బీజేపీ,టీడీపీ నుంచి మళ్ళీ వైసీపీలోకి జీవితా రాజశేఖర్

12:08 - April 1, 2019

*మళ్ళీ వైసీపీలోకి జీవితా రాజశేఖర్, పొరపాటు తెలుసుకున్నాం అంటూ...

*కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జగన్ 

*నటి హేమ, యాంకర్ శ్యామల కూడా చేరిక  

 

టాలీవుడ్ నటులు రాజశేఖర్, జీవిత దంపతులు వైసీపీలో జాయిన్ అయ్యారు. లోటస్ పాండ్‌లో సోమవారం ఉదయం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి‌తో భేటీ అనంతరం.. పార్టీ కండువా కప్పుకున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితే.. సూపర్ డూపర్ అనేలా పాలన అందిస్తారని రాజశేఖర్ అన్నారు.

అన్ని వర్గాల సంక్షేమం కోసం పని చేస్తారని తెలిపారు. గతంలో జగన్‌తో విభేదాలు ఉన్నమాట వాస్తవమేనని..  అప్పట్లో జ‌గ‌న్ పై కొన్ని ఆరోప‌ణ‌లు చేసామ‌ని..ఆ త‌రువాత తామ అస‌లు విష‌యాలు తెలు సు కున్నామ‌ని వివ‌రించారు.  జ‌గ‌న్ కు ఒక్క అవ‌కాశం ఇవ్వాల‌ని ఏపి ప్ర‌జ‌ల‌ను కోరారు. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యేందుకు మా వంతు కృషి చేస్తామ‌ని, ఇప్పటి వ‌ర‌కు త‌మ మ‌నస్సుల్లో ఉన్న మ‌న‌స్ప‌ర్ద‌లు తొలిగిపోయాయ‌ని,త‌మ‌కు జ‌గ‌న్ తో ఎటువంటి శ‌త్రుత్వం లేద‌ని చెప్పుకొచ్చారు జీవిత‌- రాజ‌శేఖ‌ర్‌.అయితే తాము గతంలో చూసిన జగన్ వేరు.. ఇప్పుడున్న జగన్ వేరని చెప్పారు.
                                                      
గతంలో వైసీపీలో ఉన్న ఈ దంపతులు.. జగన్‌తో విభేదాలు కారణంగా.. బీజేపీలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి.. గతేడాది చంద్రబాబుకు మద్దతు పలుకుతూ టీడీపీలో చేరారు. ఇప్పడు మళ్లీ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.ఇదిలా ఉంటే జీవిత, రాజశేఖర్‌లతో పాటు పలువురు సినీ తారలు వైసీపీ కండువా కప్పుకున్నారు. సినీ నటి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు హేమ,  టీవీ యాంకర్ శ్యామల దంపతులు జగన్ సమక్షంలో పార్టీలో చేరారు.  యాంకర్ శ్యామల పొలిటికల్ ఎంట్రీ బుల్లితెర వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

                                                               

జగన్ విధానాలు నచ్చి పార్టీలో జాయిన్ అయినట్లు శ్యామల వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేయనున్నట్లు ప్రకటించారు. ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. జగన్ నెక్ట్స్ సీఎం కావటం ఖాయమని జోస్యం చెప్పారు. రాజకీయాల్లోనూ చురకైన పాత్ర పోషిస్తానని చెప్పుకొచ్చారు. బిగ్ బాస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు యాంకర్ శ్యామల.