మనలోపలినుంచి, మనలోకి - సాహిల్ వస్తాడు - (పుస్తక పరిచయం)

00:50 - April 17, 2019

 

కథలు రాయటం అంటే మామూలుగా కథ రాయటం కాదేమో కొన్నిసార్లు ఒక్క సారి మరొక్కసారి మొత్తం జీవితాన్ని ఉడుకుతున్న అన్నాన్ని కలిపినట్టు జీవితాన్ని తిరగ దోడుకోవటం కూడా. అఫ్సర్ కథలు అనగానే కాస్త అనుమానం వేసింది కవి కథలు రాస్తే కథంతా కవితాభాషతో నింపేస్తాడేమో అన్న అనుమానం. అయితే కవిత్వాన్ని మాత్రమే తెచ్చి కథ రాయటం మామూలేమీ కాదు. జీవితంలోని ఎస్సెన్స్ ఇట్లా ముక్కలు ముక్కలుగా దోసిట్లో పోసేసి ఇంకా నీ కన్నీళ్ళు ఎన్ని ఇవ్వగలవు వీటికి ప్రతిఫలంగా అని అడిగినట్టు. "సాహిల్ వస్తాడు" ఇతరకథలు చేతిలోకి వచ్చినప్పుడు ఇంతగా ఊహించలేదు. ఇప్పటికీ తెలుసు తెలుసనుకున్న సోదర జాతిలో లోలోతుల దు:ఖం. అమ్మలనీ, నాన్నలనీ, భూమినీ దేశాన్ని ఒక్కసారిగా కడిగి కడిగి అసలు రంగు చూపించినట్టు పదకొండు కథలు. నిజమే అఫ్సర్ జీవించే ఉంటాడు కథకీ కథకీ మధ్య మళ్ళీ ఒకసారి గడిచిన జీవితాన్నంతా మళ్ళీ అనుభవించే ఉంటాడు అనిపించింది. 

                                              

      "నాకు అయిదేళ్ళు వచ్చే దాకా నాది ఏ భాషో నాకే తెలియదు" (గోరీమా) ఒక్కసారిగా ఊరూ, చిన్న తనం ఆ పెచ్చులూడే గోదల బడిలో మనతో చదువుకున్న "ఒక్క తురక పోరడు" గుర్తురాకపోడు. తనది కాని భాషని మాతృభాషగా చదువుకోవటానికి వచ్చిన పిల్లవాడికి పంతులెత్తిన చింత బరికెని అవతల విసిరేసి,"అరె బచ్చే తు రోజ్ మేరే పాస్ ఆ మై ఉర్దూ పడాతీం"అన్న గోరీమా ఆ పిల్లవడికి దేవదూతలా కనిపించటంలో ఆశ్చర్యం ఏముందీ? 
బాల్యం గడిచి పోయి మళ్ళీ ఎన్నాళ్ళకో నాన్న మిగిల్చిన కొంత భూమిని అమ్ముకు పోదామని వచ్చిన వాడికి గోరీమా ఉన్న దీన స్థితి.. మొతానికి మొత్తంగా కోల్పోయినా నేనోడిపోలేదన్నట్టు ఇంకా అక్కడే ఉన్న గోరీమా..
      ఒక కులం, మరో మతం పేరుతో ఆమె సర్వస్వాన్నీ లాగేసుకుంటూంటే సాయంకోసమైనా వెళ్ళలేని తన మనుషుల నిస్సాహాయతని తల్చుకొని కుమిలిపోయినా, ఆ ఊరినుంచి వెళ్ళిపోయినా, మళ్ళీ అన్నేళ్ళతర్వాత కూడా అక్కడే అదే ఊరిలో కనిపించిన గోరీమా అతన్ని గుర్తుపట్టి ఉంటే ఏం చెప్పేదీ? పీర్లని ఎత్తుకుని ఊగిపోయినా, శ్రీరామ నవమి వేడుక జరిగినా అంతా కలిసిపోయే జనాల మధ్య హఠాత్తుగా మతం ఎలా వచ్చిపడిందో ఎవరైనా గట్టిగా బయటికి చెప్పగలరా?  అంతర్లీనంగా ఒక సామ్రాజ్యవాద వ్యూహాన్నీ, అంతర్జాతీయ రాజకీయ కుట్రలనీ ఒకే ఒక్క జీవితంలో, అతిచిన్న కథలో చెప్పేసిన కథకుడు నిజంగా తనకథ మాత్రమే చెప్పేసాడా? లేక ప్రపంచ బాదితుల స్వరమై గొంతు పగిలేలా రోదించాడా?? "మేరా ఘర్ షైతాన్ కా పాలే హువా బా" అంటూ రోదించింది ఒక్క గోరీమా మాత్రమేనా? 

