మరక మంచిదేనా? సర్ఫ్ ఎక్సెల్ యాడ్ "యాంటీ హిందూ" అన్నది నిజమా??

02:28 - March 13, 2019

 

 

 

 

 

 

 

మరక మంచిదే కానీ మరకలని పోగొట్టే "సర్ఫ్ ఎక్సెల్ మీదనే మరకపడితే? ఇప్పుడు ఆమరక గాయపు మచ్చగా మారిపోయింది. సర్ఫ్ ఎక్సెల్ కొత్త యాడ్ ఫిలిం ఇప్పుడు దేశంలో ప్రకంపణలు రేపుతోంది. అది హిందూమతాన్ని కించపరిచేదిగా ఉందంటూ కొత్త వివాదం రేగింది.బాబా రామ్దేవ్ తోసహా  పలువురు ప్రముఖులు ఈ కొత్త ప్రకటనని ఖండిస్తున్నారు. హోలీ పండగ థీమ్ గా తీసిన ఈ యాడ్ ఫిలిం తో హిందువుల మనోభావాలు తీవ్రంగా గాయపడ్డాయి అంటూ ఆ ప్రకటణని నిషేదించాలని కొందరంటూంటే రామ్దేవ్ బాబా మాత్రం ఏకంగా ఆ కంపెనీనే పక్కకు పెట్టేయాలంటూ మాట్లాడారు. ఇంతకీ అంతమంది వ్యతిరేకిస్తున్న ఆ ప్రకటణలో ఏముంది అంటే... 


నిమిషం ఉన్న ఈ ప్రకటనలో ఇళ్ళపైనుంచి బెలూన్లతో రంగులు చల్లుతున్న పిల్లల మధ్యకు  ఒక చిన్న పాప సైకిల్‌పై వస్తుంది. అక్కడ రంగులు చల్లే పిల్లలని రంగులు చల్లమని పిలుస్తుంది. ఆ పాపను కొందరు పిల్లలు రంగునీళ్లు నింపిన బెలూన్లతో కొడుతుంటారు. పాప సంతోషంగా ఆ బెలూన్లను తనపైన పడనిస్తుంది. అందరి దగ్గరా ఆ రంగుల బెలూన్లన్నీ అయిపోయాక.. ఒక ఇంటి ముందుకెళ్లి తన సైకిల్ ఆపుతుంది. ఒక చిన్న పిల్లాడితో "అన్నీ అయిపోయాయి, బయటికి రా" అంటుంది. ఆ పిల్లాడు తెల్ల కుర్తా-పైజామా వేసుకుని ఉంటాడు. పాప అతడిని తన సైకిల్‌పై కూచోబెట్టుకుని ఒక మసీదు దగ్గర వదులుతుంది. మసీదులోకి వెళ్తూ ఆ పిల్లాడు "నమాజు చదివొచ్చేస్తా" అంటాడు. దానికి ఆ పాప ఈ నమాజ్ అయ్యాక మాతో కలిసి పోవాలి అన్నట్టు "తర్వాత రంగులు పడతాయి" అంటుంది. అప్పుడు ఆ పిల్లాడు కూడా సంతోషంగా రంగులు చల్లటానికి ఒప్పుకుంటున్నట్టు అలాగే అని తల ఊపుతాడు. అంతే ప్రకటన అయిపోతుంది. ఇదీ ఆ ప్రకటణ. ఈ ప్రకటనను ఇప్పటివరకూ 80 లక్షల మందికి పైగా చూశారు.


