అనుమానంతో భార్యను ముక్కలుగా చేసి....

11:34 - February 7, 2019

అనుమానంతో భార్యను హత్యచేసి.. ఆపై మృతదేహాన్ని ముక్కలుముక్కలుగా నరికి వేర్వేరు ప్రాంతాల్లో పారేశాడు. ఇలాంటి దారుణానికి ఒడికట్టింది తమిళ సినీ దర్శకుడు బాలకృష్ణన్‌. అయితే ముక్కలుగా చేసి ఎక్కడపడితే అక్కడ విసిరేసినప్పటికీ పోలీసులు మిస్టరీని చేదించి బుధవారం బాలకృష్ణన్‌ని అరెస్టు చేయడం జరిగింది. వివరాల్లోకి వెలితే... తూత్తుకుడికి చెందిన బాలకృష్ణన్‌, సంధ్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సినిమాలపై మోజుతో ఇద్దరూ చెన్నై వచ్చి స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు సంతానం. బాలకృష్ణన్‌ '  కాదల్‌ ఇలవశం '  అనే చిత్రం ద్వారా దర్శకుడిగా మారారు. దీంతో ఇంటికొస్తున్న ప్రముఖులు, పారిశ్రామికవేత్తల సాయంతో హీరోయిన్‌ కావాలనుకున్న సంధ్య వారితో చనువుగా ఉండేది. అయితే వారిలో కొందరితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో బాలకృష్ణన్‌ ఆగ్రహంతో ఆమెను కత్తితో చంపాడు. ఇంతటితో అయిపోయిందనుకున్నాడు బాలకృష్ణన్‌. అయితే స్థానిక పెరుంగుడి డంపింగ్‌ యార్డులో గతనెల 21 న మహిళ కాళ్లు, చేతులు లభించాయి. అవి ఎవరివో తెలుసుకునేందుకు పోలీసులు 15 రోజులుగా జరిపిన దర్యాప్తులో ఎట్టకేలకు మిస్టరీ వీడింది. మృతురాలి చేతిపై ఉన్న టాటూ ఆధారంగా ఆమెను చెన్నై జాఫర్‌ఖాన్‌పేటకు చెందిన సినీ సహాయనటి సంధ్యగా గుర్తించారు. దీంతో బాలకృష్ణన్‌ చేసిన హత్య బయటపడిందని పోలీసులు వివరించారు.