కన్ను మూసిన దర్శకులు కోడి రామకృష్ణ

20:54 - February 22, 2019

*టాలివుడ్ దర్శక దిగ్గజం కోడి రామకృష్ణ కన్నుమూత 

*తెలుగు సహా పలు భాషల్లో  వంద చిత్రాలకుపైగా దర్శకత్వం

 *కోడి రామకృష్ణ మృతిపట్ల సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి

 

ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ అనారోగ్యంతో కన్నుముశారు.గతకొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన. శుక్రవారం మధ్యాహ్నం తనువు చాలించారు. వందకు పైగా చిత్రాలకు రామకృష్ణ దర్శకత్వం వహించారు. రామకృష్ణ మృతితో టాలీవుడ్‌లో విషాదచాయలు అలుముకున్నాయి. ఇటీవల కోడి రామకృష్ణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడటంతో బుధవారం ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో (ఏఐజీ) ఆస్పత్రికి తరలించారు.
 
ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌ ఎక్కువగా ఉండడంతో కొంతకాలంగా చికిత్స పొందుతూ ఉన్న ఆయన శుక్రవారం ఆయన కన్నుమూశారు. కోడి రామకృష్ణ పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో జన్మించారు. పాలకొల్లులోని లలిత కళాంజలి సంస్థ ద్వారా అనేక నాటకాలు వేశారు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో దర్శకుడిగా తన కెరీర్ ప్రారంభించి వంద చిత్రాలకుపైగా దర్శకత్వం వహించారు.

తెలుగు సినిమా సినీ పరిశ్రమలో అగ్రకథా నాయకులందరితో ఆయన సినిమాలు తీశారు. తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ, కన్నడ, మలయాళ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శక-నిర్మాత, దివంగత దాసరి నారాయణరావు.. రామకృష్ణను సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. సినీ రంగంలో రామకృష్ణది 30ఏండ్ల సుధీర్ఘ ప్రస్థానం. ఆయన తీసిన తొలి చిత్రమే 525 రోజులు ఆడింది. అత్యధికంగా గ్రాఫిక్స్, స్పెషల్ ఎఫెక్ట్స్‌లతో విజయవంతమైన చిత్రాలు తీశారు. ఎక్కువగా గ్రామీణ, కుటుంబ, మహిళా నేపథ్యంలో సినిమాలకు ప్రాధాన్యం ఇచ్చారు. శత్రువు చిత్రానికి ఫిల్మ్‌ఫేర్ అవార్డు దక్కింది. 

మంగమ్మగారి మనవడు, ఆహుతి, శత్రువు, అమ్మోరు, అరుంధతి, తలంబ్రాలు, భారతంలో బాలచంద్రుడు, స్టేషన్ మాస్టర్, ముద్దుల మావయ్య, మా ఆవిడ కలెక్టర్, పెళ్లి, దొంగాట, అంజి, దేవిపుత్రుడు, దేవి, దేవుళ్లు, పంజరం, పెళ్లాం చెబితే వినాలి, భారతరత్న, మువ్వగోపాలుడు, లేడీ బాస్, శ్రీనివాస కల్యాణం, అంకుశం, రాజధాని, పుట్టింటికి రా చెల్లి వంటి హిట్ చిత్రాలు. తెలుగు చిత్రపరిశ్రమకు గ్రాఫిక్స్‌ను పరిచయం చేశారు. అమ్మోరు సినిమాతో గ్రాఫిక్స్‌తో కథను ఎంత గొప్పగా చెప్పొచ్చో.. చేసి చూపించారు.

2009లో చనిపోయిన కన్నడ హీరో విష్ణువర్థన్ తో మూవీ చేసాడు కోడి రామకృష్ణ. విష్ణువర్థన్ కన్నడలో అప్పట్లో స్టార్ హీరో. 1972లో విష్ణువర్థన్ హీరోగా నాగరహావు సినిమా వచ్చింది.  ఆ చిత్రాన్ని మరోసారి అదే విష్ణవర్థన్ మరణించాక ఆయనని గ్రాఫిక్స్ లో మళ్ళీ సృష్టించి మరీ ఆయనే హీరోగా తెరకెక్కించాడు కోడి రామకృష్ణ . తెలుగులో ‘నాగభరణం’ అనే టైటిల్ తో విడుదల అయింది. చనిపోయిన‌ కన్నడ నటుడు విష్ణువర్ధన్‌ను గ్రాఫిక్స్‌ ద్వారా వెండితెరపై పునః సృష్టించిన తొలి దర్శకుడు ఆయనే. 2016లో ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ఇదే కోడి రామ‌కృష్ణ‌కి చివ‌రి చిత్రం.  


   కోడి రామకృష్ణ మృతిపట్ల సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తెలుగు సినీ పరిశ్రమ ఓ గొప్ప దర్శకుడిని కోల్పోయిందని పలువురు సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రామకృష్ణ మృతిపట్ల టాలీవుడ్ హీరోలు మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, నాని స్పందించారు. అలాగే శ్రీకాంత్, సుశాంత్, డైరెక్టర్ మారుతి, రచయిత బీవీఎస్ రవి ట్విట్టర్ ద్వారా కోడి రామకృష్ణ మృతికి సంతాపం వ్యక్తం చేశారు.