మరి నేను చేసిన నేరమేంటి? : ఎన్‌డీఏ పై నిప్పులు చెరిగిన విజయ్ మాల్యా

15:38 - March 26, 2019

 పరారీ ఆర్ధిక నేరగాడుగా లండన్ లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యా జెట్ ఎయిర్‌వేస్‌ విషయం లో మళ్ళీ ఒకసారి ట్విటర్ వేదికగా తన గోడు, అక్కసూ వెళ్ళబోసుకున్నాడు. తన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ విషయంలో నాడు బ్యాంకులు ఇదేవిధంగా వ్యవహరించి ఉంటే అది మూత పడేది కాదని, ఏడేళ్ల క్రితం "భారత దేశపు మంచి విమాన సంస్థ" మూతపడడానికి కారణం బ్యాంకులేనని ఆరోపించాడు. ప్రభుత్వ రంగ బ్యాంకులు డబుల్ స్టాండర్డ్స్ పాటిస్తున్నాయని విమర్శిస్తూనే జెట్‌ ఎయిర్‌వేస్‌ సంక్షోభానికి పరిష్కారం దిశగా అడుగులు పడుతున్న వైనంపై హర్షం వ్యక్తం చేశాడు.

దేశ అత్యుత్తమ వైమానిక సంస్థ, ఉద్యోగులు, వ్యాపారం నిర్దాక్షిణ్యంగా విఫలం అవుతోంటే ఎన్‌డీఏ ఆధ్వర్యంలోని  ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎందుకు స్పందించలేదని, సంక్షోభంలో ఉన్న కింగ్‌ఫిషర్‌ సంస్థను, సంస్థ ఉద్యోగులను కాపాడేందుకు 4వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టానని మాల్యా ప్రశ్నించాడు. "గతంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సంస్థను ఆదుకోవాలని లేఖలు రాస్తే ఎన్డీఏ నానా యాగీ చేసింది. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ ను ఆదుకోవడం నేరం అన్నట్లు చిత్రీకరించాయి. మరి ఇప్పుడు జెట్ ఎయిర్‌వేస్‌ను ఎన్డీఏ ప్రభుత్వం, బ్యాంకులు ఏ ప్రాతిపదికన ఆదుకున్నాయి..ఎన్డీఏ ప్రభుత్వంలో వచ్చిన మార్పులేమిటో తెలియడం లేదు, ప్రభుత్వ రంగ బ్యాంకులు జెట్ ఎయిర్‌వేస్‌ను ఆదుకుని ఉద్యోగాలు, కనెక్టివిటీ, కంపెనీని కాపాడేందుకు ముందుకు రావడం సంతోషకరం. కింగ్ ఫిషర్ విషయంలో కూడా నేను అప్పుడు కోరుకున్నది ఇదే." అని వరుస ట్వీట్లు పెడుతూపోయాడు. 


 ఇప్పటికైనా భారత బ్యాంకులు తాను చెల్లిస్తానన్న డబ్బు తీసుకుని జెట్ ఎయిర్‌వేస్‌ను కాపాడాలని ఆయన కోరారు. ‘‘నేను మరోసారి చెబుతున్నాను... ప్రభుత్వ రంగ బ్యాంకులు సహా ఇతర రుణదాతల అప్పు తీర్చేందుకు నేను కర్నాటక హైకోర్టు ముందు ద్రవ్య ఆస్తులు ఉంచాను. బ్యాంకులు నా డబ్బులు ఎందుకు తీసుకోవడం లేదు. జెట్ ఎయిర్‌వేస్‌ను కాపాడేందుకు ఈ సొమ్ము ఉపయోగపడుతుంది కదా?’’ అన్న మాల్యా తన  సొమ్మును తీసుకోవడం ద్వారా జెట్‌  ఎయిర్‌వేస్‌ని కాపాడాలని మాల్యా బ్యాంకులను కోరాడు. 
   
    జెట్ ఎయిర్‌వేస్‌ లాంటి సంక్షోభ పరిస్థితినే మాల్యా సొంతమైన కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ ఎదుర్కొంది. దివాళా వల్ల కింగ్ ఫిషర్ 2012లో కుప్పకూలింది.  దీంతో బ్యాంకులకు 9వేల కోట్ల మేర రుణాలను ఎగవేసి విదేశాలకు పరారైన లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యా ప్రస్తుతం లండన్‌లో కేసు విచారణను ఎదుర్కొంటున్నాడు. గతవారం ఫెరా (విదేశీఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్) ఉల్లంఘన కేసులో బెంగళూరులోని విజయ్ మాల్యా ఆస్తులను అటాచ్ మెంట్ చేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. దీనిపై తదుపరి వాదనలు జూలై 10వ తేదీన జరగనున్నాయి. కాగా జెట్‌ ఎయిర్‌వేస్‌ ఛైర్మన్ నరేష్ గోయల్ సోమవారం దిగివచ్చారు. ఆయన భార్య అనితాతోపాటు సంస్థ బోర్డును వీడుతున్నట్టు ప్రకటించారు. దీంతో బ్యాంకర్లు 1500 కోట్ల రూపాయల బెయిల్  అవుట్‌ ప్యాకేజీకి  అంగీకరించిన సంగతి తెలిసిందే.