తిరగబడుతున్న తెలుగు బిడ్డలు: ఏపీ పోలింగ్ లో పలుచోట్ల ఘర్షణలు

11:48 - April 11, 2019

 రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్‌ ప్రారంభమైంది. తెలంగాణతో పాటు ఏపీ వ్యాప్తంగా ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు, 25 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరుగుతుండగా..  తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు తరలివస్తున్నారు. పలు చోట్ల ఈవీఎం మొరాయించడంతో చిన్నచిన్న సమస్యలు తలెత్తాయి. తెలంగాణాలో ఎన్నికలు ప్రశాంతంగానే జరుగుతూన్నా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం గొడవలు చేసుకుంటున్నాయి. 

 జమ్మలమడుగులో టీడీపీ, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పోలీసులపై దాడులకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న ఎస్పీ హుటాహుటిన జమ్మలమడుగు బయల్దేరి వెళ్లాడు. పొన్నతోటలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో ఇరు వర్గాలకు చెందిన పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించారు. అలాగే బ్రహ్మంగారిమఠం మండలం గుండాపూర్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ-వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు సర్ది చెప్పారు.

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నివాసపురంలో టీడీపీ పోలింగ్‌ ఏజెంట‍్లు  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏజెంట్‌పై దాడి చేశారు. బూత్‌ నంబర్‌ 100లోని వైఎస్సార్‌ సీపీ ఏజెంట్‌ను తీవ్రంగా కొట్టారు. అడ్డుకున్న అధికారును బెదిరిస్తూ పోలింగ్‌ కేంద్రంలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. దీంతా అక్కడ తాత్కాలికంగా పోలింగ్‌ నిలిచిపోయింది. 
 
విజయవాడ జక్కంపుడి వైఎస్‌ఆర్‌ కాలనీలో టీడీపీ నేతలు పేట్రేగిపోయారు. పోలింగ్‌ కేంద్రం వద్ద డబ్బులు పంచుతుండగా వైఎస్సార్‌ సీపీ కార‍్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు. ఈ దాడిలో పలువురు వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. టీడీపీ నేతలపై కొత్తపేట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో మంత్రి పరిటాల సనీత వర్గీయులు భీభత్సం సృష్టించారు. సనపలో ఈవీఎంలు ధ్వంసం చేసి ఓటర్లపై బెదిరింపులకు దిగారు. సిద్ధరాంపురంలో వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై రాళ్లతో దాడులు చేశారు. ఈ దాడిలో ఐదుగురు వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. మరూరు గ్రామంలో మంత్రి సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్‌ అక్కడే ఉండి సర్ది చెప్పే ప్రయత్నాలు చేశారు. 

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అహోబిలంలోని పోలింగ్ బూత్ వద్ద భూమా- గంగుల వర్గీయులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. బూత్‌లోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రెడ్డి, సోదరి మౌనికకు గాయాలయ్యాయి. తక్షణమే జోక్యం చేసుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ దాడులతో ఓటర్లు భయాందోళనకు గురయ్యారు. భయంతో పోలింగ్ కేంద్రం నుంచి వారు పరుగులు తీశారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న భూమా అఖిలప్రియ అహోబిలం చేరుకున్నారు.

ఇలా సాయంత్రం లోపు మరెన్ని గొడవలు జరుగుతాయో అర్థం కాక ఆందోళనలో ప్రజలున్నారు. అయినా పోలింగ్రేటు మాత్రం తగ్గటం లేదు ప్రజలంతా బారులు తీరి ఓటు వేసేందుకు ఉత్సాహంగా ఉన్నారు. మన రాష్ట్రాల్లో పరిస్థితి ఇది అయితే పశ్చిమ బెంగాల్లో లోక్‌సభ తొలి విడత ఎన్నికల సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కూచ్‌బెహార్‌ పార్లమెంటు నియోజకవర్గంలోని దిన్హాటలో ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. తృణమూల్ కార్యకర్తలే తమను కొట్టారంటూ బీజేపీ కార్యకర్తలు ఆరోపిస్తుండగా... బీజేపీ నేతలే తమపై దాడులకు పాల్పడ్డారని తృణమూల్ చెబుతోంది.