పార్లమెంట్‌ పరిదిలోని బ్యాంక్‌ ఖాతా నుండి రూ.20 లక్షలు మాయం...

15:23 - February 13, 2019

సాంకేతికత పెరిగిన వేళ.. ఆచితూచి అడుగులు వేయాల్సిందే. మనం జాగ్రత్తగా ఉన్నప్పటికీ.. మన మీద కన్ను పడినోడు మహా ముదురైతే మనకు ఇక్కట్లు తప్పవు. తాజాగా ఇలాంటి చేదు అనుభవమే కర్ణాటకకు చెందిన మహిళా ఎంపీకి ఎదురైంది. ఆమె బ్యాంక్ ఖాతాను హ్యాక్ చేసిన గుర్తు తెలియని దుండగలు.. ఆమె అకౌంట్లో ఉన్న రూ.20లక్షల్ని మాయం చేసిన వైనం సంచలనంగా మారింది. ఇంతకీ ఆ మహిళా ఎంపీ ఎవరో కాదు.. మంగళూరు బీజేపీ ఎంపీ శోభా కర్నద్లాజే. ఆమెకు ఎస్ బీఐలో బ్యాంక్ ఖాతా ఉంది. తాజాగా ఆమె ఖాతాను ఎవరో హ్యాక్ చేశారు. రూ.20లక్షల మొత్తాన్ని తరలించేశారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన ఆమె..తాజాగా ఢిల్లీలోని  పార్లమెంటు భవన్ మార్గంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రతి ఎంపీకి పార్లమెంటు భవన్ లోని ఎస్ బీఐలో ఖాతా తెరుస్తారు. పార్లమెంటు పరిధిలోని బ్యాంకు ఖాతానే హ్యాక్ చేయటం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇంతకీ.. ఎంపీగారి ఖాతా హ్యాక్ కావటానికి కారణాలు ఏమిటన్నది బయటకు రాలేదు. ఆమె నిర్లక్ష్యమా?  బ్యాంక్ సిబ్బంది తప్పా? అన్నది తేల్లేదు.