చంద్రబాబు సభలో చెప్పులు పడ్డాయి: వేదిక ముందే బాహాబాహి

22:58 - March 2, 2019

*కాంగ్రెస్ సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి  టీడీపీలో చేరిక 

*చెప్పు విసిరిన గుర్తు తెలియని వ్యక్తీ 

*డోన్ సీటు కోసమే ఘర్షణ, బయట పడ్డ విభేదాలు 

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి టీడీపీలో చేరారు. మార్చి 2 సాయంత్రం కర్నూలు జిల్లా కోడుమూరులో టీడీపీ నిర్వహించిన బహిరంగ సభలో కోట్ల కుటుంబం టీడీపీ తీర్థం పుచ్చుకుంది. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డితో పాటు కోట్ల సూజాతమ్మ, కోట్ల రాఘవేంద్ర రెడ్డికి టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కోట్ల, కేఈ కృష్ణమూర్తి కుటుంబసభ్యులు ఒకే వేదికపైకి రావడం గమనార్హం. 


అయితే ఇదేసందర్భంలో  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాక్షిగా కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి, కేఈ కృష్ణమూర్తి వర్గాల మధ్య విభేదాలు బయటపడ్డాయి. కర్నూలు జిల్లా కోడుమూరు నిర్వహించిన సభలో సూర్యప్రకాశ్‌ రెడ్డి, ఆయన భార్య కోట్ల సూజాతమ్మ టీడీపీలో చేరారు. వీరిని చంద్రబాబు స్వయంగా పార్టీలోకి ఆహ్వానించారు. డోన్‌ అసెంబ్లీ సీటును సుజాతమ్మకు కేటాయించాలంటూ ఈ సందర్భంగా కోట్ల వర్గీయులు నినాదాలు చేశారు. సభలో గందరగోళం రేగడంతో గుర్తు తెలియని వ్యక్తులు చెప్పులు విసిరారు. ఒక చెప్పు వేదిక ముందు పడింది. అక్కడున్న ఓవ్యక్తి కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. చంద్రబాబునాయుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గురించి మాట్లాడుతున్న ఆడియో కూడా ఈ వీడియోలో వినిపిస్తోంది. సెక్యురిటీ వెంటనే స్పందించి వేదిక ముందు పడిన చెప్పును అక్కడి నుంచి తొలగించారు.  


కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు. కాంగ్రెస్ హయాంలో ఆయన కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌ను ఎంతో మంది నేతలు వీడినా.. ఆయన పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. గత కొంత కాలంగా ఆయన టీడీపీలో చేరబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా కోట్ల కుటుంబం టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో ఆ వార్తలకు ముగింపు పలికినట్లైంది.

కానీ ఇప్పుడు జరిగిన ఈ  తాజా సంఘటంజతో చంద్రబాబు ఎంత ప్రయత్నించినప్పటికీ కోట్ల, కేఈ కుటుంబాల మధ్య సయోధ్య కుదరలేదని తాజా సంఘటన రుజువు చేస్తోంది. డోన్‌ సీటును సుజాతమ్మకు కేటాయిస్తే కేఈ ప్రతాప్‌కు ఆశాభంగం తప్పదు. ఈ నేపథ్యంలో నిండు సభలో ముఖ్యమంత్రి వేదికపై ఉండగా దుండగులు చెప్పులు విసరడం చర్చనీయాంశంగా మారింది. కోట్ల కుటుంబం టీడీపీ చేరిన మొదటిరోజే ఈ ఘటన చోటుచేసుకోవడంతో మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కోడుమూరు టీడీపీ సమావేశానికి ఎంపీ బుట్టా రేణుక హాజరుకాకపోవడం అనుమానాలు రేకిస్తోంది.