ఆగని యోగి వీరంగం...

11:26 - January 22, 2019

యోగి ఆదిత్యానాథ్‌ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి కాగానే ' కాల్చిపారేస్తా ' అంటూ బహిరంగంగా ప్రకటించిన ఆయన పాలనలో రాష్ట్రాన్ని ఎన్‌కౌంటర్లకు పర్యాయపదంగా మార్చేశారు. ఇప్పుడు అక్కడ బూటకపు ఎన్‌కౌంటర్లు జరగని ప్రాంతమంటూ లేదు. హక్కుల సంఘాలు, విపక్షాలు ఎంత మొత్తుకుంటున్నా, దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చినా యోగి తీరులో మార్పులేదు. నేరగాళ్ళన్న ఆరోపణతో అమాయకులను ఎత్తుకుపోవడం, చిత్రహింసలు పెట్టి నకిలీ ఎన్‌కౌంటర్లలో కాల్చిపారేయడం రాష్ట్రంలో యథేచ్ఛగా సాగిపోతున్నదంటూ ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమిషన్‌ ఇటీవలే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసినా కేంద్రం పట్టించుకోలేదు. యోగి పాలనలో జరిగిన 1100 ఎన్‌కౌంటర్లపై సీబీఐతో లేదా సుప్రీంకోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రత్యేక బృందంతో దర్యాప్తు జరిపించాలని ఈ పిటిషన్‌ సుప్రీంకోర్టును అభ్యర్థించింది. గత ఏడాది జనవరిలో ఒక్కనెలలోనే 1038 ఎన్‌కౌంటర్లు జరిగాయనీ, వీటిలో 32 మంది మరణిస్తే238 మంది గాయపడ్డారని యోగి ప్రభుత్వమే అధికారికంగా ఒప్పుకున్నది కనుక, ఇప్పటివరకూ జరిగిన ఎన్‌కౌంటర్లు, మరణాల సంఖ్య మరింత ఎక్కువే ఉంటుంది. ఈ నేపథ్యంలో పీయూసీఎల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించడం, ఫిబ్రవరి 12 నుంచి విచారణకు సంకల్పించడం ఉపశమనం కలిగించే అంశం. ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకంగా పిటిషన్‌ దాఖలు కావడం, సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించడంతో ఇప్పుడు బాధిత కుటుంబాలవారిపై పోలీసుల వేధింపులు కొత్తగా మరింత పెరిగాయి. అక్రమ కేసులు బనాయించడం, ఇళ్ళు ఖాళీచేయించడం, గ్రామ పెద్దలపైన ఒత్తిడి తెచ్చి గ్రామాలు వదిలిపెట్టిపోయేట్టు చేయడం వంటి చర్యలతో పోలీసులు వారిని భయోత్పాతంలో ముంచుతున్నారు. యోగి ఆశీస్సులతో పోలీసులు రెచ్చిపోతున్నారు.
ఎన్‌కౌంటర్లు చేసినవారిని రక్షిస్తూ, పురస్కారాలతో, ప్రమోషన్లతో ప్రోత్సహిస్తుండటంతో పోలీసులు తమ విధేయతను రుజువు చేసుకోవడానికి తెగ శ్రమిస్తున్నారు. చాలా సంఘటనల్లో ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు కాదు. మనుషులను మాయం చేసి, ఎక్కడో కాల్చిపారేసి, తరువాత క్రైమ్‌సీన్‌ సృష్టి జరుగుతున్నది కనుక సాక్షులు ఉండరు. బాధితుల్లో అత్యధికులు మైనారిటీలు, దళితులే కనుక యోగికి వ్యతిరేకంగా గొంతువిప్పే అవకాశం, ధైర్యం వారికి లేదు. తుపాకీకి తుపాకీయే సమాధానం అంటున్నారు యోగి. నేరగాళ్ళను శిక్షించడంలో సైతం చట్టబద్ధమైన ప్రక్రియ అమలు కావాలని ఆయన అనుకోవడం లేదు. ఆయన మాట, బాట చట్టవ్యతిరేకమన్నది అటుంచితే, చేతిలో తుపాకీ లేని అమాయకులను సైతం ఆయన విధానం బలితీసుకుంటున్నది. గోవధకు పాల్పడినవారిపై నేషనల్‌ సెక్యూరిటీ యాక్ట్‌- ఎన్‌ఎస్‌ఎ కింద కేసులు పెట్టాలని ఆదేశించిన యోగి ఇలా మనుషులను వధించడం మాత్రం తప్పని భావించడం లేదు. ఆయన దృష్టిలో ఆవుకున్న విలువ మనిషికి లేదు. పార్టీ పెద్దలది సైతం ఇదే రకమైన ఆలోచనా ధోరణి కనుక వారు నిలువరించడానికి ప్రయత్నించడం లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది కనుక యోగి వీరంగానికి కాస్తంతైనా అడ్డుకట్టపడవచ్చు.