ఎన్నికల సంఘం ముందుకి "లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌" నిర్మాత

10:25 - March 25, 2019

*లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’  విడుదలపై ఇంకా క్లారిటీ లేదు

*ఎన్నికల సంఘం ఎదుటికి నేడు చిత్ర నిర్మాత 

* ప్రివ్యూ, ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌లో ఈసీనీ భాగస‍్వామ్యం చేయాలని ఆదేశించే అవకాశం

 

వర్మతన రెగ్యులర్  సినిమాలకు విరుద్ధంగా ఈ లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ని చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నాడు.  సినిమా షూటింగ్ కు దాదాపుగా 90 రోజులు వినియోగించాడు.  ఇంతటి సమయం తీసుకున్నాడు అంటే సినిమాలో ఏదో విషయం ఉండే ఉంటుంది అనే అనుమానాన్ని జనం లో కలిగించ గలిగాడు.  దానిని రుజువు చేస్తూ ఇప్పటికే రెండు ట్రైలర్స్ రిలీజ్ చేశారు.  రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. రిలీజ్ డేట్ అనౌన్స్ అయిందిగాని, సినిమా కరెక్ట్ గా రిలీజ్ అవుతుందా అన్నది సందేహంగా మారింది.  

ఎందుకంటే.. సినిమాను అడ్డుకుంటామని కొందరు చెప్తున్నారు.  సినిమాను రిలీజ్ చేయనివ్వమని కొందరు అంటున్నారు.  ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ముందే సినిమా విడుదల చేయాలని పట్టుదలగా ఉన్న వర్మ ఒక్వెళ సినిమాని రిలీజ్ చేయనివ్వకపోతే యూ ట్యూబ్ ద్వారా అయినా సరే సినిమాను విడుదల చేస్తా అంటూ మొండిగా సమాధానం చెప్పేశాడు. సినిమాపై వచ్చిన ఫిర్యాదులను ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది. సినిమా విషయంలో ఎన్నికల సంఘం నిబంధనల మేరకు వ్యవహరిస్తామని,పరిశీలన తర్వాత తుది నిర్ణయం వెలువరిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించిన సంగతి తెలిసిందే 


అయితే రిలీజ్‌ డేట్‌ను ప్రకటించినా ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రం విడుదలపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో ఆ చిత్ర నిర్మాత రాకేష్‌ రెడ్డి ఇవాళ ఉదయం 11 గంటలకు (సోమవారం) ఎన్నికల సంఘం ఎదుట వ్యక్తిగతంగా హాజరు కానున్నారు.  ఎన్టీఆర్‌ జీవిత చరిత్రను లక్ష్మీ పార్వతి కోణంలో తెరకెక్కించిన ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమాను తమకు చూపించాలని, లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌పై వస్తున్న అభ్యంతరాలపై చిత్ర నిర్మాత ఎంసీఎంసీ కమిటీ ఎదుట వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే వాట్సాప్‌ ద్వారా ఆ నోటీసులకు నిర్మాత రాకేష్‌ రెడ్డి సమాధానం ఇచ్చారు. దీనికి సంతృప్తి చెందిన ఈసీ. వ్యక్తిగతంగా కమిటీ ఎదుట హాజురు కావాలని స్పష్టం చేసింది. ఒకవేళ నిర్మాత సమాధానంతో సంతృప్తి చెందకపోతే ప్రివ్యూ, ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌లో ఈసీనీ భాగస‍్వామ్యం చేయాలని ఆదేశించే అవకాశం ఉంది.