్టు తనకు పక్క రాష్ట్రంలో ఒక ఇమేజ్ ఏర్పడవచ్చు అనే అంచనా కావొచ్చు  కాని కోలీవుడ్ లో ఇప్పటిదాకా బలమైన జెండా నాటిన తెలుగు స్టార్ ఎవరూ లేరు. మహేష్‌బాబు కూడా ఒక్క స్పైడర్ తప్ప ఇంకేది సమాంతరంగా రిలీజ్ చేసే సాహసం చేయలేకపోయాడు. అయితే ఇప్పుడు దేవరకొండ మాత్రం సక్సెస్‌ కొట్టాలనే కసిమీద వున్నట్లున్నాడు. మరి విజయ్ దేవరకొండ అన్ని సినిమాలను ఇలా మల్టీ లాంగ్వేజ్ లోకి తీసుకెళ్ళడం వరస సక్సెస్ లు దక్కినప్పుడే కమర్షియల్ గా వర్క్ అవుట్ అవుతుంది. లేకపోతే డబ్బింగ్ వెర్షన్లకు అదనంగా ఖర్చు పెట్టుకోవడం మినహా నిర్మాతకు పెద్దగా ఒరిగేది ఏమి ఉండదు. ఇదంతా తేలడానికి కొంత టైం అయితే పట్టొచ్చు. డియర్ కామ్రేడ్ ఫలితం విజయ్ దేవరకొండ మల్టీ లాంగ్వేజ్ స్ట్రాటజీకి ఒక దిక్సూచిలా మారనుంది.