రజినీకాంత్ కూతురి వివాహం: రెండోసారి పెళ్ళికూతురు అవనున్న సౌందర్య

12:04 - January 23, 2019

సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంట మరోసారి పెళ్ళి బాజాలు మోగనున్నాయి.  రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ వివాహం ఫిబ్రవరి 11న జరగనుంది. ప్రముఖ వ్యాపార వేత్త, నటుడు విశాగన్ వనంగమూడిని సౌందర్య వివాహం చేసుకోనున్నారు. ఇప్పటికే రజనీ  కుంటుంబ సభ్యులు పెళ్లి పనుల్లో బిజీ అయ్యారు. సౌందర్య, విశాగన్‌ ల నిశ్చితార్థం గత ఏడాది కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది.

వివాహం మాత్రం చెన్నైలోని ఓ హోటల్‌లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఫిబ్రవరి 9 నుంచి మూడు రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహించనున్నారు. లతా రజనీకాంత్ ఇచ్చే పార్టీతో పెళ్లి వేడుకలు ప్రారంభకానున్నాయి. సౌందర్య అక్క, హీరో ధనుష్‌ భార్య ఐశ్వర్య స్వయంగా ప్రముఖులకు వివాహ ఆహ్వాన పత్రికలను అందజేస్తున్నారు. 


సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ కుమార్తె సౌంద‌ర్య 2010లో పారిశ్రామికవేత్త అశ్విన్ కుమార్‌ని వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. కొన్నాళ్ళ త‌ర్వాత‌ వారి ఇద్దరి మధ్యా అభిప్రాయభేదాలు తలెత్తాయి. సర్దుకుపోవడానికి ప్రయత్నించారు. కానీ కుదరలేదు. చివరికి ఆ ఇద్దరూ విడిపోయేందుకే నిర్ణయించుకున్నారు. 2017లో ఈ జంట విడాకులు తీసుకున్నారు.

వీరి కుమారుడు వేద్‌ కృష్ణ సౌంద‌ర్య ద‌గ్గ‌రే ఉంటున్నాడు. అయితే సౌంద‌ర్య మ‌రోసారి పెళ్లి చేసుకోనుంద‌నే వార్త కోలీవుడ్‌లో దావానంలా పాకింది. నటుడు, వాణిజ్యవేత్త విశ్వగణ్ వనంగమూడిని సౌంద‌ర్య‌ పెళ్లి చేసుకోనుందట‌. విశ్వగణ్‌కి కూడా ఇది రెండో వివాహమే అట. మొత్తానికి మళ్ళీ ఇలా సౌదర్య వివాహం రజినీ అభిమానుల్లో కూడా ఆనందాన్ని నింపుతోంది.