మళ్లీ తెరపైకి రానున్న లేడీ అమితాబ్‌...

17:03 - April 25, 2019

ఓ పాతికేళ్ళు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే లేడీ అమితాబ్ గా పేరున్న విజయశాంతి అప్పట్లో స్టార్ హీరోలతో సమానంగా పారితోషికం డిమాండ్ చేసేవారని నిర్మాతలు కూడా ఆలోచించకుండా అడిగినంత ఇచ్చేవారని చాలా కథనాలు వచ్చేవి. అంతెందుకు హీరో లేకుండా కేవలం విజయశాంతి బ్రాండ్ ఇమేజ్ మీదే దాసరి గారు ఒసేయ్ రాములమ్మ తీస్తే కురిసిన వసూళ్ల వర్షానికి బాక్స్ ఆఫీస్ తడిసి ముద్దయిపోయి రికార్డులతో హోరెత్తిపోయింది. దాని దెబ్బకు విజయశాంతి సోలోగా ఎన్ని సినిమాలు చేశారో లెక్కబెట్టడం కష్టం. ఒకపక్క గ్లామర్ వేషాలు చేస్తూనే మరోపక్క కర్తవ్యం లాంటి ఫైర్ బ్రాండ్ సినిమాలతో ఫాలోయింగ్ ఆశేషంగా పెంచుకున్న విజయశాంతి అంటే ఇప్పటికీ ప్రత్యేక గౌరవంతో చూసే అభిమానులకు కొదవ లేదు. ఇన్నాళ్ల గ్యాప్ తర్వాత మహేష్ బాబు-అనిల్ రావిపూడి కాంబో మూవీ కోసం తెరపైకి రానున్నారు. ఇందులో పాత్రకు గాను కోటి నుంచి కోటిన్నర మధ్యలో రెమ్యునరేషన్ ఫిక్స్ చేసినట్టు వినికిడి. భారీ డిమాండ్ ఉన్న హీరోయిన్లకే అంత ఇవ్వరు. అలాంటిది క్యారెక్టర్ రోల్ చేస్తున్న విజయశాంతికి అంత ఆఫర్ చేస్తున్నారు అంటే ఎంత పవర్ ఫుల్ పాత్ర అయ్యుంటుందో వేరే చెప్పాలా.