బీజేపీకి షాక్‌ ఇచ్చిన మీడియా ప్రతినిధులు

17:13 - February 7, 2019

అధికారంలో ఉన్నాం కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే... ఈ తరహా పరిస్థితులే ఎదురవుతాయని బీజేపీ ఇప్పటికైనా గుర్తించిందో లేదో తెలియదు గానీ... ఈ వినూత్న నిరసనతో అయితే మాత్రం తప్పకుండా ఈ విషయంపై ఆ పార్టీ నేతలు దృష్టి సారించక తప్పని పరిస్థితి. అయినా అంతలా ఆ పార్టీ నేతలకు ఎలాంటి విపరిణామాలు ఎదురయ్యాయన్న విషయానికి వస్తే.. ప్రెస్ మీట్కు రమ్మని మీడియాకు ఆహ్వానం పంపితే... మీడియా ప్రతినిధులంతా ఏకంగా హెల్మెట్లతో ఆ మీట్ కు హాజరై... కలమనాథులకు షాకిచ్చారు. వివరాల్లోకి వెలితే... ఛత్తీస్ గఢ్ లోని రాయపూర్లో మొన్నామధ్య  జరిగిన బీజేపీ భేటీని కవర్ చేసేందుకు వెళ్లిన ఓ మీడియా ప్రతినిధిపై అక్కడి స్ధానిక బీజేపీ నేతలు దాడి చేశారు. ఈ దాడిలో సదరు మీడియా ప్రతినిధికి తలకు బలమైన గాయం కాగా... అతడి చేతిలోని కెమెరాను లాక్కున్న బీజేపీ నేతలు... దానిలో రికార్డ్ అయిన తమ భేటీ వివరాలను తొలగించేశారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన మీడియా ప్రతినిధులు బీజేపీకి గుణం పాఠం చెప్పి తీరాల్సిందేనని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే నేటి బీజేపీ ప్రెస్ మీట్ లో వినూత్న నిరసన తెలపాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ఇళ్ల వద్ద నుంచి బీజేపీ ప్రెస్ మీట్ కు బయలుదేరిన మీడియా ప్రతినిధులు... హెల్మెట్లతోనే అక్కడికి వెళ్లారు. తీరా అక్కడికెళ్లిన తర్వాత తలలపై పెట్టుకున్న హెల్మెట్లను తీయకుండానే... హెల్మెట్లతోనే మీడియా సమావేశానికి హాజరయ్యారు. ఇది చూసి షాక్‌ అయిన బీజేపీ నేతలు...ఇదేంటీ... అంతా హెల్మెట్లతో ప్రెస్ మీట్ కు వచ్చారన్న  ప్రశ్నలకు కాస్తంత ఘాటుగా సమాధానం ఇచ్చిన జర్నలిస్టులు....మీరు దాడి చేస్తే... ఈ సారి తలలకు గాయాలు కాకుండా ఉండేందుకే ఇలా హెల్మెట్లతో ప్రెస్ మీట్ కు వచ్చామని బదులిచ్చారట. నాటి ఘటనలో మీడియా ప్రతినిధుల ఫిర్యాదు మేరకు నయా రాయపూర్ బీజేపీ చీఫ్ తో పాటు దాడి చేసిన నలుగురు వ్యక్తులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయినా కూడా మీడియా ప్రతినిధులు తమ వినూత్న నిరసన ద్వారా బీజేపీకి షాకిచ్చారట