మా అమ్మనూ, చెల్లినీ చంపుతామన్నారు: ఆయేషా మీరా హత్య కేసులో సత్యం బాబు సంచలన వ్యాఖ్యలు 

04:21 - January 19, 2019

ఉమ్మడి  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో  కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలోని శ్రీదుర్గ లేడీస్ హాస్టల్‌లో 2007 డిసెంబర్ 27 న బి ఫార్మసీ విద్యార్ధిని ఆయేషా మీరా హత్యకేసు అప్పట్లో పెను సంచలనమైంది. ఈ కేసులో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడి కుటుంబంపై ఆరోపణలు వచ్చాయి. రష్ట్ర వ్యాప్తంగా అప్పటి ప్రభుత్వ తీరుపై నిరసనలు వచ్చినా ఈ కేసును విచారించిన పోలీసులు. సత్యంబాబును అదుపులోకి తీసుకున్నారు. అతనే ప్రధాన నిందితుడని చెప్పారు. కాగా న్యాయవిచారణా అనంతరం 31 మార్చి 2017న హైదరాబాదు హై కోర్టు సత్యం బాబును నిర్దోషిగా ప్రకటించింది. అలా ఆ కేసులో పోలీసుల తీరుపై కూదా అనుమానాలు రేకెత్తాయి. మొత్తానికి ఆయేశా హత్యకేసు ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. 

అయితే ఈ కేసును మళ్ళీ తిరగ దోడుతూ ఈసారి సీబీఐ తన విచారణను ముమ్మరం చేసింది. ఈ కేసులో కోనేరు రంగారావు మనవడు కోనేరు సతీష్‌ను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. సతీష్‌తో పాటు అతని మిత్రులను కూడా అధికారులు ప్రశ్నిస్తున్నారు. గతంలో సీఐడీ సతీష్‌కు క్లీన్ చిట్ ఇచ్చింది. ఆయేషా హత్య కేసులో మృతురాలి కుటుంబ సభ్యులు సతీష్ పైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కోనేరు సతీష్‌ను సీబీఐ అధికారులు విచారించడం కీలక పరిణామం అని చెప్పవచ్చు.
కోనేరు సతీష్‌ను సీబీఐ అధికారులు ఇంటి వద్దే ప్రశ్నిస్తున్నారు. ఆయేషా హత్య కేసులో తొలుత ఆరోపణలు ఎదుర్కొన్నది సతీష్. ఆయేషా మీరా చనిపోయిన హాస్టల్ వార్డెన్‌కు, కోనేరు సతీష్‌కు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని, తరచూ అతను హాస్టల్ వద్దకు వచ్చేవారని, తన స్నేహితులతో కూడా కలిసి వచ్చి హాస్టల్ కింది గదిలో మద్యం తాగి గొడవ చేసేవాడనే ఆరోపణలు కూడా ఉన్నాయని అంటున్నారు. అయితే అప్పట్లో మాత్రం ఇదే ఇదే సతీష్ నిర్దోషి అనీ, ఈ కేసుతో అతనికి ఏ సంబందమూ లేదంటూ క్లీన్ చ్ఘిట్ ఇవ్వటం గమనార్హం. 
  
అయితే ఇదే కేసులో కొన్నాళ్ళు దోషిగా ఆరోపించబడి జైలు షిక్షకూడా అనుభవించిన సత్యం బాబు ఇప్పుడు సంచలన విషయాలు చెప్పాడు. తన తల్లిని, చెల్లిని చంపుతామని పోలీసులు బెదిరించడంతోనే నర్సింగ్‌ విద్యార్థిని అయేషా మీరా(19) హత్య కేసులో తాను నేరం ఒప్పుకోవాల్సి వచ్చిందని సత్యంబాబు సంచలన వ్యాఖ్యలు చేశాడు. శుక్రవారం ఈ కేసు విచారణలో భాగంగా సీబీఐ ముందు హాజరైన సత్యంబాబు అనంతరం మీడియాతో మాట్లాడాడు. తాను నేరం అంగీకరించకపోతే ఎన్‌కౌంటర్‌ చేస్తానని పోలీసులు బెదిరించారని తెలిపాడు. నిర్భయ కేసులో ఏ విధంగా న్యాయం జరిగిందో అదే విధంగా ఆయేషా హత్య కేసులో కూడా న్యాయం జరగాలని, దీనికోసం సీబీఐ అధికారులకు పూర్తిగా సహకరిస్తానని చెప్పాడు. ఈ రోజు విచారణలో సీబీఐ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చానని పేర్కొన్నాడు. నిజానికి ఈ ఘటన జరిగినప్పుడు కోనేరు సతీష్ తాత కోనేరు రంగారావు వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు, అందువల్లనే సతీష్‌ను కేసు నుంచి తప్పించేందుకు సాక్ష్యం లేకుండా చేశారనే ఆరోపణలు ఉన్నాయి.