బిచ్చమెత్తుకొని మరీ మోదీని ఎదిరిస్తాం: మోదీకి వ్యతిరేకంగా 111 రైతుల పోటీ

20:21 - March 24, 2019

*ఏప్రిల్ 24న వారణాసి చేరుకో నున్న రైతులు 

*డిపాజిట్ డబ్బు కోసం వారణాసి వీధుల్లో భిక్షాటన

*ఏప్రిల్ 25న మోదీకి పోటీగా నామినేషన్లు

 

డిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద జరిగిన తమిళ రైతుల పోరాటం అందరికీ గుర్తుండే ఘటన ఎప్పటికీ మర్చిపోలేనిది. జాతీయ దక్షిణ భారత రైతు సంఘానికి చెందిన రైతులంతా కావేరీ జలాల వివాద పరిష్కారం, పంట రుణాల సమస్య, మద్దతుధర, ఆత్మహత్యకు పాల్పడిన రైతులను ఆదుకోవాలంటూ అప్పట్లో  ఆరుబయటే వంటావార్పూ చేసుకుంటూ తమ నిరసన తెలియజేశారు.  2017, 2018 సంవత్సరాల్లో దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద వీరు.. రెండు విడతల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నిరసనలో భాగంగా, తమ మూత్రాన్ని తామే తాగటం, ఎముకలు, కపాలాలూ ధరించి తిరగటం, పచ్చిగా ఎలుకల్ని తినటం, తమనుతాము చెప్పులతో కొట్టుకొవటం వంటి అత్యంత దయనీయమైన పద్దతులని ఆ రైతులు అనుసరించినా, తమిళ సినీ పరిశ్రమకూడా రైతులకు మద్దతుగా నిరసనలో పాల్గొన్నా పట్టించుకోలేదు ప్రభుత్వం.

అందుకే మరో కొత్త తరహా నిరసనకి తయారయ్యారు ఆ రైతులు. రైతుల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బీజేపీ ప్రభుత్వం తీరుకు నిరసనగా భారీ సంఖ్యలో రైతుల్ని మోదీపై పోటీకి దించాలని త్రిచికి చెందిన దక్షిణాది నదుల అనుసంధాన సంఘం తెలిపింది.  మోదీ పాలనలో దేశవ్యాప్తంగా రైతులు అసంతృప్తిగా ఉన్నారని వాదన. ఈ నేపథ్యంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మోదీపై పోటీ చేయడానికి 110 మంది తమిళ రైతులు సిద్ధం అవుతున్నారు.

మోదీ పోటీ చేయనున్న వారణాసి నియోజకవర్గంలో వీరు నామినేషన్ వేయనున్నారు. మోదీపై 110 మంది తమిళ రైతుల్ని వారణాసిలో పోటీకి దించుతున్నట్లు సంఘం అధ్యక్షుడు అయ్యాకన్ను ప్రకటించారు.   తాజాగా ప్రధాని మోదీ దేశంలో ఎక్కడ నుంచి పోటీ చేసినా ఆయనపై నామినేషన్‌ వేసి నిరసన తెలియజేయాలని నిర్ణయించినట్లు అయ్యాకన్ను ప్రకటించారు.తమిళనాడువ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి వందలాది మంది రైతులు ఏప్రిల్ 24న వారణాసి చేరుకుంటారు. ఎన్నికల డిపాజిట్ డబ్బు కోసం వారణాసి వీధుల్లో భిక్షాటన చేసి, ఏప్రిల్ 25న నామినేషన్లు వేస్తారు. ఇదే వ్యూహం తో తాము తమ నిరసన, రైతుల దుస్థితిని తెలియజేస్తామని చెబుతున్నారు.