రానున్న కొన్నేళ్లల్లో చీకటిలో కూడా చూడొచ్చట!

12:51 - March 4, 2019

ఉన్నట్లుండి కరెంటు పోతే అప్పటివరకూ పరిచయమున్న పరిసరాలు కాస్తా అపరిచితంగా మారిపోవటమే కాదు. ఎక్కడ ఏం ఉందో అర్థం కాక తెగ ఇబ్బంది పడిపోతాం. అయితే రానున్న కొన్నేళ్లల్లో ఇలాంటి ఇబ్బంది లేకుండా చీకటిలో కూడా చూసే వీలుంటుందట! అదెలాగో వివరాల్లోకి వెలితే... చైనా సైన్స్ అండ్ టెక్నాలజీ వర్సిటీతో పాటు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ మెడికల్ స్కూల్ కు చెందిన శాస్త్రవేత్తలు సరికొత్త విజయాన్ని సాధించారు. దీని ప్రకారం రానున్న కొన్నేళ్లలో చీకటిలోనూ మనుషులు చూసే వీలు కలగనుంది. ఇంతకీ వీరి పరిశోధనలు ఎంతవరకూ వచ్చాయంటే.. తాము అభివృద్ధి చేసిన నానో కణాల్ని ఎలుక కళ్లల్లోకి చొప్పించి.. చీకట్లోనూ అవి చూసేలా చేసినట్లుగా చెబుతున్నారు. ఈ ప్రయోగం చేసిన ఎలుకల కళ్లు ఎలాంటి దుష్పరిణామాన్ని ఎదుర్కోలేదట. పరారుణ కిరణాలు చుట్టూ ఉన్నప్పటికీ వాటిని చూసే శక్తి కళ్లకు ఉండదు. వేవ్ లెంత్ చాలా ఎక్కువగా ఉండటంతో ఆ కిరణాలను రెటీనాలోని కాంతి గ్రాహకాలు తమలో ఇముడ్చుకోలేవు. దీంతో చీకట్లో చూడలేని పరిస్థితి. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రత్యేకమైన నానో కణాల్ని అభివృద్ధి చేశారు. వాటిని ఎలుకల కళ్లల్లోకి ప్రత్యేకమైన సూదిమందు ద్వారా ఎక్కించారు. దాంతో ఎలుకల నేత్ర పటలాన్ని పరారుణ కాంతి తాకినప్పుడు.. నానో కణాలు గ్రహించి వాటిని తక్కువ తరంగ దైర్ఘ్యం ఉన్న కాంతిగా మార్చాయి. కాంతి గ్రాహకాలు సదరు కాంతిని తమలో ఇముడ్చుకొని మెదడుకు సంకేతాలు పంపాయి. దీంతో.. సాధారణ కాంతి తరహాలోనూ పరారుణ కిరణాలను ఎలుకలు చూడగలిగినట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు.