నమ్మకాలు అవే:నగరంలో ఇద్దరు మహిళల "నరబలి"?

14:20 - January 23, 2019

మూసీనదిలో ఇద్దరు గుర్తుతెలియని మహిళల మృతదేహాలు బయటపడటం సంచలనం రేపింది. మహిళలను చంపిన దుండగులు  మృతదేహాలను మూసీ నదిలో పారేశారు. మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు  చేపట్టారు.ఇద్దరు మహిళల్లో ఒకరిది 40 సంవత్సరాలు… మరొకరిది 50 ఏళ్లు ఉంటాయని భావిస్తున్నారు. ఒకరి చేతికి పసుపు అంటుకొని ఉండటం, చేతికి పసుపు కంకణం ఉండటంతో పలు అనుమానాలకు దారితీస్తోంది.  వారిద్దరి శరీరాల్ని ఒకే చీరలో చుట్టి ఉంచారు. ఇద్దరి కాళ్లకూ మెట్టెలు ఉన్నాయి. ఓ మహిళ మెడలో బంగారు గొలుసుతోపాటు పచ్చని గాజుల పెంకులూ కనిపించాయి. ఒడ్డున కొత్త చీర, పూజా సామాగ్రి కనిపించటంతో నరబలి జరిగిందనే అనుమానాలు మరింత బలపడ్డాయి. 


     మూసీ నది నీటిలో మృతదేహాలను గుర్తించిన స్థానికులు మంగళవారం మధ్యాహ్నం పోలీసులకు ఫోన్‌ చేశారు. లంగర్‌హౌజ్‌ పోలీసులు హుటాహుటిన వచ్చి నీటిలో పడిఉన్న మహిళల మృతదేహాలను వెలికితీశారు. అర్ధనగ్నంగా ఉన్న ఇద్దరి మహిళల తలలకు బలమైన గాయాలు ఉన్నాయి. క్లూస్‌టీమ్‌ సంఘటన స్థలి నుంచి ఆధారాలు సేకరించారు. స్థానికులెవరూ మృతులను గుర్తించలేక పోయారు. వారి ఆనవాళ్లను చూసి దినకూలీలని భావిస్తున్నారు.
 
గుర్తు తెలియని రెండు మృతదేహాలుగా కేసు నమోదు చేసుకున్నారు.పిల్లర్‌ నెంబర్‌ 117 నుంచి జనప్రియ అపార్ట్‌మెంట్‌కు వెళ్లే రహదారి పక్కన మూసీ నది ఒడ్డున ఈ మృతదేహాలు స్థానికులకు కనిపించాయి. ఇద్దరి మెడకు ఒకే చీర చుట్టుకొని ఉంది. ఒక మహిళకు తల వెనుక భాగంలో, మరో మహిళ కు తల ఎడమ వైపున బలమైన గాయాలు ఉన్నాయి. ఇద్దరినీ బండరాయితో మోది హతమార్చినట్లు అనుమానిస్తున్నారు. ఎక్కడైనా చంపి ఇక్కడ మృతదేహాలను పడేశారా? అనే కోణాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.


 మహిళలను సమీపంలోని కల్లు కాంపౌండ్‌ నుంచి తీసుకొచ్చి చంపారా? లేక ఎక్కడైనా చంపి ఇక్కడికి తీసుకొచ్చి పడేశారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 2018లోనూ  చిలుకానగర్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. పౌర్ణమి రోజున ఓ చిన్నారిని నరబలి ఇచ్చాక నిందితుడు మూసీలో పారేశాడు. ఇప్పుడు చోటు చేసుకున్న ఘటన కూడా అదే తరహా  ఉదంతమేనా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ప్రాథమిక ఆధారాలతో 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళలుగా గుర్తించారు. ఓ మృతదేహానికి తల వెనుక భాగంలో, మరోదానికి  కన్ను, నుదురు ప్రాంతాల్లో గాయాలను గుర్తించారు. మృతదేహాలు కుళ్లకపోవడంతో హత్యలు సోమవారం రాత్రి లేదా మంగళవారం తెల్లవారుజామున జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.