                                                          

   ముస్తఫా గదిలో ఏముందీ? నమ్మకమా? ధనమా? (ముస్తఫా మరణం)  పిల్లల ఆలోచనని అక్కడికే ఆపేసినా అసలు సమాధానాన్ని గోరీమాతో చెప్పిస్తాడు. భజనలూ, తాయెత్తులూ, దేవుడికి సమానంగా "బాబా" అనే కాన్సెప్ట్ ని అంగీకరించని ఇస్లాం లోనూ అనేకరకాల మూఢ నమ్మకాలకి ముస్తఫా బలై పోతున్నాడూ అని అరిచి చెప్పిన గోరీమా ముస్తఫా ని మార్చలేకపోయింది. నిజమే ముస్తఫా గది, పిల్లలెవ్వరికీ ప్రవేశం లేని ఆగది, ఏదో రహస్యాన్ని దాచుకున్న గుప్పిటగా ఉండి పోయిన ఆగది ముస్తఫా మరణం తర్వాత వెంటనే కూల్చేయబడింది. లోపల ఏ రహస్యం ఉండేదో గానీ అనవసర నమ్మకాలను మాత్రం నిండుగా ఉంచుకున్న ఆ గది శాస్వతంగా మూసివేయబడి ఆ ప్రాంతాన్ని స్వచ్చమైన వెలుతురుతో నింపేసి ముస్తఫాతో పాటే తానూ మరణించించింది. ఒక వేళ ఆ గది మనలోనే మనకు తెలియకుండా ఉన్న కొన్ని భ్యాలకు రూపమా? కొన్ని నిజాలు కావు అని తెలిసీ అందులో ఏదో ఉందేమో అని ఆకాశాన్ని ప్రార్థించే పిచ్చితనానికి ప్రతీకనా? యేమో సమాధానం ఇద్దరికే తెలుసు ముస్తఫా మరణించాడు, విషయాన్ని కథగా చెప్పేసిన మనిషి నవ్వుకుంటూ పక్కన నిల్చొని పాఠకున్ని చూస్తూనే ఉన్నాడు. అయితే రెండు మాటలు మాత్రం వెంటాడుతూనే ఉంటాయి.
1."దేవుడు ఒక ముసుగు, భక్తి ఒక వంచన" 

2.అవును, కొన్ని కథలకు మనమే బలవంతంగా ముగింపు ఇవ్వాలి" 

                              