నిజానికి ఇక్కడ ఆ పాప నమాజ్ వెళ్ళే పిల్లాడి మీద రంగులు పడకుండా ఆపటమూ, తర్వాత రంగులు పడతాయి అనటమూ గమనిస్తే అసలు ఏ మతాన్ని ఇక్కడ కించ పరిచినట్టు లేదన్నది ఈ ప్రకటణని సమర్థించే వారి మాట. రంగులతో ఆడుకోవటానికి ఆ పిల్లవాడు కూడా సమ్మతంగానే ఉన్నట్టు చూపించారు కూడా. ఇక ఇక్కడ వాళు ఇంకా చెబుతున్నదేమిటంటే తుంటరి పిల్లల మధ్య కూడా రెండు మతాల పిల్లలు కలిసి ఒకరి మతాన్ని మరొకరు గౌరవించుకున్నదాన్ని చూపించారు తప్ప ఏ మతాన్ని కించపరిచినట్టులేదని చెబుతుండగా. ఆ ప్రకటణని వ్యతిరేకించేవారు మాత్రం. 
 ఈ సర్ఫ్ ఎక్సెల్ ప్రకటణలో కావాలనే ఉద్దేశపూర్వకంగా  "హోలీ పండుగను అపార్థం చేసుకునేలా ప్రదర్శిస్తున్నారు" అని భావిస్తున్నారు."ఈ ప్రకటన ద్వారా హిందూ-ముస్లింల మధ్య దూరాలను చూపించారు" అని సోషల్ మీడియాలో చాలామంది చెబుతున్నారు. "హోలీ వల్ల వేరే మతం వారు ఇబ్బంది పడతారు" అనేలా చూపించటం ద్వారా రెండు మతాల మధ్యా దూరాన్ని పెంచే ఉద్దేశంతోనే ఈ ప్రకటణని తయారు చేసారు అన్నది వీరి వాదన. అయితే ఈ తరహా వ్యతిరేకత మామూలు జనం నుంచే కాదు పలువురు ప్రముఖులనుంచి రావటం గమణార్హం. 


   "అయినా క్రియేటివ్ స్వేచ్ఛ అంటే నాకూ ఇష్టమే. కానీ ఇలాంటి తెలివితక్కువ కాపీరైటర్లు గంగా యమునా సంస్కృతి నుంచి యమునను వేరు చేయాలని చూస్తున్నారు, ఇలాంటి వారిని భారత్‌లో బ్యాన్ చేయాలి" అని బాలీవుడ్  సినీ నిర్మాత వివేక్ అగ్నిహోత్రి ట్వీట్ చేశారు.
ఇక ఆయుర్వేదం, స్వదేశీ నినాదంతో భారతీయ వ్యాపర దిగ్గజంగా ఎదుగుతున్న యోగా గురువు రామ్దేవ్ బాబా "మేం ఏ మతానికీ వ్యతిరేకం కాదు. కానీ జరుగుతున్న దాని గురించి చాలా తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ విదేశీ సర్ఫ్ ఎక్సెల్ మన బట్టలను ఉతుకుతుంది. ఇప్పుడు దాన్ని ఉతికే రోజులు వచ్చాయి" అంటూ అన్యాపదేశంగా ఏకంగా సర్ఫ్ ఎక్సెల్ బ్రాండ్ నే వ్యతిరేకించినట్టు ట్వీట్ చేసారు.

ఇక ఈ ప్రకటణని సమర్థిస్తూ కూడా కొందరు ప్రముకులు ట్వితర్ లో పోస్టులు చేసారు. ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ సిన్హా  "ఎన్నికల తేదీలు ప్రకటించిన రోజు సర్ఫ్ ఎక్సెల్ ప్రకటనపై హిందుత్వవాదుల నుంచి వ్యక్తం అవుతున్న ఈ ఆగ్రహం చూస్తుంటే, గత ఐదేళ్లలో దేశంలో ఎలాంటి పరిస్థితి ఉంది అనేది కనిపిస్తోంది" అంటూ ట్వీట్ చేయగా, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ "నా దగ్గరొక మంచి పరిష్కారం ఉంది. భక్తులను సర్ఫ్ ఎక్సెల్‌తో బాగా కడగాలి. ఎందుకంటే సర్ఫ్ ఎక్సెల్‌తో ఉతకడం వల్ల మరకలు శుభ్రం అవుతాయి" అని ట్వీట్ చేశారు. అయితే ఇంత దుమారం రేగుతున్నా అందరి స్పందనలూ చూస్తున్న "సర్ఫ్ ఎక్సెల్" మాత్రం ఈ ప్రకటణమీద ఎలాంటి స్పందనా ఇప్పటివరకూ తెలియజేయకుండా మౌనంగానే ఉంది.