"లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌" రివ్యూ రేటింగ్ 

12:48 - March 29, 2019

 

టైటిల్ : లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌
జానర్ : బయోగ్రాఫికల్‌ మూవీ
తారాగణం : విజయ్ కుమార్‌, యజ్ఞ శెట్టి, శ్రీ తేజ్‌
సంగీతం : కల్యాణీ మాలిక్‌
దర్శకత్వం : రామ్‌ గోపాల్‌ వర్మ, అగస్త్య మంజు
నిర్మాత : రాకేష్‌ రెడ్డి, దీప్తి బాలగిరి

ఈ మధ్య కాలంలో అటు సినిమా అభిమనులూ, ఇటు రాజకీయాభిమానులూ ఒకేరకమైన క్యూరియాసిటీతో కలిపి ఎదురు చూసిన సినిమా "లక్ష్మీస్‌ ఎన్టీఆర్". ఒక పక్క వచ్చే కాంట్రవర్సీలన్నీ ఎదుర్కుంటూనే ఎట్టకేలకు తన సినిమా ఆంధ్రప్రదేశ్ లో తప్ప మిగతా అన్ని చోట్లా విడుదల చేసేసాడు రామ్ గోపాల్ వర్మ. ఈ సినిమా చుట్టూ అల్లుకున్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు. చివరికి ఎన్నికల కోడ్ కారణంగా ఏపీలో ఈ సినిమా విడుదల వాయిదా పడగా, తెలంగాణ సహా ఓవర్సీస్‌లో సినిమా యథావిధిగా విడుదల అయ్యింది. అయితే సినిమా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టే ఉందా? తెలుగుదేశం పార్టీ అభిమానుల మనోభావాలు నిజంగానే గాయపడ్డాయా? రామ్ గోపాల్ వర్మ నిజాయితీగా తాను చెప్పినట్టే ఈ సినిమాని తెరకెక్కించాడా అన్న విషయాలు తెలియాలంటే రివ్యూ వైపు, తరవాత థియేటర్ వైపూ ఓ లుక్ వేయాల్సిందే... 

కథ


    నిజానికి ఇదేమీ జనం ఊహించని కథ, తెలియని చరిత్రా ఏమీ కాదు అయితే వర్మ టేకింగ్, అప్పట్లో విన్న, పేపర్లలో చదివిన ఘటనలను ఎలా చూపించాడు అన్న ఆసక్తి తోనే ప్రేక్షకుడు అడుగుపెడతాడు. 1989లో ఎన్టీఆర్‌ (విజయ్ కుమార్) అధికారం కోల్పోయి,ఒంటరిగాఉన్న సమయంలో ఆయన జీవిత చరిత్ర రాసేందుకు లక్ష్మీపార్వతి (యజ్ఞా శెట్టి) వస్తుంది.  అప్పటికే విపరీతమైన డిప్రెషన్ లాంటి స్థితిలో ఉన్న  ఎన్టీఆర్‌ ఆమె గురించి ఆమె చదువు గురించీ తెలుసుకొని సరే అని తన జీవిత చరిత్ర రాయటానికి ఒప్పుకుంటాడు.  అయితే ఎన్టీఆర్ కి లక్ష్మీ పార్వతిలపైపై కొద్ది రోజుల్లొనే వారిద్దరి మధ్యా ఏదో ఉందంటూ ప్రచారం మొదలవుతుంది. అయితే ఆ ప్రచారం చేస్తున్నది తన చుట్టూ ఉన్నవాల్లే అన్న విషయం మాత్రం ఎన్టీఆర్ కి తెలియదు. ఆ ప్రచారం ఎన్టీఆర్‌ దాకా రావటంతో తమైద్దరి మధ్యా ఉన్న బంధాన్ని జనానికి చెప్పాల్సింది పోయి ఆమెని పెళ్ళిచేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. లక్ష్మీ పార్వతిని ప్రక్కన పెట్టమని అల్లుడు బాబు వార్నింగ్ ఇవ్వటం, కలత చెందిన ఎన్టీఆర్ కు హార్ట్ స్ట్రోక్ వస్తుంది. ఈ సంఘటనలతో  మేజర్ చంద్రకాంత్ సినిమా ఫంక్షన్‌లో పెళ్లి చేసుకోబోతున్నట్లు పబ్లిక్ గా ప్రకటిస్తారు. ఎన్టీఆర్ అల్లుడు (శ్రీతేజ్), మరో పత్రికా అధినేతతో కలిసి లక్ష్మీ పార్వతి, ఎన్టీఆర్ పై చెడు ప్రచారం మొదలు పెడతాడు. అయితే ఇక్కడ కావాలనే చంద్రబాబు ని మరీ క్రూరంగా ప్రజెంట్ చేసినట్టు ఉంది. 
1994లో లక్ష్మీతో కలిసి ప్రచారం చేసిన ఎన్టీఆర్‌ భారీ మెజారిటీ సీఎం అవుతారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు.. కుటుంబాన్ని తనవైపు తిప్పుకున్న అల్లుడు.. కుట్రలకు తెరతీస్తాడు. కుటుంబ సభ్యులను బెదిరించి తనవైపు తిప్పుకుని ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడుస్తారు. సీయం కుర్చీ లాక్కుంటాడు. పదవి కోల్పోయి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న ఎన్టీఆర్‌పై వైస్రాయ్‌ హోటల్‌ దగ్గర చెప్పులు వేయటంతో కుమిలి కుమిలి చనిపోతాడు. సింపుల్ గా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ కథ.