  ప్రతీ రెండెళ్ళకి ఒకసారి హైదరాబాద్ లో పరిస్థితులు "ఉద్రిక్తంగా మారుతాయి" ఒకరో ఇద్దరో కొన్ని సార్లు పదుల సంఖ్యలో పాత బస్తీ గల్లీల్లోని కుర్రాళ్ళు మాయమైపోతూంటారు. వాళ్ళు అనుమానితులు అనే మాట కొన్ని క్షణాల్లోనే మీడియాలో "టెర్రరిస్టులు" గా మారిపోతుంది. ఏ ఒక్కసారొ ఆ మాటే నిజమవుతుంది కొన్ని వందలసారు ఈ వ్యవస్తా, పోలీసులూ, మీడియా దాన్ని "నిజం చేస్తాయి"  
   సాహిల్ వచ్చినా రాకపోయినా?  ఈ కథకి (సాహిల్ వస్తాడు) ముగిపంపు రచయితే కాదు మరెవ్వరూ ఇవ్వలేరు ఒక్క కాలం తప్ప అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కథ రచయిత రాయలేదు ఒక అభద్రత, ఒక నిస్సహాయత అతనితో రాయించింది. మహా చరిత్ర గల నగరం మీద పడ్డ మచ్చ అది నిజమైన పుట్టూ మచ్చే నేంతగా పేరుకు పోయి సాహిల్ ని మాయం చేసింది. అందుకే దైర్యంగా సాహిల్ ని నిర్దోషి అని స్పష్టంగా చెప్పనూ లేక సాహిల్ ఈ దేశపు పౌరుడే అని ఇంకా గుర్తించలేని ఈ దేశాన్ని నమ్మించనూ లేక కథని ముగించేసాడు. అయితే తిత్లీ గా మారిన పాఠకుడు మాత్రం సాహిల్ ని మర్చిపోలేడు. యేమో ఎక్కడో ఒక చోట సాహిల్ మనకూ కనిపించవచ్చేమో అని వెతుకులాట మనకు తెలియకుండానే కొనసాగుతూనే ఉంటుంది. 
   అపూ ఒక గుర్రం బొమ్మని పట్టుకొని, తండ్రికి తెలియకుండా దాచుకొని మున్నీ కొసం పలవరిస్తూనే ఉంది (చంకీ పొల్ల గుర్రం) ఇద్దరు చిన్నారుల మధ్య వొచ్చి పడిన మతం, ధర్మం వాళ్లని విడదీసాయి. ఇద్దరు చిన్నారుల స్నేహం మధ్య ఈ కొత్తగా వచ్చిన ధర్మం అంటే ఏమిటో, ఎందుకు నాన్న సురేష్ ఎదుకు తనని మున్నీ వాళ్ళింటికి వెళ్ళొద్దని అంటున్నాడో అర్థం కాని అపూ అమ్మని అడిగిన మాట " మతం, ధర్మం అంటే ఏమిటీ? అవేమన్నా కొత్త బొమ్మలా?" 
     మతాన్ని పక్కన పెట్టి సీతారాములనీ, పీర్లదేవుడి పటాలనీ, పీరుగుండం విభూదిని ఒకే గదిలో ఒకేలాంటి పవిత్రతతో చూసే అరుణ వాళ్ళమ్మ, "పీరుస్వామి" అని ఒక్క మాటతో రెండు మతాల హద్దులనీ చెరిపేసిన అరుణ వాళ్ళమ్మలు మరింత మంది ఉండుంటే ఎంత బావుండేది..
 చివరగా అపూ తల్లి సత్య తాను అనుకున్న మాటలు సురెష్ కి చెప్పగలిగిందా? దేవుడు బొమ్మకూడా చిన్న పిల్లకి ఆటబొమ్మ మాత్రమే వాళ్ళకి మతాలని అంటించొద్దు అని చేసే ఉంటుందా? ఏమో సమాధానం మనమే చెప్పాలి మరి.  
                     అన్వర్ చిన్ననాటి మిత్రుల్లో ఎవడో ఒకడు ఉండే ఉంటాడు మనింటి దాకా వచ్చి ఇంట్లో మమేకమైపోయిన వాడు కూడా కొన్ని సార్లు మాత్రం మనలని కూడా భయంగా అనుమానంగా చూసిన రోజు ఒక్కటైనా ఉండే ఉంటుంది. అన్వర్ (ఒక తలుపు వెనుక)  "మనం చిన్న పిల్లలుగా కొంతసేపే ఉందగలం" అని తేల్చేసిన అన్వర్, అవును ఆపిల్ల తనాన్ని దాటితే ఏముంటుందో, పిల్లలు గా ఉండటం లో ఎంత ఆనందం ఉందో అంతకు రెట్టింపు అమాయకత్వమూ ఉందన్న విషయాని తెలుసుకున్న అన్వర్, " ముసల్మాన్ కేలియే దోహీ స్థాన్, పాకిస్థాన్ యా ఖబర్స్థాన్" అన్న రాతలు చదివి ఎవడో అప్పటి వరకూ కలిసే ఉన్న ఇద్దరు మిత్రులని విడగొట్టే వాడు వచ్చేసాడు అని అర్థం చేసుకున్న అన్వర్. యుద్దాన్ని ఎదుర్కోవచ్చుగానీ తమలో తామే నరుక్కునే ఒక కుట్రను ఎలా ఎదుర్కోవాలో అర్థంకాక కుమిలి పోయిన అన్వర్. తన జీవితం తాను బతికేస్తే చాలనుకున్న ఫైజ్ స్నేహితుడు అన్వర్. 
   కథ మొత్తం చదివాక ఏమో ఇస్లాం టెర్రరిజం చేసే దాడులకన్నా మనుషులుగా మనం మన వాళ్ళమ్రీదే చేస్తున్న మానసిక మైన దాడి మరింత పెద్దదేమో. నా స్నేహితులున్నారు, మా ఇంటికి వస్తారు అని మాట్లాడే వాళ్ళతో చాలా సార్లు చెప్పాల్సిన మాతని అన్వర్ ఎంత మామూలుగా చెప్పేసాడు... "మనం చిన్న పిల్లల్లా కొంత సేపే ఉండగలం" అవును మనం ఎక్కువ సేపు నటించలేం. "దీదార్" ఇవ్వలేని ఫైజ్ ని తల్చుకొని దిల్ దార్ గా నవ్వుకునే ఉంటాడు అన్వర్. ఈదేశపు పౌరుడిగా పిలిపించుకోలేక నిజంగానే ఖబర్స్థాన్ కి వెళ్ళిన అన్వర్... నిజమే ఫైజ్ (ఫైజ్ అహమ్మద్ ఫైజ్) చెప్పినట్టు.. 


