ఏప్రిల్‌ చివరినాటికి శాంసంగ్‌ ఫోల్డబుల్‌ ఫోన్‌...

15:50 - March 30, 2019

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల దిగ్గజం శాంసంగ్‌ త్వరలోనే భారత్‌లో ఫోల్డబుల్‌ (మడతపెట్టే) స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తేనుంది. శాంసంగ్‌ ఫోల్డబుల్‌ ఫోన్‌ను ఏప్రిల్‌ చివరి నాటికి విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఇది సుమారు 2వేల డాలర్లు (సుమారు రూ.1.38లక్షలు) ఉండవచ్చని చెబుతున్నారు. మరి భారత్‌లో దీన్ని ఎంత ధరకు తీసుకొస్తారో చూడాలి. ఫోల్డబుల్‌ ఫోన్‌ ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి.. 7.3అంగుళాల డైనమిక్‌ ఆమోల్డ్‌ మెయిన్‌ డిస్‌ప్లే, 6 అంగుళాల హెచ్‌డీ సూపర్‌ ఆమోల్డ్‌ డిస్‌ప్లే తెర, స్నాప్‌డ్రాగన్‌ 855 ప్రాసెసర్‌ (7నానోమీటర్‌ టెక్నాలజీ), 12జీబీ ర్యామ్‌ 512జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ, వెనుక మూడు కెమెరాలు, ముందు భాగంలో 10.8 మెగాపిక్సెల్‌ సామర్థ్యం కలిగిన డ్యుయల్‌ కెమెరా, ఆండ్రాయిడ్‌ పై, 4380 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఈఫోన్‌ ఇతర ప్రత్యేకతలు. అయితే ఎక్కువసార్లు మడతబెడితే ఈ ఫోన్‌ పాడవుతుందని.. ఎక్కువ రోజులు పని చేయబోవంటూ వస్తోన్న వార్తలను శాంసంగ్‌ సంస్థ ఖండించింది. రెండు లక్షలసార్లు ఈ ఫోన్‌ను మడత బెట్టినా చక్కగా పనిచేస్తుందని శాంసంగ్‌ చెబుతోంది. అంటే రోజుకు వందసార్లు చొప్పున ఐదేళ్ల పాటు మడతపెట్టినా ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఈ ఫోన్‌ను వాడుకోవచ్చని తెలిపింది. దీనికి సంబంధించిన ఒక వీడియోను సంస్థ సామాజిక మాధ్యమాల్లోకి విడుదల చేసింది.