ఐపీఎల్ లోకి మళ్ళీ వార్నర్: ఆరంభమే అదిరిపోయింది

17:58 - March 24, 2019

ఐపీఎల్‌లోకి సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ రీఎంట్రీ గ్రాండ్ గా మొదలయ్యింది. బాల్ టాంపరింగ్ ఆరోపణలతో ఏడాది పాటు ఐపీఎల్ కి దూరమైన వార్నర్  (85: 53 బంతుల్లో 9X4, 3X6) ఈరోజు మళ్లీ ఐపీఎల్‌లో మెరుపులు మెరిపిస్తూ మళ్ళీ పాత ఉత్సాహాన్ని తెచ్చాడు. ఓపెనర్గా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఈరోజు జరుగుతున్న తొలి మ్యాచ్‌లో అడుగుపెట్టిన వార్నర్ కేవలం 31 బంతుల్లోనే 8X4, 1X6 సాయంతో 50 పరుగుల మైలురాయిని అందుకున్నాడు.

ఐపీఎల్ ప్లేయర్ గా వార్నర్ కెరీర్లో ఇది 40వ అర్థ సెంచురీ. మ్యాచ్‌లో ఓపెనర్ జానీ బెయిర్‌స్టో (39: 35 బంతుల్లో 3X4, 1X6)తో కలిసి తొలి వికెట్‌కి 118 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన వార్నర్. సన్‌రైజర్స్‌కి మెరుపు ఆరంభాన్నిచ్చాడు. దీంతో మళ్ళీ సన్ రైజర్స్ అభిమానుల్లో ఆశలు నెలకొన్నాయి.  

అత్యధిక హాఫ్ సెంచరీలు బాదిన క్రికెటర్‌గా ఐపీఎల్ చరిత్రలోనే వార్నర్‌ ప్రస్తుతం అగ్రస్థానంలో ఉంటాడు. అతని తర్వాత ఈ రికార్డ్‌లో 38 హాఫ్ సెంచరీలతో కోహ్లీ రెండో స్థానంలో కొనసాగుతుండగా.. ఆ తర్వాత 36 అర్ధశతకాలతో రైనా, రోహిత్ మూడో స్థానంలో కొనసాగుతున్నారు.  సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి కెప్టెన్‌గా 2016లో టైటిల్‌ను అందించిన డేవిడ్ వార్నర్‌‌‌ ఈసారి మళ్ళీ కెప్టెన్ గానె అడుగుపెడతాడని అంతా అనుకున్నారు. కానీ బాల్ ట్యాంపరింగ్ వివాదం నేపథ్యంలో నిషేధం, విమర్శల వల్ల ఒత్తిడికి గురి అయ్యే అవకాశాలు ఉండటంతో అతనిపై కెప్టెన్సీ రూపంలో అదనపు భారం మోపకూడదని భావించిన సన్‌రైజర్స్ ఓపెనర్‌గా టోర్నీలో ఆడిస్తోంది.