మీసం పెంచే పోలీస్ కి అలవెన్స్ 400% పెంపు: యూపీ అధికారుల నిర్ణయం 

14:16 - January 18, 2019
మన సినిమాల్లో పోలీస్ పాత్ర అనగానే ప్రతీ హీరోకీ ఉండే మొదటి క్వాలిఫికేషన్ మీసం. (పోకిరి లో మహెష్ బాబు తప్ప అదీ అండర్ కవర్ కాబట్టి) మిగతా హీరోలంతా మీసం మెలేసిన వాళ్ళే. పోలీస్ రోషం అంటూ హీరో మీసం మీద చెయ్యి వేయగానే ఈలలూ, చప్పట్లూ మోగి పోతాయి. ఒకప్పటి పాత సినిమాల్లో మీసమూ, బుల్లెట్ బైకూ లేకుంటే అసలు హీరోకి పోలీస్ లుక్ రానే రాదు అన్నతగా ఫిక్స్ అయిపోయారు. బయట జనం కూడా గంభీరంగా ఉండే పోలీసంటే భయపడతారు గానీ మరీ లవర్ బాయ్ లా ఉండే సుకుమారంగా ఉండే పోలీస్ ని చూసి పెద్దగా భయపడరు. పోలీసంటే అంకుశం రాజశేఖర్ లా ఉండాలి, పోలీస్ స్టోరీలో సాయికుమార్ లా ఉండాలి. మీసం తిప్పి గన్ను ఎక్కు పెడితే కిలోమీటర్ అవతల ఉన్న విలన్ కూడా మూడువందల మీటర్ల రేంజ్ కూడా లేని చిన్న రివాల్వర్ దెబ్బకే ఎగిరి పడతాడు. అదీ పోలీస్ మీసం పవర్. "విక్రమార్కుడు" లాంటి సినిమాల్లో కోరమీసం పోలీస్ మీసం మీద చెయ్యి ఉంచె చచ్చిపోతా అన్నాడంటే పోలీసోడికి జీతం లేకున్నా ఒకే గానీ మీసం లేకుంటే కుదరదు అన్నత గట్టిగా చెప్పాడు కదా. అప్పట్లో ఎస్పీ భయంకర్ అంటూ మీసం తిప్పిన పెద్దాయన ఎస్వీ రంగారావు దగ్గరినుంచీ "సింగమ్" లో సూర్యా పెంచిన బుర్ర మీసం దాకా పోలీస్ మీసం అంటే అదో క్రేజు. (మళ్ళీ ఇక్కడ బాలీవుడ్ "విజయ్" అమితాబ్ నీ, ఇఫ్తికార్ నీ వదిలెయ్యాలి అప్పట్లో మీసం కన్నా పోలీస్ అనే పాత్రనె ఎక్కువ ప్రేమించారు బాలీవుడ్ ప్రేక్షకులు)కానీ నిజం పోలీసుల విషయంలో మాత్రం మన సౌథ్ ఇండియన్ పోలీసులే పెద్ద ఇన్స్పిరేషన్.  ఆఖరికి మీసాలు తీసెసి నటించే అజయ్ దేవ్ గన్ కూడా "భాజీరావ్ సింగం" పాత్రకోసం మీసం పెంచి మెలి తిప్పాడు.   
 
   ఇప్పుడీ పోలీస్ మీసం కథ ఎందుకంటే అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మీసం పెంచే పోలీసులకు ఇచ్చే అలవెన్సును 400 శాతం పెంచాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారట.ప్రస్థుతం నెలకు ఒక్కో పోలీసుకు 50 రూపాయలు మీసం పెంచేందుకు వీలుగా అలవెన్సు ఇస్తుండగా దాన్ని 250 రూపాయలకు పెంచాలని ప్రతిపాదించారు. పోలీసులకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టేలా మీసం పెంచేందుకు వీలుగా మీసం అలవెన్సును 250రూపాయలకు పెంచాలని అదనపు డైరెక్టర్ జనరల్ బినోద్ కుమార్ సింగ్ ప్రతిపాదించారు. తాను పోలీసుగా మీసం పెంచడం తనకు ఇష్టమని మరో పోలీసు అదనపు డైరెక్టరు జనరల్ ప్రశాంత్ కుమార్ చెప్పారు. పోలీసుల మీసకట్టు ప్రజల్లో ప్రతిష్ఠను పెంచుతుందని ప్రశాంత్ కుమార్ అంటున్నారు. అదన్న మాట సంగతి అందుకే ఇప్పుడు యూపీ పోలీసులంతా మీసాలు పెంచి జనాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడ్డారట.