72 ఏళ్ళ ఎదురుచూపుల కల: ఇండియన్ క్రికెట్ కు కోహ్లీ బహుమానం

03:22 - January 19, 2019

 టీమిండియాకు ఇది పెద్ద విజయం, ఒకటీరెండూ కాదు   72 సంవత్సరాల కల ఇన్నాళ్ళ్కు నెరవేరింది. ఆస్ట్రెలియా భూమిమీద క్రికెట్ విజేతగా భారత పతాక ఎగరేయాలన్న ప్రయత్నం ఎందరో దిగ్గజ కెప్టెన్లకు సైతం సాధ్యం కాని విజయాన్ని విరాట్ కోహ్లీ అలవోకగా సాధించాడు. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు, వన్డే సిరీస్‌లను గెలుచుకుని అరుదైన రికార్డును అందుకున్నాడు. భారత క్రికెట్ చరిత్రలో ఒక అరుదైన మైలురాయిని నాటి చూపించాడు.
 
ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుని ఆస్ట్రేలియా గడ్డపై ఏడు దశాబ్దాలుగా అందని ద్రాక్షగా మారిన సిరీస్ విజయాన్ని కోహ్లీ అందించాడు. అంతకుముందు జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను భారత్ 1-1తో సమం చేసింది. తాజాగా జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో గెలుచుకుని రికార్డులకెక్కింది.

 ఆస్ట్రేలియా పర్యటనకు భారత్‌ ఘనమైన ముగింపునిచ్చింది. కంగారూ టూర్‌లో టీమిండియా విసిరిన ఆఖరి పంచ్‌ సరిగ్గా లక్ష్యాన్ని తాకింది. మూడు వన్డేల సిరీస్‌ను 2–1తో గెలుచుకొని కోహ్లి బృందం మరోసారి తమ సత్తాను ప్రదర్శించింది. శుక్రవారం మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ (ఎంసీజీ)లో జరిగిన చివరి వన్డేలో భారత్‌ 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రే లియా 48.4 ఓవర్లలో 230 పరుగులకే ఆలౌటైంది. పీటర్‌ హ్యాండ్స్‌కోంబ్‌ (63 బంతుల్లో 58; 2 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా... షాన్‌ మార్‌‡్ష (54 బంతుల్లో 39; 3 ఫోర్లు), ఉస్మాన్‌ ఖాజా (51 బంతుల్లో 34; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. భారత లెగ్‌ స్పిన్నర్, ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ యజువేంద్ర చహల్‌ 42 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టడం విశేషం. అనంతరం భారత్‌ 49.2 ఓవర్లలో 3 వికెట్లకు 234 పరుగులు చేసి గెలిచింది. ధోని (114 బంతుల్లో 87 నాటౌట్‌; 6 ఫోర్లు), కేదార్‌ జాదవ్‌ (57 బంతుల్లో 61 నాటౌట్‌; 7 ఫోర్లు) నాలుగో వికెట్‌కు అభేద్యంగా 121 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. కోహ్లి (62 బంతుల్లో 46; 3 ఫోర్లు) మరో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. సిరీస్‌లో ధోని మొత్తం 193 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ పురస్కారం అందుకున్నాడు. పలు క్యాచ్‌లు, రనౌట్‌ అవకాశాలు వృథా చేసి ఆస్ట్రేలియా చేజేతులా మ్యాచ్‌తో పాటు సిరీస్‌నూ కోల్పోయింది.  
 
ఆస్ట్రేలియా గడ్డపై భారత్‌కు ఇదే తొలి ద్వైపాక్షిక వన్డే సిరీస్ విజయం. సిరీస్ ఓటమి లేకుండా ఆసీస్ టూర్‌ను భారత్ ఘనంగా ముగించింది. 2016లో ఆసీస్ పర్యటనకు వెళ్లిన భారత్ 1-4తో ఓటమి పాలైంది. రెండేళ్ల తర్వాత ఇప్పుడు కోహ్లీ ప్రతీకారం తీర్చుకున్నాడు. కాగా, 1947-48లో తొలిసారి ఆస్ట్రేలియాలో పర్యటించిన భారత జట్టు 0-4తో ఘోర ఓటమి చవి చూసింది. నాటి నుంచి ఆసీస్ గడ్డపై అందని ద్రాక్షలా మారిన సిరీస్ విజయాన్ని భారత్‌కు అందించిన కోహ్లీ పేరు మార్మోగిపోతోంది.