పాక్ గాయకున్ని తీసేసిన సల్మాన్, కపిల్ శర్మ షో నుంచి సిద్దూ కూడా ?

15:31 - February 20, 2019

*ఆలిండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ నిర్ణయానికి కట్టుబడ్డ సల్మాన్ 

*నోట్ బుక్ సినిమా నుండి ప్ర‌ముఖ సింగర్ అతీఫ్ అస్లామ్‌ తొలగింపు 

*అతీఫ్  స్థానంలో అర్మాన్ మాలిక్ ని తీసుకుంటున్నారు? 

 

పుల్వామాలో జ‌రిగిన ఉగ్ర‌దాడిని నిర‌సిస్తూ ఆలిండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. 2016 లోనూ ఇలాంటి వాదన వచ్చినా అప్పుడు లైట్ తీసుకున్న బాలీవుడ్ ఈసారి మాత్రం అలా కుదరని తేల్చేసుకుంది తమ ప్రాజెక్టుల్లోనుంచి ఒక్క్కొక్కరిగా పాక్ న‌టీన‌టులు, సింగ‌ర్స్‌ని తప్పిస్తూ వస్తున్నారు. ఇప్పుడు తాజా స‌మాచారం ప్ర‌కారం స‌ల్మాన్ ఖాన్ త‌న నిర్మాణంలో రూపొందిస్తున్న‌ నోట్ బుక్ సినిమా నుండి ప్ర‌ముఖ సింగర్ అతీఫ్ అస్లామ్‌ని తొల‌గించాడ‌ట‌. అతని స్థానంలో అర్మాన్ మాలిక్ ని తీసుకుంటున్నట్టు ఇప్పటికి ఉన్న సమాచారం.


 స‌ల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతున్న నోట్ బుక్ సినిమాలో జ‌హీర్ ఇక్బాల్‌, ప్ర‌నూత‌న్ భాల్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. మార్చి 29న ఈ చిత్రం విడుద‌ల కానుంది. ఈ సినిమా తర్వాత ఈద్ కానుక‌గా  "భారత్" అనే చిత్రం విడుద‌ల కానుంది అందుకే ఇలాంటి సమయం లో రిస్క్ ఎందుకు అనుకున్నాడేమో వెంటనే నిర్ణయం తీసుకొని అతీఫ్ ని తన ప్రాజెక్ట్ నుంచి తప్పించేసాడు.

 
అయితే కేవలం పాక్ నటులని మాత్రమే కాదు భారత ఆర్మీకి వ్యతిరేకంగా మాట్లాడాడు అని ఆరోపణలు ఎదుర్కుంటున్న  నవ్‌జ్యోత్ సింగ్ సిద్దూను ద కపిల్ శర్మ షో నుంచి తప్పుకోవాల్సిందిగా కోరాడట సల్మాన్. ఈ షోకి కూడా నిర్మాత సల్మాన్ ఖానే అన్న విషయం తెలిసిందే. షోకి మంచి రేటింగ్స్ వస్తున్న ఈ సమయంలో ఒక్కడి కోసం వాటిని వదులుకోలేమని సల్మాన్ అనడం విశేషం. కొద్ది మంది చేసిన పనికి మొత్తం దేశాన్ని నిందించడం సరికాదు అంటూ పాకిస్థాన్‌ను వెనకేసుకొచ్చేలా సిద్దూ మాట్లాడిన విషయం తెలిసిందే. సిద్దూ ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత కపిల్ శర్మ షోను బాయ్‌కాట్ చేయాలన్న డిమాండ్ ఊపందుకుంది.

నిజానికి ఆయనను షో నుంచి సాగనంపారన్న వార్తలు కూడా వచ్చాయి. వెంటనే రంగంలోకి దిగిన సల్మాన్ ఖాన్.. స్వయంగా సిద్దూకు ఫోన్ చేసి తప్పుకోవాలని అడిగినట్లు తెలిసింది.  ఇప్పటికీ ప్రొడ్యూసర్, సదరు చానెల్ మధ్య ఈ అంశంపై చర్చలు నడుస్తున్నాయి. ప్రస్తుతానికి కొన్ని ఎపిసోడ్లకు సిద్దూని పక్కన పెట్టినా.. ఆయన మళ్లీ తిరిగొచ్చే అవకాశం ఉన్నట్లు షో వర్గాలు వెల్లడించాయి. ఇలా సల్మాన్ ఒక్కడే కాదు మరో బాలీవుడ్ హీరో  అజయ్ దేవగన్ కూడా తన రాబోయే సినిమా ‘టోటల్ థమాల్’ను పాకిస్తాన్‌లో రిలీజ్ చేయడం లేదని ప్రకటించారు.