ఆమె మరణించి ఏడాది: చెన్నైలోనే ప్రథమ వర్థంతి

23:35 - February 9, 2019
*అతిలోక సుందరి నిష్క్రమణానికి ఏడాది 
 
*ప్రథమ వర్థంతి ఫిబ్రవరి 14 న చెన్నైలో 
 
*ఫిబ్రవరి 24 2018 న లోకాన్ని వీడిన శ్రీదేవి 

 

 

మనిషి మరణం ఎప్పటికైనా ఒక విషాదమే అందులోనూ సెలబ్రిటీ మరణం వారి అభిమనులకు మరింత విషాదంగానే ఉంటుంది. తెలుగూ,తమిళ్, బాలీవుడ్ ఇలా అన్ని చోట్లా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణించిన ఒకనాటి అతిలోక సుందరి శ్రీదేవి మరణించి సంవత్సరం కావస్తోంది. గత ఏడాది ఫిబ్ర‌వరి 24న సినీనటి శ్రీదేవి మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే.  


ఆమె వర్థంతి సందర్భాన్ని ఆమెకు నచ్చిన చోటులోనే జరపాలని అనుకుంటున్నారట ఆమె కుటుంబసభ్యులు. ఎంతగా బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అయ్యి ముంబైలోనే స్తిరపడ్డా  శ్రీదేవికి చెన్నై నగరం అన్నా, అక్కడ ఉన్న త‌న‌ ఇల్లు అన్నా ఎక్కువ ప్రేమ అట‌. అందుకే ఆమె వర్థంతిని అక్కడే జరపాలని వాళ్లు నిర్ణయించుకున్నారని సమాచారం.

ఆమె చనిపోయింది ఫిబ్రవరి 24 అయినా..హిందూ తిథుల ప్రకారం ప్రకారం మాత్రం ఈ నెల 14నే వస్తోంది. కాబట్టి అదే రోజున చెన్నైలో శ్రీదేవి ఇంటిలో వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కుమార్తెలు జాన్వీ, ఖుషితో పాటు బోనీ కపూర్‌, ఆయన సోదరుడు అనిల్‌ కపూర్‌ సతీమణి సునీత ఇంకా పలువురు సినీ ప్రముఖులు కూడా పాల్గొన‌నున్నార‌ని చెబుతున్నారు. శ్రీదేవి న‌టించిన చివ‌రి చిత్రం జీరో కాగా, ఈ మూవీ ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.