మోసపోయాం,ఆకలితో అలమటిస్తున్నాం: ఇరాక్ లో తెలంగాణా పౌరులు

17:59 - January 17, 2019

కడుపు ట్టుకొని కొన్నాళ్ళు కష్టపడితే చాలు కొన్ని డబ్బులు కళ్ళ జూడవచ్చు, ఓ నాలుగేళ్ళు కళ్ళు మూసుకొని బతికి నాలుగు దీనార్లు చేతిలో పడితే జీవితం మారిపోతుందనే నమ్మకం వమ్మయిపోతోంది. కుటుంబాన్ని పోషించుకునేందుకు, అప్పులు తీర్చేసేందుకు పొట్ట చేతబట్టుకుని గల్ఫ్‌ బాట పడుతోన్న వలస జీవులు. అక్కడ రకరకాల మోసాలకు గురి అవుతున్నారు,. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ పల్లెల్లో ఏ తలుపు తట్టినా వలస బతుకుల విషాదమే పలకరిస్తోంది. రాష్ట్రంలో వలసలకు సంబంధించి సక్రమమైన అధ్యయనం కానీ, రికార్డులు కానీ ఏమీ లేవు.

స్వచ్ఛంద సంస్థల రికార్డుల ప్రకారం.. తెలంగాణ జిల్లాల నుంచి గల్ఫ్‌ దేశాలకు అత్యధికంగా వలస వెళ్తున్న వారిలో పురుషులు 95 శాతం, మహిళలు 5 శాతం మేర ఉన్నారు. పురుషుల్లో 50 శాతం మంది కార్మికులే. వీరంతా 18-30 ఏళ్లలోపు వారే. ఇందులో ప్రాథమిక విద్యను అభ్యసించిన వారు 35 శాతం కాగా, 21 శాతం మంది నిరక్షరాస్యులు. గల్ఫ్‌ దేశాలకు వెళ్తున్న వారిలో 85 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారే కాగా.. 38 శాతం మందికి కనీసం గుంట భూమి కూడా లేదు.

2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలోని మొత్తం జనాభాలో 61.88 లక్షల మంది అంతర్‌ జిల్లా, అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ వలసల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్‌ జిల్లాలతోపాటు హైదరాబాద్‌ పాత నగరం నుంచి వలసలు ఎక్కువగా ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితె.. ఇలాంటి ఆశలతోనే విమానం ఎక్కి తమ జీవితాలను మార్చుకుందామని ఆశపడ్డ 15 మంది ఇప్పుడు ఇరాక్ గడ్డ మీద ఆకలికి అలమటిస్తూ అనాదల్లా పడి ఉన్నారు... 

నిజామాబాద్‌ నందిపేట మండలం షాపూర్‌కు చెందిన ఏజెంట్‌ నరేందర్‌ పని ఇప్పిస్తానని నమ్మించి నాలుగు నెలల క్రితం నందిపేట, నవీపేట, సిరికొండ, దర్పల్లి మండలాలకు చెందిన 15 మందిని విజిటింగ్‌ వీసాలపై ఇరాక్‌ పంపాడు. తర్వాత పత్తా లేకుండా పోయాడు. కొన్నాళ్లు అక్కడ గుట్టుగా తలదాచుకున్న బాధితులకు తాత్కాలిక నివాస అనుమతి  కల్పిస్తానంటూ మరో ఏజెంట్‌ రూ.50వేల చొప్పున తీసుకొని మొహం చాటేశాడు. వీరంతా ప్రస్తుతం ఇర్బిల్‌ అనే ప్రాంతంలో ఉంటూ తిండికి లేక అలమటిస్తున్నారు.

అటు విజిటింగ్‌ వీసా గడువు ముగియడంతో ఇరాక్‌ అధికారులు జరిమానాలు విధించారు. స్వదేశానికి తిరిగి వచ్చేందుకు రూ.8వేల చొప్పున కావాలని.. అంతమొత్తం తమ వద్దలేదని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. దుర్భర పరిస్థితుల్లో రోజులు గడుపుతున్నాం. ఆదుకోండి అంటూ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌కు వీడియోలో మొరపెట్టుకున్నారు. ఇళ్లకు ఫోన్లు చేసి బాధను కళ్లకు కట్టడంతో వారి కుటుంబ సభ్యులు.. డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. నిజామాబాద్‌లో గల్ఫ్‌ కల్చర్‌ అసోసియేషన్‌ ప్రతినిధి బసంత్‌రెడ్డితో కలిసి బాధిత కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ తమ వారిని స్వదేశానికి తీసుకురావాలని వేడుకున్నారు. మోసపోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఏజెంట్‌ను అరెస్టు చేయాలని తెలంగాణ గల్ఫ్‌ కల్చర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బసంత్‌రెడ్డి కోరారు. 


కొన్ని రఒజులు అక్కడ శ్రమపడితే చాలు ఇక తమ కష్టాలన్నీ తీరిపోయినట్టే అనుకుంటూ, అక్కడ సంపాదనపై ఎక్కువ ఊహించుకోవడం, ఎన్నో ఆశలతో వెళ్లాక తీరా అక్కడ అనుకున్నంతగా రాకపోవడం, వాతావరణం సరిపడక ఆరోగ్య ఇబ్బందులు అక్కడ ఉండే ధరల ప్రకారం చాలీ చాలని జీతాల్లో డబ్బులని మిగల్చలేక చాలామంది డీలా పడిపోతున్నారు. అసలే ఇక్కడ అప్పులు. దానికితోడు వెళ్లడానికి మరికొంత అప్పు. ఎక్కువగా ఒప్పంద మోసాలతో పలువురు దగా పడుతున్నారు. దీంతో అక్కడ కనీసం తామే బతకలేని పరిస్థితులూ ఎదురవుతున్నాయి.