మరోసారి రాష్ట్రంలో ఎన్నికల వేడి

14:01 - January 2, 2019

తెలంగాణ ఎన్నికలు జరిగి నెలరోజులు కూడా కాకముందే మరోసారి ఎన్నికల వేడి రాజుకుంది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి  మంగళవారం రాష్ట్రంలోని 12732 గ్రామపంచాయతీలకు జనవరి 21 నుంచి 30లోపు ఎన్నికలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు. అంతేకాదు ఈరోజు నుంచే మళ్లీ తెలంగాణ ఎన్నికల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఎన్నికల కోడ్  అమల్లోకి వస్తున్నట్టు తెలిపారు. పంచాయితీ ఎన్నికలు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికలు నిర్వహిస్తారు.లంచ్ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లు లెక్కించి సాయంత్రంలోపు విజేతలను ప్రకటిస్తారు. ఈ మేరకు కార్యాచరణను ఎన్నికల కమిషనర్ విడుదల చేశారు.

ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో మూడు విడతల్లో గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలిపారు. మొదటి విడతలో 4480 గ్రామ పంచాయతీ సర్పంచ్ లకు 39832 వార్డులకు జనవరి 21న ఎన్నికలు నిర్వహిస్తారు.

ఇక రెండో విడతలో జనవరి 25న 4137 గ్రామ పంచాయతీ సర్పంచ్ లకు 36620 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇక మూడో విడతలో జనవరి 30న 4115 గ్రామ పంచాయతీలకు 36718 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 

ఈ మేరకు మొదటి విడతకు జనవరి 7న నోటిఫికేషన్ విడుదల చేస్తామని.. జనవరి 9న నామినేషన్లు దాఖలు చేయాలని.. జనవరి 21న పోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు.

రెండో విడతకు జనవరి 11న నోటిఫికేషన్ జారీ చేస్తే.. జనవరి 13న నామినేషన్లు దాఖలు చేయాలి.. 25న ఎన్నికలు నిర్వహిస్తారు.

ఇక మూడో విడతలో జనవరి 16న నోటిఫికేషన్ విడుదల చేస్తే జనవరి 18న నామినేషన్లు దాఖలు చేస్తారు. జనవరి 30న ఎన్నికలు నిర్వహిస్తారు.