సీనియర్ ప్లేయర్ పై కోచ్ ఘాటు విమర్శ: మిథాలి టీ 20 కి అర్హురాలు కాదు

20:15 - February 10, 2019

*మహిళా క్రికెట్ జట్టులో మళ్ళీ వివాదాల సెగ

*మిథాలి టీ 20 కి అర్హురాలు కాదు 

*రమేష్ పొవార్ సంచలన వ్యాఖ్యలు 

 

 

భారత మహిళా క్రికెట్ జట్టులో మళ్ళీ వివాదాల సెగ రాజుకుంది. సీనియర్ క్రీడాకారిణి మిథాలీ రాజ్ మీద మళ్ళీ ఘాటు వ్యాఖ్యలు చేసారు కోచ్ రమేష్ పొవార్. గతంలోనే సీనియర్ క్రీడాకారిణులమీద రకరకాల ఆరోపణలు చేసిన పొవార్ ఇప్పుడు జరిగిన టీ20 తర్వాత  టీమిండియా మహిళా జట్టు సీనియర్ ప్లేయర్ మిథాలీరాజ్‌పై మాజీ కోచ్ రమేశ్ పొవార్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మిథాలీ ఇక భారత్ తరపున టీ20 క్రికెట్ ఆడేందుకు ఎంతమాత్రమూ అర్హురాలు కాదని పేర్కొన్నాడు. 


కివీస్‌తో జరిగిన తొలి రెండు టీ20ల్లోనూ ఆడని మిథాలీ చివరి మ్యాచ్‌లో బరిలోకి దిగింది. నిజానికి మొదటి రెండు మ్యాచ్ లలోనూ ఆడకపోవటానికి కారణం కూడా కోచ్ అన్న ఆరోపణలూ ఉన్నాయి. చివరి మ్యాచ్ లో ఆటలోకి దిగిన 20 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 24 పరుగులు చేసింది. ఐదో నంబరులో మిథాలీ క్రీజులోకి వచ్చినప్పుడు భారత జట్టు విజయానికి 7.5 రన్ రేట్ అవసరం కాగా, 120 స్ట్రైక్‌రేట్‌తో మిథాలీ ఆడినప్పటికీ జట్టును విజయతీరాలకు చేర్చడంలో విఫలమైంది. ఇది మరింతగా ఆమె మీద వ్యాఖ్యలు చేయటానికి కారణం అయ్యింది. 
  
ఈ పరిణామాల తర్వాత  మహిళా జట్టు మాజీ కోచ్ రమేశ్ పొవార్ స్పందించాడు. మిథాలీ ఇక భారత జట్టు తరపున పొట్టి క్రికెట్ ఆడేందుకు అర్హురాలు కాదంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశాడు. తాను ఎప్పటికీ మహిళా జట్టు కోచ్‌గా ఉండాలనుకుంటే సీనియర్ ప్లేయర్లు మిథాలీ రాజ్, హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మందన వంటి వారితో సత్సంబంధాలు కొనసాగించి ఉండేవాడినని, కానీ తాను అలా అనుకోలేదని, అది తన స్వభావం కాదంటూ చెప్పిన రమేష్ పొవార్ తాను జట్టు మెరుగైన ఫలితాల కోసం ప్రయత్నిస్తానని, అందుకోసం ఓ పద్ధతి ప్రకారం నడుచుకుంటానని హెప్పాడు ఈ క్రమంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని పొవార్ పేర్కొన్నాడు. కానీ ఇలాంటి ఆరోపణల వల్ల జట్టు పర్ఫార్మెన్స్ లో తేడా వస్తుందని ఎవరూ గుర్తించకపోవటమే శోచనీయం.