గౌతం గంభీర్ ట్వీట్ పై స్పందించిన పాక్ క్రికెటర్ అఫ్రీది

00:45 - February 18, 2019

*పుల్వామా అటాక్ ట్వీట్ మీద స్పందించిన అఫ్రిది 

*గౌతం కి ఏమైంది? ప్రశ్నించిన పాక్ మాజీ క్రికెటర్ 

*ఇండో-పాక్ యుద్ధం పై మాజీ ఆటగాళ్ళ యుద్ధం 

 

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు నేలకొరిగిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడి తర్వాత దేశం మొత్తం ఏకమైంది. పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పాల్సిందేనని జాతి యావత్తు పట్టుబడుతోంది. ఇక సోషల్ మీదియా అయితే ఈ తరహా "ప్రతీకార" వాంచతో రగిలిపోతోంది. దీంతో భారత్-పాక్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో సరిహద్దు గ్రామాలు భయంతో వణికి పోతున్నాయి.

 తాజాగా మాజీ క్రికెటర్, ఓపెనర్ గౌతమ్ గంభీర్ కూడా పుల్వామా అటాక్‌పై స్పందించాడు. సోషల్ మీడియా వేదికగా ప్రతి విషయంపై స్పందించే ఈ మాజీ ఢిల్లీ బ్యాట్స్‌మెన్.... పాకిస్థాన్‌తో, వేర్పాటు వాదులతో చర్చించాల్సిందేనని, కాకపోతే అది యుద్ధ రంగం కావాలని ఘాటుగా ట్వీట్ చేశాడు. ఇప్పటి వరకు జరిగింది చాలని, ఇక యుద్ధంతోనే బుద్ధి చెప్పాలని అన్నాడు.‘అవును, వేర్పాటువాదులతో మాట్లాడాలి. అవును, పాకిస్థాన్‌తో చర్చించాలి. కానీ ఇప్పుడు టేబుల్ చుట్టూ కూర్చొని మాట్లాడటం కాదు. యుద్ధ భూమిలోకి దిగి సమాధానం చెప్పే సమయం వచ్చింది. జరిగింది చాలు. శ్రీనగర్-జమ్మూ హైవేలో జరిగిన దాడిలో 18 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు (ఆసమయానికి తెలిసిన లెక్కలొ 18 మందే) చనిపోయారు’ అంటూ ట్వీట్ చేసాడు. 
 
గంభీర్‌ మాదిరిగానే పాక్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. అఫ్రిదీ, గంభీర్ తరచుగా ఒకరి ట్వీట్లపై మరొకరు స్పందిస్తూ ఉంటారు. తాజాగా పుల్వామా ఘటనపై గంభీర్ చేసిన ట్వీట్‌పై స్పందించాల్సిందిగా అఫ్రిదిని విలేకరులు కోరగా.. ‘అతడికేమైంది?’ (క్యా హో గయా ఉస్కో?) అని ప్రశ్నించాడు. అంతకుమించి ఈ విషయం గురించి మాట్లాడకపోవడం గమనార్హం.