అతనికోసం ఎదురు చూపు - శివసాగర్ (కేజి సత్యమూర్తి) యాదిలో

01:02 - April 17, 2019

ఓ అరగంట క్రితం వరకూ నా అరచేతుల్లో సూర్యుడున్నాడు అతని పేరు శివసాగర్. అవునవును అతడి పేరు శివసాగర్. రాత్రంతా ఆ పిడికిట్లో పాడాను, ఆ ఎర్రెర్రని గుండెను ముద్దు పెట్టుకున్నాను. చూసాను కదూ... లెనిన్నిలెనిన్నిలెనిన్ని ఆయన లెనిన్ని ... నేననుకున్న లెనిన్ని కాదు, నేనూహించిన లెనిన్నీ కాదు .. జారు ప్రభుత్వంపై అరోరా ఫిరంగి ధ్వనుల ఉమ్మేసిన లెనిన్ని చూసాను. క్రెమ్లిన్ తలకు ఎర్రపాగా చుట్టిన లెనిన్ రెండు చేతులనీ చూసాను. ఆకాశం అరుగుమీద కూర్చోబెట్టాడు నన్ను నలత నక్షత్రాల కథలు చెప్పాడు. ఇప్పపువ్వులో నిప్పురవ్వలను పుట్టించిన సత్యమన్న చేత నేనెలాఉన్నావని అడిగిచ్చాడు నా శివసాగర్.. ఏం చెప్పమంటావ్ ఇంకా.. ఎంత చెప్పమంటావ్ ఇంకా... బానిసత్వం జైళ్లనుండి పరారీ అయిన వాళ్లారా రండి ఆయన కుటీరానికి, మీ కాళ్ళకూ, చేతులకూ, చెప్పటానికి సిగ్గుగా ఉంది మీ గుండెలకూ కొట్టిన మేకులనూ ఊడదీస్తాడు నా నెలబాలుడు.

అబద్దం అస్సలే చెప్పడు మా ప్రయాణం పదివేల మైళ్ళని ముందే చెప్తాడు. ఉద్యమం నెలబాలుడనీ, అజానుబాహుడనీ, కాబోయే అనంత బలసంపన్నుడనీ చెప్తాడు. నీ ముందు అద్దముండాలే కానీ చూసుకో నీ కళ్ళప్పుడు సింహాన్నీ, తోడేలునీ తరుముతున్న జింకపిల్ల కళ్ళలా ఉంటాయి. ఎంత ప్రేమనుకున్నావ్ మనమంటే అడవి జింకపాల పాయసం పెట్టాడు. అడవిలో దీపాన్ని అలాగే వెలిగించి ఉంచాడు.(రాత్రి 3:08 అయింది కొద్దిగా నిద్రముంచుకొస్తుంది) ఉరికంబం మీద నిలిచి ఊహాగానం చేస్తా అన్నాడు. ఊహల ఉయ్యాలలో మరో జగతి ఊసులాడుతుందన్నాడు. మనిషెవడన్నా నిద్రపోతాడా ఇక... మా బివివి ప్రసాద్ అన్నట్టు ఒక పగలంతా నిద్రపోయి అయినా సరే ఈ రాత్రి మేల్కొనాలి. సరిగ్గా ఏడాదికి ఓ రోజు ముందు పోయిన అరుణ్ సాగర్ కూడా ఓసారి మేల్ కొల్పాడు. ఇక శివసాగరుడు వికసించిన వాడి నెత్తుటి కొనేటికి వెళ్ళాను. చెరమంజురాజ్ ఒళ్ళు విరుచుకుని ఆయుధం చేతబట్టటం చూసాను. ముందు రోజే మరణించిన వాళ్ళమ్మ ఆశీర్వాదాన్ని విన్నాను. ఇక లాంగ్మార్చ్ లాంగ్ మార్చ్, లాంగ్ మార్చ్... కారడువులే కాలిబాట లాంగ్ మార్చ్, లాంగ్ మార్చ్, లాంగ్ మార్చ్ ఎర్రసేన బెదిరిపోదు...

