మరో ఎన్టీఆర్ వచ్చేశారు: "వర్మాస్ ఎన్టీఆర్"

04:43 - January 19, 2019

 

 

 

 

 

 

 

ఎన్టీఆర్ బయోపిక్ "కథానాయకుడు" వచ్చివెళ్ళిపోతున్న దశలో ఇప్పుడు మళ్ళీ రామ్‌గోపాల్ వర్మ తన ఎన్టీఆర్ ని రంగంలోకి దించాడు.తన దర్శకత్వంలో ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్ నుంచి ఇప్పటి వరకు లక్ష్మీ పార్వతి, చంద్రబాబు ఇలా ఒక్కో పాత్ర కోసం అచ్చంగా వాళ్లను తలపించేలా ఉండే నటులను తీసుకొస్తున్నాడు వర్మ. ఇప్పటికే విడుదలైన లక్ష్మీ పార్వతి, చంద్రబాబు నాయుడు లుక్స్ బీభత్సంగా ట్రెండ్ అయ్యాయి. ఇలా రెండు పాత్రలను పరిచయం చేసిన వర్మ తాజాగా ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశాడు.

నిన్న (జనవరి 8, 2019) సాయంత్రం 5 గంటలకే రిలీజ్ చేయాల్సి ఉన్నా, ఎన్టీఆర్‌కు ఉన్న విశ్వాసాల మీద గౌరవంతో ఆయన లక్కీ నెంబర్ 9 కలిసే విధంగా సాయంత్రం 6.57 గంటలకు లక్ష్మీస్ ఎన్టీఆర్‌లోని ఎన్టీఆర్ పాత్రను పరిచయం చేశాడు వర్మ. వెన్నుపోటు ద్వారా చంపబడిన ఎన్టీఆర్ మళ్లీ లక్ష్మీస్ ఎన్టీఆర్ రూపంలో బతికి వ‌చ్చారంటూ వర్మ ట్వీట్ చేస్తూ ఎన్టీఆర్ ఫస్ట్‌లుక్‌కు సంబంధించిన వీడియోను రిలీజ్ చేశాడు.  


  6.57 నిమిషాలు సుముహూర్తం అని ఎన్టీఆర్ తనకు కలలో కనిపించి చెప్పారని.. 6+5+7 = 18.. 1+8 = 9 ఎన్టీఆర్‌కు పవిత్ర సంఖ్య అని ఆ ట్వీట్‌కి వర్మ క్యాప్షన్ పెట్టారు. అన్నట్లుగానే సరిగ్గా 6.57 గంటలకు ఎన్టీఆర్ ఫస్ట్‌లుక్‌ని వర్మ వదిలారు. ఈ వీడియోలో ఉన్న నటుడు దాదాపు ఎన్టీఆర్ పోలికలతో ఉండటం గమనార్హం. ‘‘ఎన్టీఆర్ మృతి చెందిన తర్వాత.. లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో మళ్లీ పుట్టారు’’ అంటూ వర్మ చెప్పాడు.


థియేటర్ ఆర్టిస్టుతో ఈ ఎన్టీఆర్ క్యారెక్టర్ చేయించాడు ఈ సంచలన దర్శకుడు. ఇప్పుడు విడుదలైన లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చూడ్డానికి అచ్చంగా ఎన్టీఆర్ ను తలపించేలా ఉన్న ఈ న‌టున్ని వర్మ ఎక్కడినుంచి పట్టుకొచ్చాడో అంటూ ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు అభిమానులు. ఈ సినిమాకు సంబంధించిన ఇప్పటికే రెండు పాటలను వర్మ సోషల్‌మీడియా ద్వారా విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఇందులో వెన్నుపోటు పాటపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఈ క్రమంలో ఎన్టీఆర్ ఫస్ట్ లుక్‌ను వర్మ రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే..లక్ష్మీపార్వతిగా కన్నడ నటి యజ్ఞాశెట్టి, చంద్రబాబు పాత్రలో శ్రీతేజ్ పాత్రలో నటిస్తున్నట్లు ఆర్జీవీ ట్విట్టర్‌లో చెప్పిన సంగతి తెలిసిందే. కానీ ఎన్టీఆర్ పాత్రను పోషించిన వ్యక్తి పేరు మాత్రం చెప్పలేదు వర్మ.