ఎట్లా మాట్లాడాలి ఈవేళ మరణాల గురించి?
ఎవరు వింటారు? నా లోపలి గాయాల మూలుగులని?
బలహీనమైన ఈ దేహంలో ఒక్క నెత్తుటి చుక్క లేదు
మిగిలిన అరకొరా నెత్తుటి చుక్క ఒక్క వెలుగు కాదు
కాసింత ద్రవమూ కాదు
ఇది నిప్పు రాజేయనూ లేదు, దప్పిక తీర్చనూ లేదు..."
 

                                                  

     సహేలీ కథ మరింతగ ఒకడుగు ముందుకేయించిన కథ స్త్రీ అస్తిత్వం కేవలం లైంగికత మాత్రమే కాదూ, అందాల వెనుక ఒక మనస్సుంటుంది అని గుర్తు చేసినకథ ఈ కాలపు ఫెమినిజం కూడా మరిచిన కొన్ని అంశాలను మళ్ళీ ఒక సారి లీలగా స్పర్షించిన కథ. ప్రేమించటం అంతే మతాల, జెండర్ల స్థాయిలని దాటి మరేదో ఉందని చెప్పిన కథ ఇంతకంటే ఎక్కువ చెప్తే కథ చదువుతున్నప్పుడు ఆ లోతులని అందుకున్న అనుభూతి మిస్స్ అవుతారేమో... బేబీ కీ షబ్నంకీ మధ్య వెలుగై అల్లుకున్న చీకటి ఎంతకాలం వెలిగి ఉంటుందో మరి... 
వచ్చీపోయే వానల్లో ఈమధ్యకాలంలో ఒకానొక అబ్స్ట్రాక్ట్ లా కనిపించిన కథ ఇదెక్కడా ఎవ్వరినీ ఉద్దేషించనట్టుగా కనిపిస్తూనే దాదాపుగా ప్రతీ మనిషికీ ఉండే పూతి వ్యక్తిగత స్వేచ్చకీ, చుట్టూ ఉన్న సామాజిక జీవితానికీ మధ్య ఉండే ఘర్షణ. మొత్తంగా ఈ కథ ఒక అనుభవించాల్సిన స్థితి గా తప్ప ఏ విశ్లేషనకీ లొంగని స్థితి. మళ్ళీ మళ్ళీ చదవాలనిపించి చదివిన ప్రతీసారి ఒక కొత్త ఫీలింగ్ ఇచ్చే ఏదో విషయం ఇక్కడ ఉంది. ఇప్పటికీ ఈ కథ నన్ను వెంటాడుతూనే ఉంది... 

