సర్జికల్‌ స్ట్రైక్‌-2తో ప్రతీకారం తీర్చుకున్న భారత్‌

11:14 - February 26, 2019

ఇటీవల జరిగిన పుల్వామా దాడిలో 40మందికి పైగా సీఆర్‌పిఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రతీకారం తీర్చుకోవలని యావత్‌ భారత ప్రజలు ముక్తకంఠంతో నినాదాలు చేశారు. అయితే ఇదే నేపథ్యంలో భారత సైన్యం సర్జికల్‌ స్ట్రైక్‌ -2తో దానిని విజయవంతం చేసింది. వివరాల్లోకి వెలితే...పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని జైషే ఉగ్రవాదుల శిబిరాలే లక్ష్యంగా భారత వాయుసేన మంగళవారం తెల్లవారుజామున 3.30గంటలకు సుమారు వెయ్యి కిలోల పేలుడు పదార్థాలతో దాడులు చేసింది. 12  మిరాజ్‌-2000 జైట్‌ ఫైటర్స్‌తో చేపట్టిన సర్జికల్‌ స్ట్రైక్‌-2ను భారత వాయుసేన విజయవంతంగా పూర్తి చేసింది. అర్ధరాత్రి సమయంలో ఏం జరుగుతోందోనని ఉగ్రవాదులు మేల్కొనేలోపే మన పైలెట్లు పనికానిచ్చేశారు. పాక్ ఆర్మీ తేరుకునేలోపే భారత వాయుసేన టార్గెట్ పూర్తి చేసింది. భారత్ ప్రతీకార దాడిలో పీవోకేలో ఉన్న అతిపెద్ద జైషే ఉగ్ర శిబిరం పూర్తిగా ధ్వంసం అయిందని చెబుతున్నారు. అంతేకాకుండా బాలాకోట్, చకోటి, ముజఫరబాద్‌లోని 3 ఉగ్రశిబిరాలు కూడా నేలమట్టం అయ్యాయని, భారత్ జరిపిన ఈ సర్జికల్ స్ట్రైక్-2లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమయ్యారని అంచనా వేస్తున్నారు. ఈ దాడులను పాక్ కూడా ధృవీకరించింది. ఈ దాడుల తర్వాత పాక్-భారత్ సరిహద్దులో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. కార్గిల్ యుద్ధం తర్వాత ఈ తరహాలో వైమానికి దాడులు చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం.