కేబుల్‌ కట్‌: ఆసక్తిని డబ్బుగా మార్చుకుంటున్న కేంద్రం

15:54 - March 1, 2019

తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా కేబుల్ కట్ అయిపోయింది.  కేంద్ర ప్రభుత్వం ట్రాయ్ కఠిన నిబంధనల నేపథ్యంలో దేశంలో నచ్చిన చానెల్ ను మాత్రమే చూడాలని.. ఆ చానెల్ కే ప్రజలు చెల్లించాలని కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. మొన్నటి వరకు కేబుల్ టీవీతోపాటు డిష్ టీవీలకు నెలసరి 200 చెల్లిస్తే అన్నీ చానళ్లు అందుబాటులోకి వచ్చాయి.. కానీ ఇక నుంచి కొత్త నిబంధనల ప్రకారం బేసిక్ ప్లాన్ తోపాటు పేయిడ్ చానళ్లు కలిపితే 300 రూపాయలు దాటిపోతోంది. ఇక స్పోర్ట్ ఇంకా ఎక్కువ చానెల్స్ కావాలంటే చేతి చమురు వదులుకోవాల్సిందే. అయితే జనవరికే ఈ పథకం నిలుపుదల చేస్తామని ప్రకటించినా.. మరో నెల రోజులు గడువు ఇచ్చింది. ఈ ఫిబ్రవరి 28తో గడువు ముగిసిపోయింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాలే కాదు.. దేశవ్యాప్తంగా చాలా ఇళ్లల్లో కేబుల్ ప్రసారాలు ఆగిపోయాయి. టీవీలో ప్రసారాలు నడవాలంటే ప్రస్తుతం...బేసిక్ ఫ్రీ చానెళ్ల రుసం 130 రూపాయలుగా కనీస మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఇది కాకుండా ఏ చానెల్ కావాలన్నా అదనంగా చెల్లించాలి. ఈటీవీ సహా జెమినీ జీ తెలుగు స్టార్ మా ప్యాక్ లు 27 రూపాయల నుంచి 40 రూపాయలవరకూ ఉన్నాయి. ఇక ఇంగ్లీష్ మూవీస్ క్రికెట్ మ్యూజిక్ లాంటివి కలిపి తీసుకుంటే ఎంత లేదన్నా నెలకు 400 రూపాయలు సమర్పించుకోవాల్సిందే. ఇవన్నీ మొన్నటి వరకు 200 రూపాయలకే లభించేవి. ఇప్పుడు నిబంధనల పేరుతో వినియోగదారుడి జేబుకు చిల్లు పెట్టేందుకు కేంద్రం ఎత్తు వేసింది. గతంలో నాణ్యత పేరుతో...సెట్ అప్ బాక్స్ విధానాన్ని ప్రవేశపెట్టి 2వేల వరకూ వసూలు చేసి జనాలను నిలువునా ముంచిన కేంద్రం.. ఇప్పుడు నచ్చిన చానెల్ పేరుతో భారీగా ముక్కుపిండి వసూలు చేయడానికి రెడీ అయ్యింది. నచ్చిన చానెల్ కు మాత్రమే చెల్లించాలంటూ వినియోగదారుల ఆసక్తిని డబ్బుగా మలుచుకునేందుకు కేంద్రం సిద్ధమైంది.