రాజ్యసభ లోనూ "అగ్రవర్ణ" హవా: ఈబీసీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

06:48 - January 10, 2019

విద్య, ఉద్యోగాల్లో అగ్రవర్ణాల పేదలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు రాజ్యసభలోనూ  సులభంగానే ఆమోదం లభించింది. బుధవారం జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 165 ఓట్లు వచ్చాయి. బిల్లుకు వ్యతిరేకంగా 7 ఓట్లు వచ్చాయి. ఓటింగ్ సమయంలో రాజ్యసభలో 172 మంది సభ్యులున్నారు. ఇక ఆర్థికంగా బలహీన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్ బిల్లు ( ఈబీసీ) త్వరలోనే చట్టరూపం దాల్చనుంది. చారిత్రాత్మక 124వ రాజ్యాంగ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. విపక్షాల సూచించిన సవరణ ప్రతిపాదనలు వీగిపోవడంతో. లోక్‌సభ ఆమోదం పొందిన బిల్లు రాజ్యసభలోనూ యథావిధిగా ఆమోదం పొందింది. 

ఈబీసీ బిల్లు చట్టబద్ధత కోసం ఆర్టికల్ 15, 16లకు కేంద్రం అదనపు క్లాజ్‌లను జోడించింది. ఆర్టికల్ 15కి క్లాజ్ (6), ఆర్టికల్ 16కి క్లాజ్ (6)ని జోడించింది. ఈబీసీ బిల్లుకు పెద్దలసభలో మూడింట రెండొంతులపైగా సభ్యులు మద్దతిచ్చారు. సభకు మొత్తం 172 మంది సభ్యులు హాజరవగా...165 మంది బిల్లుకు మద్దతు తెలిపారు. కేవలం ఏడుగురు మాత్రమే వ్యతిరేకంగా ఓటువేశారు. దాంతో ఈబీసీ బిల్లు పాసైందని డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ ప్రకటించారు. మంగళవారం లోక్‌సభ కూడా ఆమోదం తెలిపిన నేపథ్యంలో..త్వరలోనే రాష్ట్రపతి ముందుకు వెళ్లనుంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోద ముద్రవేసిన మరుక్షణమే చట్టరూపం దాల్చనుంది.

ఈ బిల్లు ఆమోదం పొందడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ‘‘124వ రాజ్యాంగ సవరణ పార్లమెంట్‌ ఉభయసభల్లో ఆమోదం పొందడం చాలా సంతోషంగా ఉంది. ఈ బిల్లుకు ఇంతటి మద్దతు రావడం హర్షనీయం. దీని ద్వారా సామాజిక న్యాయం గెలిచినట్లైంది. ఈ బిల్లుపై సభలో గొప్ప చర్చ జరిగింది. సభ్యులు బిల్లుపై తమ అభిప్రాయాలను మనస్ఫూర్తిగా వెల్లడించారు. ఈ సందర్భంగా భారత్‌‌ను మహత్తర శక్తిగా రూపొందించిన రాజ్యంగ రూపకర్తలకు, స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులు తెలుపుతున్నా’’ అంటూ మోదీ ట్వీట్ చేశారు.