సానియాపై నిప్పులు కక్కుతున్న నేటిజన్లు....

16:16 - February 15, 2019

భార‌త టెన్నిస్ స్టార్‌, పాకిస్థాన్‌ క్రికెట‌ర్ షోయెబ్ మాలిక్ భార్య సానియా మీర్జాపై నెటిజ‌న్లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా తీసుకున్న‌ త‌న ఫోటోను సానియా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో '  పుల్వామా ఉగ్ర‌దాడి గురించి స్పందించ‌కుండా ఇలా ఫోటోలు పోస్ట్ చేస్తావా?'  అంటూ ప‌లువురు నెటిజ‌న్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా సానియా దేశ‌భ‌క్తిని ప్ర‌శ్నిస్తూ కామెంట్లు చేస్తున్నారు.  ' నీ ఫోటో చూసే ఆస‌క్తి మాకు లేదు. అంత పెద్ద దాడి జ‌రిగితే దాని గురించి క‌నీసం స్పందించ‌కుండా ఇలా ఫోటోలు అప్‌లోడ్ చేస్తావా'  .... నువ్వు భార‌తీయురాలివేనా? దేశ ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌పై జ‌రిగిన దాడిని ప‌ట్టించుకోవా, '  ఆమె పాకిస్థాన్‌కు చెందిన మ‌హిళ‌. ఈ దాడి గురించి స్పందించ‌డానికి ఆమె ఇష్ట‌ప‌డదు'  అంటూ చాలా మంది నెటిజ‌న్లు ఆమెపై  దాడికి దిగుతున్నారు. ఈ పరిస్థితి తీవ్రత ఎక్కువ కావడంతో ట్విట‌ర్ ద్వారా సానియా పుల్వామా దాడిని ఖండించింది. ' పుల్వామాలో సీఆర్పీఎఫ్ జ‌వాన్ల‌పై జరిగిన దాడి నాకు ఎంతో బాధ‌ను క‌లిగించింది. ఆ జ‌వాన్ల కుటుంబాల‌కు నా ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేస్తున్నా. ఈ ప్రపంచంలో ఉగ్ర‌వాదానికి చోటు ఉండ‌కూడ‌దు. శాంతి కోసం ప్రార్థించండి' అని సానియా ట్వీట్ చేసింది.