జానీ మాస్టర్ కి ఆరునెలల జైలుశిక్ష: దాడి ఆరోపణల్లో దోషిగా తేలినందునే

11:23 - April 2, 2019

*టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కి జైలు శిక్ష

*బ్లాక్ బస్టర్ హిట్స్ కి అదిరిపోయే స్టెప్పులను ఇచ్చిన టాప్ కొరియోగ్రాఫర్

* తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీల్లో కూడా పాపులర్ అవుతున్న జానీ మాస్టర్ 

 

టాలీవుడ్ స్టార్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ కి ఆరునెలల జైలుశిక్ష పడింది. 2015లో 354, 324, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు అయిన జానీ మాస్టర్ ఆయా చట్టాల ప్రకారం నేరస్తుడని తేలటంతో జైలుశిక్ష పడింది.  చిన్నప్పటి నుండి చాలా కష్టపడి కూలీగా, లారీ డ్రైవర్‌గా పనిచేసిన జానీ మాస్టర్ 2009లో ద్రోణ సినిమాతో కొరియోగ్రాఫర్‌గా కెరియర్ మొదలుపెట్టాడు. అప్పటి నుండి వరుసగా సినిమాలు చేస్తు స్టార్ హీరోలకు అద్భుతమైన కొరియోగ్రఫీ అందించి పేరు సంపాదించాడు.

జానీ మాస్టర్ డాన్స్ కొరియోగ్రాఫర్ గా తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. రాంచరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల చిత్రాల్లో అదిరిపోయే స్టెప్పులు వేయించడంలో జానీ మాస్టర్ దిట్ట. కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాక పలు చిత్ర పరిశ్రమల్లో జానీ మాస్టర్ అగ్ర హీరోలతో స్టెప్పులు వేయిస్తున్నాడు. అయితే అనుకోకుండా ఇప్పుడు అతన్ని మళ్ళీ సమస్యలు చుట్టు ముట్టినట్టెవ కనిపిస్తోంది. ఇంతకీ ఈ శిక్ష దేనికీ అంటే... 

                                                               

    2015లో మేడ్చల్ మండలంలోని కండ్లకొయ్యలోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో జానీ మాస్టర్ తన టీంతో కలిసి పాల్గొన్నారు. అయితే ఓ పాట విషయంలో జానీ మాస్టర్ టీమ్‌కి మరో టీమ్‌కి మధ్య గొడవ గొడవ జరిగింది. ఈ గొడవలో డ్యాన్స్ మాస్టర్ జానీ బృందం తమపై దాడికి పాల్పడ్డారని మరో బృందం మేడ్చల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసును దర్యాప్తు చేసిన పోలీసులు జానీ మాస్టర్‌తో పాటు కోయిడ వేణు, ఘన్ శ్యామ్, వెంకటరమణ, ఎర్రోళ్ల రమేష్, ఎర్రపల్లి ప్రకాష్ ముద్దాయిలుగా చేర్చారు.                                                  

2015 నుండి మేడ్చల్‌లోని సివిల్ సీనియర్ కోర్టులో ఈ కేసు విచారణ జరగగా నేడు తీర్పు వెలువడింది. సుదీర్ఘ వాదనల అనంతరం.. దాడికి పాల్పడిన డ్యాన్స్ మాస్టర్ జానీతో పాటు కోయిడ వేణు, ఘన్ శ్యామ్, వెంకటరమణ, ఎర్రోళ్ల రమేష్, ఎర్రపల్లి ప్రకాష్ లను నిందితులుగా గుర్తించింది కోర్టు. దీంతో ఒక్కొక్కరికి 6 నెలల జైలు శిక్షతో పాటు 1500 జరిమాన విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చిందని ఇచ్చిందని మేడ్చల్ సిఐ గంగాధర్ వివారాలను తెలియజేశారు.

                                                       

ప్రమాదకర ఆయుధాలు ఉపయోగించినప్పుడు, గాయపరిచినప్పుడు, హత్యాయత్నం చేసినప్పుడు 354 సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు. జానీ మాస్టర్ అలాంటి పనులేవీ చేయలేదని కోర్టు నిర్ధారించడంతో ఆ సెక్షన్ కింద నమోదైన కేసుని కొట్టివేసింది. కోర్టు సంచలన తీర్పు వెల్లడించడంతో జానీ మాస్టర్ కుటుంబ సభ్యులు ఇంకా స్పందించలేదు. ఆయన బెయిలు దరఖాస్తు చేసుకుంటారా అనే విషయం ఇంకా తెలియలేదు.

                                                       
జిగేలు రాణి.. సినిమా చూపిస్తా మామా.. లైలా ఓలైలా.. మీ తాత టెంపర్.. కమ్ టు ద పార్టీ.. పిల్లా నువ్వు లేని జీవితం.. వంటి బ్లాక్ బస్టర్ మ్యూజికల్ హిట్స్ సాంగ్‌కి అదిరిపోయే స్టెప్పులను ఇచ్చి టాప్ కొరియోగ్రాఫర్ అనిపించుకున్నారు జానీ మాస్టర్. కొరియోగ్రాఫర్‌గానే కాకుండా.. ఈటీవీ ‘ఢీ’ డాన్స్‌ షో కొరియోగ్రాఫర్‌గా.. ఢీ జూనియర్స్‌ 2‌కి మెంటర్‌గా.. ఢీ జోడీకి మెంటర్‌గా పనిచేసి.. మా టీవీలో ప్రసారమైన ‘నీతోనే డాన్స్’ షోకి జడ్జ్‌గా వ్యవహరించారు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాలకు పనిచేశారు జానీ మాస్టర్.