గుడిలో ప్రసాదంగా...మటన్‌ బిర్యానీ..

12:00 - January 20, 2019

సాధారణంగా గుడిలో ప్రసాదం అంటే పులిహోర, పొంగలి, దద్దోజనం లాంటివి పెడుతుంటారు. అయితే ఆ గుడిలో మాత్రం ప్రసాదంగా మటన్‌ బిర్యానీ పెడుతారట. అదేంటీ అనుకుంటున్నారా? అయితే వివరాల్లోకి వెలితే...తమిళనాడులోని మదురై జిల్లా తిరుమంగళం సమీపం వడుకంపట్టి గ్రామంలోని మునీశ్వరుడి ఆలయంలో ఏటా జనవరి 25న జరిగే ఉత్సవాల్లో భక్తులకు వేడి వేడి మటన్‌ బిర్యానీ ప్రసాదంగా ఇస్తారు. 85 ఏళ్ల క్రితం ఎస్వీఎస్‌ సుబ్బానాయుడు మునియాండి (మునీశ్వరుడు) పేరుతో ప్రారంభించిన హోటల్‌కు లాభాలు రావడంతో ఆ స్వామికి రెండేళ్ల పాటు మటన్‌ బిర్యానీతో నైవేద్యం సమర్పించి భక్తులకు పంచారని, అప్పటి నుంచి గ్రామస్థులంతా కలిసి బిర్యానీ తయారు చేసి ప్రసాదంగా పంపిణీ చేయడం ఆనవాయితీగా మారిందట. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో మునియాండి మాంసాహార హోటళ్లు పుట్టుకొచ్చాయన్నారు. ఈ నేపథ్యంలో గతేడాది 2 వేల కేజీల బాస్మతి బియ్యం 200 మేకల మాంసంతో బిర్యానీని భక్తులందరికీ పంచిపెట్టినట్లు ఆలయ నిర్వాహక కమిటీ సభ్యుడు ఎన్‌.మునీశ్వరన్‌ తెలిపారు. ఇక ఈ నెల 25న వేకువజామున మునియాండి బిర్యానీ నైవేద్యం పెట్టి, అనంతరం ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులకు పంపిణీ చేస్తామన్నారు.