ఎంపీల మూకుమ్మడి రాజీనామాల పర్వం మళ్లీ రిపీట్‌ అవుతుందా?...

11:40 - February 13, 2019

దాదాపు మూడు దశాబ్దాల కిందట.. 1989 జూలై నెలాఖరు! బోఫోర్స్‌ స్కాంలో ఆరోపణల నేపథ్యంలో రాజీనామాకు అప్పటి ప్రధాని రాజీవ్‌ గాంధీ నిరాకరించారు. జేపీసీకీ తిరస్కరించారు! ఎన్టీ రామారావు నేతృత్వంలోని నేషనల్‌ ఫ్రంట్‌ ఊహించని నిరసనకు దిగింది. ఏకంగా 12 ప్రతిపక్ష పార్టీలకు చెందిన 106 మంది ఎంపీలు రాజీనామా చేశారు. దాంతో, లోక్‌సభ సంక్షోభంలో పడింది. మళ్ళీ ఇప్పుడు అలాంటిదే రిపీట్‌ అవ్వనుందా?..అంటే అవుననే అంటున్నారు పలువురు రాజకీయ ప్రముఖులు. రాఫెల్‌ కుంభకోణంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీని నియమించడానికి మోదీ సర్కార్‌ నిరాకరించడం, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించకపోవడం, దేశంలో ప్రతిపక్ష పార్టీలపై అణచివేత చర్యలకు పాల్పడడానికి నిరసనగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన లోక్‌సభ ఎంపీలు రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించాలని ప్రతిపక్ష నేతలు భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు వివిధ పార్టీలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇదే ప్రతిపాదనపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీతో చర్చలు జరిపారు. ఈ లోక్‌సభకు చివరి సమావేశాల్లో చివరి రోజు రాజీనామాలు చేస్తే ఎంత మేరకు ప్రభావం ఉంటుంది!?అనే అంశంపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాగా, బోఫోర్స్‌ విషయంలో, ఎన్టీఆర్‌ హయాంలో అప్పట్లో 106 మంది ఎంపీలు రాజీనామా చేయగా.. ఇప్పుడు అంతకంటే ఎక్కువగా దాదాపు 10పార్టీలకు చెందిన 210 మంది ఎంపీలు రాజీనామాకు సిద్ధపడవచ్చునని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.