పీవీ సింధు 50 కోట్ల ఒప్పందం : చైనా స్పోర్ట్స్ బ్రాండ్ ఆఫర్ ని అంగీకరించిన సింధు

21:16 - February 8, 2019
*పీవీ సింధుకి చైనాకంపెనీ 50 కోట్ల ఆఫర్ 

*విరాట్ కోహ్లీ చేరువలో పెద్ద ఒప్పందం 

*వరల్డ్ బ్యాడ్మింటన్‌లోనే అతిపెద్ద డీల్ ఇదే  

 

 

నిజానికి పీవీ సింధు స్పోర్ట్ పర్సన్ గా కంటే ఆమె లాక్మే ఫ్యాషన్ వీక్ లో ధరించిన గౌన్ వివాదంతోనే ఈ వారమంతా వార్తల్లో నిలిచింది. అయితే ఇక్కడ వివాదాన్ని అసలు సింధు పట్టించుకున్నట్టు కూడా లేదు. ఆమె తన కెరీర్ మీద మాత్రమే తన దృష్టి నిలిపింది. రియో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచిన తర్వాత సింధు స్టార్‌డమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఒలింపిక్స్‌లో పతకం గెలుచుకున్న తొలి మహిళగా రికార్డులకెక్కిన సింధు గతేడాది ఫోర్బ్స్ జాబితాలో అత్యంత ఎక్కువ మొత్తం అందుకుంటున్న మహిళా క్రీడాకారుల జాబితాలో ఏడో స్థానంలో నిలిచింది.

  ఇప్పుడు తాజాగా చైనీస్ స్పోర్ట్స్ బ్రాండ్ లీ నింగ్‌తో రూ.50 కోట్ల మేర ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ ప్రకారం తెలుగు బ్యాడ్మింటన్ ప్లేయర్ చైనా కంపెనీ నాలుగేళ్లపాటు స్పాన్సర్ చేయనుంది. గత నెలలో ఇదే సంస్థ కిదాంబి శ్రీకాంత్‌తో నాలుగేళ్లపాటు ఒప్పందం చేసుకుంది. ఇందుకోసం శ్రీకాంత్‌కు రూ.35 కోట్లు ఆఫర్ చేసింది. పారుపల్లి కశ్యప్‌తోనూ లీ నింగ్ రూ.8 కోట్లతో రెండేళ్లపాటు ఒప్పందం చేసుకుంది. స్పాన్సర్‌షిప్‌గా రూ.40 కోట్లు పొందనున్న సింధు. క్రీడా సామాగ్రి రూపంలో మిగతా రూ.పది కోట్లను పొందనుంది.  

2017లో విరాట్‌ కోహ్లి ఎనిమిదేళ్ల కాలానికి ‘పూమా’ తో రూ.100 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.  ఈ ఒప్పందం ప్రకారం సంవత్సరానికి రూ. 12.5 కోట్లను పూమా కంపెనీ విరాట్‌కు చెల్లిస్తుంది. అయితే ఒక  క్రీడాకారిణి గా సింధూ ఇంత పెద్ద మొత్తాన్ని అందుకోవటం పెద్ద అవకాశమే అనుకోవచ్చు. సింధుతో తాజాగా కుదుర్చుకున్న డీల్ వరల్డ్ బ్యాడ్మింటన్‌లోనే అతి పెద్దదని భారత్‌లో లీ నింగ్ భాగస్వామి సన్‌లైట్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ మహేందర్ కపూర్ పేర్కొన్నారు. 


నిజానికి లీ నింగ్ సంస్థ సింధుతో ఒప్పందం కుదుర్చుకోవడం ఇది రెండోసారి. 2014-15లో ఏడాదికి రూ.1.25 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, 2016లో సింధు యోనెక్స్‌తో ఏడాదికి రూ.3.5 కోట్లతో మూడేళ్ల కాలానికి డీల్ కుదుర్చుకుంది. ఇప్పుడు మళ్ళీ  లీ నింగ్ ఇచ్చిన ఆఫర్ తో సింధు మరో మెట్టు పైకెక్కినట్టే.