నటీనటులు:

సినిమాలో మార్కులు వేసే నటుల్లో ఎన్టీఆర్‌ పాత్రలో కనిపించిన విజయ్ కుమార్‌ కే. ఒకపక్క కథా నాయకుడు, మహా నాయకుడు సిరీస్ లో బాలకృష్ణని చూశాక మళ్ళీ ఎన్టీఆర్ ని ఇంకో నటుడు చేస్తున్నాడనగానే ప్రేక్షకులంతా ప్రధానంగా దృష్టిపెట్టింది ఆ పాత్రమీదనే, అయితే రంగస్థల నటుడైన విజయ్ కుమార్ వర్మ పెట్టుకున్న నమ్మకాన్ని నెలబెట్టాడు. సెంటిమెంట్ సీన్లలో, భాధని ఎలివేట్ చేస్తూ ఎన్టీఆర్ బాడీలాంగ్వేజ్ ని అనుకరిస్తూ బాగా ఫెర్మార్మెన్స్ చేశాడు.ఇక విశ్వ చెప్పిన డ‌బ్బింగ్ వాయిస్  కలిసి ఎన్టీఆర్ ని మళ్ళీ బతికించాయి. ఇక లక్ష్మీ పార్వతి పాత్రలో నటించిన యజ్ఞశెట్టి లక్ష్మీపార్వతి పాత్రలో కనిపిస్తోంది. సినిమాకు హైలెట్‌. నిష్కల్మశమైన ప్రేమ, అమాయకత్వం, బాధ, వేదన, అవమానభారం ఇలా అన్ని భావాలను తెరపై బాగా పలికించింది. లక్ష్మీపార్వతిలో ఇన్ని షేడ్స్ ఉన్నాయా అని ప్రేక్షకులు అనుకోవటం విశేషం. బాబురావు పాత్రలో శ్రీతేజ్ జీవించాడనే చెప్పాలి. కుళ్లు, కుతంత్రం, వెన్నుపోటు రాజకీయాలు చేసే ఎన్టీఆర్ అల్లుడు, కుటిల రాజకీయ నాయకుడిగా శ్రీ తేజ్‌ నటన ఆకట్టుకుంటుంది. సినిమా మొత్తాన్ని ఈ ముగ్గురే భుజాల‌పై వేసుకుని న‌డిపించారు. ఇక మిగతా వారంతా వారి వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.


టెక్నీషియన్స్: 


నిజానికి ఇక్కడ సినిమా మొత్తం కేవలం వర్మ అనే ఒకే ఒక్క టెక్నికల్ అంశంగా చెప్పుకోవాలి. ఎప్పటి మాదిరే తన రొటీన్ టేస్ట్ తో మ్యూజిక్ నడిపించాడు. కళ్యాణీ మాలిక్ కష్టం స్పష్టంగా కనిపిస్తున్నా ఆ వెనుక ఉన్న వర్మ స్టైల్ ఆఫ్ మ్యూజిక్ సెన్స్ కనిపిస్తోంది.  సినిమాకు మరో ప్లస్‌ పాయింట్ కల్యాణీ మాలిక్ సంగీతం. పాటలతో పాటు నేపథ్య సంగీతంతోనూ సన్నివేశాల స్థాయిని పెంచాడు కల్యాణీ మాలిక్‌. ముఖ్యంగా ఎమోషనల్‌ సన్నివేశాల్లో సంగీతం సూపర్బ్ అనిపిస్తుంది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.  ఇక కెమెరా వర్క్ కూడా అద్బుతంగా ఉన్నా ఇక్కడా వర్మనే కనిపిస్తాడు. మొత్తానికి మామూలుగానే ఈసరి కూడా తన మార్ఖ్ అన్ని అంశాలమీదా ఉండేలా చూసుకున్నాడు రామ్ గోపాల్ వర్మ. కాబట్టి ఇక్కడ టెక్నికల్ అంశాలగురించి పెద్దగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. 