                                           

   ఇక ముస్లింలలో ఉండే ఒకానొక రకమైన మతాభిమానాన్నీ దాని వెనక ఉన్న ఒకరకమైన భయాన్నీ చూపించిన కథ "తెలంగీ పత్తా" ఖిల్లా లోపల ఉండే వాడ మొత్తం ముస్లిం ల ప్రాంతంగా పిలవబడుతున్నప్పుడు టౌన్లో ఉందటమే నేరమైపోయిందా అనంతగా బాధపడ్డ మనిషి " ఖిల్లా లోపల ఉన్న వాళ్ళే అచ్హమైన ముస్లిం లు" అన్న మాట విని కూడా ఊళ్ళోనే ఆగిపోయిన "నేను" ఎవరై ఉంటారు?? ఉర్దూ రాని లక్షలాది ముస్లింలున్న ఈ దేశంలో ఎవడిదేభాష? పాకిస్థాన్..నీపిలక పీకిస్థాన్ అనే మాటకి సమాధానం వెతుక్కుంటూనే "నేను ఏదీకాదు. ఎక్కడికీ వెళ్లలేను.. నేను "తెలంగీ పత్తా" అనుకున్న "నేను" ఆ రాత్రంతా నిద్రపోలేకపోవటానికి కారణం ఏమై ఉంటుందో పాటకుడు కూడా "నేను" గా మారిపోయాక గానీ అర్థం కాదు. 
మతం, కులం ఈ రెండూ మనిషిని వీడని మురికి వస్త్రాల్లాంటివే ఒకటి ప్రపంచమంతా ఉంటే రెండోది మాత్రం మనదేశం మనకు ఇచ్చిన మ్రో అదనపు మురికి మరక. మురికి వాసన వేసే చోటీ కప్పుకున్న "హిజాబ్" కనిపించకుండా మనదరి మొహాల చుట్టుతా కప్పబడే ఉంటుంది. ప్రాంతాలు మారినా వదలని ఒక అస్తిత్వ మురికి వాసన. అందుకే భారతదేశాన్ని దాటినా మతాన్ని దాని తాలూకు వివక్షనీ మాత్రం వదిలించుకోలేని చోటీ ప్రపంచం ఇది. "ఈ వ్యవస్తకి కావాల్సింది నువ్విచ్చే రిసల్ట్ అంతే! నీ వైఫల్యం కాదు" అన్న ఫ్రొఫెసర్ దగ్గర సమాధానం పూర్తిగా ఉందా? మనుషుల ఆర్థిక, సామాజిక ఇబ్బందులు ప్రతీ నిమిషం కాళ్లకీ ఆలోచనలకీ అడ్డు పడుతూంటే ఎలా అధిగమించాలి? జీవితం అన్నిటికీ సమాధానం చెప్తూండి అని సాగిపోవటం అందరికీ సాధ్యమయ్యే పనేనా?? నిజానికి ఈ కథ ఒక తీవ్రమైన మానసిక విశ్లేషణ, ఒకానొక సామాజిక స్థితిని దాటలేని నిస్సహాయ వేదన... మొత్తంగా ఒక ఆలొచన ఎలా సాగాలి అని చెప్పే సూచన అనిపించింది. ఏమో నా అవగాహన సరైందా కాదా అన్నది మళ్ళీ ఈ కథ చదివే ఎవరైనా పాటహకుడు చెప్తాడేమో...

ఇన్ని కథల్లోనూ ఒకే ఒక కథ "దేఢీ" ఒక వేళ ఈ కథని విశ్లేషించగలిగితే చిన్నపాటి పుస్తకమే అవుతుంది. ఒకే కథలో విభిన్న రకాల సామాజిక, కుటుంబ కోణాలని చెప్పిన కథ ఇది. పరిచయంలో భాగంగా ఈ కథని తాకే ప్రయత్నం చేయక పోవటానికి కారనం ఇప్పటికీ దాన్నుంచి బయట పడలేకపోవటమే అనుకుంటున్నాను.  
     మొత్తంగా ఈ పుస్తకం ఒక జీవితం, ఒక డాక్యుమెంటరీ, ఒక మానసిక స్థితి ఒక్కొక్క కథా తనకు తను బయటకు చెప్పుకునే స్థితినుంచే బయటకు వచ్చిందేమో అందుకే ఎక్కడా "నాటకీయత కనిపించలేదుదు" మొత్తంగా ఈ పుస్తకం, ఈ కథలూ చదవటం ఒక అవసరం అనిపించింది.