అంతేగా...అంతేగా...

10:43 - January 28, 2019

అంతేగా...అంతేగా...ఇది కొత్తగా వచ్చిన ఎఫ్‌2 చిత్రంలోని స్టోరీ లైన్‌. ఇప్పుడు తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా సేమ్‌ అదే పాత్ర పోషిస్తున్నారా...? అంటే అవునని చెప్పక తప్పదు. ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ప్రమాణ స్వీకారం చేసి 45 రోజులు దాటినా...మంత్రివర్గ విస్తరణపై నో కొశ్చన్‌. అధికార పార్టీ తీసుకునే నిర్ణయం ఏదైనా అంతేగా...అంతేగా అని తలాడించడం తప్ప...అందులో మేలు గురించి గానీ, జరిగే కీడు గురించి గానీ ప్రజలకు విప్పి చెప్పే ప్రయత్నమే జరగడంలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


తెలంగాణలో ఇప్పటికీ ఏర్పడని మంత్రివర్గం విస్తరణ...
           ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశాక ఇప్పటికీ మంత్రి వర్గ విస్తరణ చేపట్టకపోయినా అడిగేవరెవ్వరూ లేరు. ముహూర్తం కుదరకే మంత్రి వర్గ విస్తరణ వాయిదా పడుతూ వస్తుందనే లీకులకు ప్రతిపక్ష నేతలు అంతేగా...అంతేగా అనుకుంటూ అంగీకరిస్తున్నారే తప్ప...ఇదేంటీ అని ప్రశ్నించేందుకు నోరు రావడంలేదు. ఇక సీఎం కేసీఆర్‌ చేపట్టిన మహాసహ్ర చండీ యాగం తర్వాత కురిసిన వర్షం కూడా యాగం సక్సెస్‌ కావడంతోనేనని పులకించిపోతున్నారట గులాబీ శ్రేణులు. అంతేగానీ అకాలవర్షం వల్ల నష్టపోయిన పంటల గురించిగానీ, రైతులను ఆదుకునే పట్టింపే లేకుండా పోయింది అధికార పార్టీకి. ఎలాగూ జనం తరుపున గొంతెత్తే ప్రతిపక్ష పార్టీలేనే లేదు. దాంతో అధికార పార్టీ ఆడందే ఆట, పాడిందేపాటగా మారిపోయిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అందు టిఎస్‌ఎస్సీ ఛైర్మన్‌ గంట చక్రపాణి ఉద్యోగనియామకాల్లో అత్యంత పారదర్శకత పాటిస్తున్నామని సర్కారును వెసుకేసుకొచ్చినా ముక్కున వేలేసుకోని ఔరా అనడం తప్ప...లోపాలు ఎత్తిచూపే ప్రయత్నం ఒక్కరూ చేయలేదు. అధికార పార్టీగా టిఆర్‌ఎస్‌ ఏ నిర్ణయం తీసుకున్నాగానీ ప్రజలు పులకించిపోతున్నట్లు చూపించేలా మీడియా ఎప్పుడో...గులాబీ బాస్‌ గుప్పిట్లోకి వెళ్లిపోయింది. దాంతో తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతానికి మరికొద్ది రోజులు స్తంబద్దత తప్పదు అనే వ్యాఖ్యానికి అంతా...అంతేగా...అంతేగా అనుకోవాల్సిన పరిస్థితే...అంటున్నారు సీనియర్‌ రాజకీయా వేత్తలు.