                                                               

విశాల విశ్వ క్షేత్రంలో తెగినతలలు రగలటం చూసాను, నేల ఒడిలో రాలి తార నవ్వటం చూసాను. ఆదిలాబాద్ రైతాంగ గెరిల్లా వీరుల్ని చూసాను. కృష్ణగౌడ్, భూమయ్యలను హగ్ చేసుకున్నాను. నీకింత దైర్యమెక్కడదనడిగాను""తమ్ముడా... నరికిన నా శిరస్సును ప్రజలు మళ్ళీ నాకిస్తారు... పెరికిన కనుగుడ్లను కాలం కన్నులగా పొదుగుతారూ"" అన్నాడు. ఈ రాత్రిని మర్చిపోకూడదని మరోసారనిపించింది. నెత్తురొలకు పాటలనే పాడమన్న కోయిల అయనకే కనపడింది. అతడు దైర్యవంతుడు మరి.

నెహ్రూ బ్రతికుంటే నక్సలైట్ అయ్యేవాడని శ్రీ శ్రీ అన్నాడని నాకు తెలియదు. ఇప్పుడనిపిస్తుంది దొంగలంజాకొడుకులసలే మొసలే అని ఆయాన్ని, ఆయనే అనుకున్నాడేమో అని.

గోండ్లూ, పరధాన్లూ, చుక్కబొట్లూ నీ చేత 'తోటరామున్ని' రాయించారు కదూ.. వాళ్ళనొక్కసారైనా చూడాలి బాస్.. ప్రియమైన సాగర్ నాకింకోటి అనిపించింది చెప్పనా.. తూటాలూ, తుపాకులూ, రైఫిళ్ళూ, మాయముఖపు ఇందిరమ్మ నవ్వూ, ఆవుముఖపు ఈ తుగ్లక్ గాడి కొవ్వూ, బ్లా బ్లా బ్లా బ్లా ఏవీ ఆపలేవు సూర్యుణ్ణి

ఆకాశంలో నువ్వో సగానివాని చెప్పాడు. ఆనంతకోటి నక్షత్రాల్లో మరో సగానివనీ చెప్పాడు. పోరాటమే మనఊరన్నాడు. ఎందుకోమరి ఓ సారి ఏడిపించాడు. ఇద్దో ఇప్పుడే హోచ్ మిన్ వచ్చాడు. పగలంతా ఏటి ఒడ్డున, రాత్రి కొండగుహలో నివాసమట, జొన్నజావా, వెదురు కొమ్ములే ఆహారమంట, సోవియట్ పార్టీ చరిత్రను అనువాదం చేస్తా అన్నాడు. ఆహా.. విప్లవకారుని జీవితం ఎంతటి విలాస భరితం

మళ్ళీ సాగరొచ్చాడు
ఉరికంబం భయంతో వొణుకుతుందన్నాడు. గుర్తొచ్చినప్పుడల్లా భార్య మణెమ్మను కూడా కలలోనే చూసుకున్నాడు. నువ్వు నా దేశపు లెనిన్ గాడివి శివసాగర్. కాలాన్ని కౌగలించుకుని మరో ప్రపంచాన్ని వాగ్దానం చేసావ్ మరి నువ్వు.. విషాదాన్ని ఓడించి, జీవితాన్ని ఆహ్వానించి మృత్యువుని ముద్దాడావు. లెనిన్ అమ్మ ప్రేమను కవిత్వం చేసి ఇదిగో నాకిక్కడ గుండెల్లో పూసావ్. గులాబ్ బాయ్ మీద ఒట్టేసి కొన్ని నిజాలను చెప్పావ్. గురజాడకు నీ స్టైల్ లో నాలుగైదుఆరేడు ఎపిక్ పంచులేశావ్. శ్రీ శ్రీ దుమ్ము దులుపొదిలిపెట్టావ్. అమ్మకు విప్లవాభివందనాలు చెప్పావ్.
ఒక్కజీవితంలో అనేక జైళ్లను చూసిన నెల్సన్ ను కొత్తగాకొత్తగా కొత్తకొత్తగా చూపించావ్. మునుగుతున్న పడవలో హాయిగా నిద్రపోతూ వల విసిరి కలల చేపలు పెట్టుకున్నావు. సూర్యుణ్ణి సూర్యోదయాన్నీ ప్రేమించావ్.

వెళ్ళిపోయావ్ ముసలోడా.....
ఒక్క సింగిల్ టీ సమయం నీతో మాట్లాడాలనుందిరా
ఒకే అగ్గిపుళ్ళతో చెరో సిగరెట్ వెలిగించుకునే వాళ్ళం కదా ......... నీకు వేవేల హగ్స్ 

ఈ పుస్తకం చదవమని నేను దైర్యంలేని వారికి చెప్పను. దైర్యవంతులకు చెప్పాల్సిన అవసరం లేదు..... 

                                                                                                                                                వ్యాస కర్త: సిద్దార్థ కట్టా