రివ్యూ

తన ప్రతీ సినిమాకి తీసుకున్నట్టే ఈ సినిమా పబ్లిసిటీ విషయంలోనూ ప్రత్యేక కాంట్రవర్సీలతో సినిమాని తీసుకిఉ వచ్చిన వర్మ తానుముందే చెప్పినట్టు నిజాలన్నీ తెరమీదకి ఎక్కించే ప్రయత్నం చేసాడు. అయితే ఎక్కడా ప్రేక్షకునికి తెలియని విషయం ఏమీలేదు.వర్మ మార్క్‌ టేకింగ్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. కొత్తగా చూపించింది ఏమన్నా ఉందీ అంటే ఎంటీఆర్, లక్ష్మీ పార్వతి మధ్య ఉన్న ప్రేమ సన్ని వేశాలే. అసలు ఆయన ఎందుకు ఒంటరిగా మిగిలాడు, ఆ సమయంలో లక్ష్మీ పార్వతి ఇచ్చిన మానసిక స్థైర్యం ఏమిటీ?  లక్ష్మీపార్వతి మీద ఎన్టీఆర్‌ కుటుంబం, ఆయన అల్లుడూ ఎలాంతి కుట్రలు చేశారూ? చివరకు ఎన్టీఆర్‌ మరణానికి కారణమైన వెన్నుపోటు వెనుక ఉన్న అసలు వ్యక్తి ఎవరు? వైశ్రాయ్ హొటల్ ఘటన ఇలా ఇప్పటీవరకూ మామూలు ప్రేక్షకునికి కేవలం మాటలుగా విన్న  ఈ సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించారు. వర్మ మార్క్‌ టేకింగ్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది.
ఎన్టీఆర్‌, లక్ష్మీల మధ్య సన్నివేశాలను వర్మ తెరకెక్కించిన విధానం ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. అయితే విపరీతమైన స్లోనరేషన్, సాగతీతగా ఉండే సెంటిమెంట్ సీన్లు బోర్ కొట్టించక మానవు. ఎన్టీఆర్ ఎంతగా కుమిలిపోయారు అన్న విషయాన్ని చెప్పటానికి ఆ సెంటిమెంట్ సీన్లని వాడినా మరీ ఓవర్ యాక్షన్ అనిపించేలా ఉన్న్నాయి కొన్ని సందర్భాలు. పాత్రల ఎంపికతోనే సగం విజయం సాదించిన వర్మ.. వారి నుంచి అద్భుతమైన నటనను రాబట్టుకోవటంలోనూ సక్సెస్‌ అయ్యాడు. ప్రతీ నటుడు తన పాత్రలో లీనమై సహజంగా నటించాడు. అయితే మొత్తంగా చూస్తే మాత్రం క్లైమాక్స్ కి వచ్చేసరికి అన్ని మైనస్ లని మర్చిపోయి మనలో ఎన్టీఆర్  అనే ఒక్క పాత్ర మాత్రమే నిలిచిపోతుంది. ఆయనకు జరిగిన అన్యాయం మాత్రమే గుర్తుంటుంది. ఈ రకంగా చూస్తే వర్మ లక్ష్యం నెరవేరినట్టే. 

ప్లస్ పాయింట్స్

కథ, స్క్రీన్ ప్లే 
వర్మ 
విజయ్ కుమార్ 
సినిమాటోగ్రఫీ 

మైనస్ పాయింట్స్


మ్యూజిక్ 
ఫస్టాఫ్ 
సాగతీత సెంటిమెంట్ సీన్లు
ఓవరాక్షన్ అనిపించే సందర్భాలు 
రేటింగ్: 3.0/5 
 
ఒక్క మాటలో:    కథా నాయకుడు , మహా నాయకులకన్నా నిజమైన ఎన్టీఆర్ ని నమ్ముకున్న వర్మ "సినిమా" గెలిచినట్టే